హైదరాబాద్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు...
దేశ ప్రధానికి వండి, వడ్డించడమంటే... కనీసం అయిదు నక్షత్రాల హోటల్‌లో చేయి తిరిగిన నలభీములు అయ్యుండాలి కదా... కానీ... హైదరాబాద్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఓ సామాన్యురాలి చేతి వంట రుచి చూడబోతున్నారు... నేపథ్యం అతి సాధారణమైనా తెలంగాణ రుచుల తయారీలో మాత్రం అసామాన్యురాలీమె... అందుకే ఏరికోరి ఎంపికచేశారు... జులై 2 నుంచి జరగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీకి అచ్చ తెలంగాణ వంటలు రుచి చూపించాలని నిర్ణయించారు. దీనికోసం కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపికచేశారు. 29 సంవత్సరాలుగా వంటలు చేస్తూ జీవిస్తున్న యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం. 15వ ఏటనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో కరీంనగర్ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఆహా అనకుండా ఉండలేరని చెబుతారు. 10వేల మందికి కూడా ఇట్టే వండివార్చేస్తారు యాదమ్మ. మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ పాల్గొన్న కార్యక్రమాలతో పాటు భాజపా రాష్ట్ర అధ్...