మమతకు ఎదురుదెబ్బ...
పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ తలపెట్టిన ‘రథయాత్ర’కు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో మత ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందంటూ బీజేపీ ‘రథయాత్ర’కు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. కాగా ర్యాలీ ప్రవేశించేందుకు కనీసం 12 గంటల ముందు ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం ఇవ్వాలంటూ బీజేపీకి జస్టిస్ తపబ్రత చక్రవర్తి ఆదేశించారు. చట్టానికి లోబడి ‘యాత్ర’ నిర్వహించాలనీ... వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కూడా బీజేపీ నేతలకు ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆస్తులకు ఏమాత్రం నష్టం వాటిల్లినా బీజేపీ నాయకత్వమే బాధ్యత వహించాలని జస్టిస్ చక్రవర్తి పేర్కొన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం జరగకుండా పోలీసులు తగు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ‘రథయాత్ర’ నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు నెలన్నర రోజులకు పైగా రాష్ట్రంలోని 42 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో బీజేపీ నేతలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Post a Comment