తెలంగాణలోనే కాకుండా జాతీయస్థాయిలో సైతం బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలని... సీఎం

తెలంగాణలోనే కాకుండా జాతీయస్థాయిలో సైతం బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలని... సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి.... అన్న సామెత గుర్తుకొస్తోంది. కాషాయదళాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ వేస్తున్న అడుగులు తప్పటడుగులు తప్ప ఇంకేం కాదనడానికి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయమే పెద్ద ఉదాహరణ. జాతీయస్థాయిలో కాంగ్రెస్సేతర... బీజేపీయేతర కూటమి అంటూ బీరాలు పలికిన ఈ పెద్ద మనిషి... విపక్ష అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఎంపిక అనంతరం అయనకు మద్దతునిచ్చే విషయంలో ఏ నిర్ణయమూ వెంటనే చెప్పక... బీజేపీని అడ్డుకునే విషయంలో తాను నిజాయితీగానే ఉన్నట్టు నటించి... చివరికి ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న విపక్షకూటమి అభ్యర్థికే మద్దతు పలికి తమ గులాబీ రంగు ఎప్పటికైనా వెలిసిపోయేదే... కాంగ్రెస్‌తో కలిసిపోయేదే అన్నట్టుగా అసలు రంగు బయటపెట్టుకున్నారు. మరోవైపు కేసీఆర్ మేకపోతు గాంభీర్యానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ తీరు కూడా ఉంది. తెలంగాణలో టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలు నానా విమర్శలూ చేసుకుంటున్నట్టు పైకి బిల్డప్పులిస్తుంటే... జాతీయ స్థాయిలో మాత్రం రాహుల్, సోనియాలు ఏమీ స్పందించరు. పైగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు సమయంలో కాంగ్రెస్, టీఆరెస్ యువరాజులు రాహుల్, కేటీఆర్... ఇద్దరూ కలసికట్టుగా ఉల్లాసంగా కనిపించారు. ఇంకోపక్క ఇలాంటి విషయాల్లో ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఎంతమాత్రం టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలకి భిన్నంగా వ్యవహరించదని అందరికీ తెలుసు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం పరస్పరం విమర్శించుకున్న టీఆరెస్, ఎంఐఎంలు తర్వాత ఎంత అన్యోన్యంగా ఉన్నాయో అందరికీ చూస్తున్నరు. ఇన్నాళ్ళూ సయామీ ట్విన్స్‌గా ఉంటూ వచ్చిన టీఆరెస్, ఎంఐఎంలకి కాంగ్రెస్ కూడా తోడై మూడు పార్టీలు కలసి సయామీ ట్రిప్లెట్స్ అవతారమెత్తాయి. తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడంలో పోటీపడుతున్నాయి. కేసీఆర్ ఎంత కిందా మీదా పడినా ఆయన ప్రతిపాదించిన ఆ బీఆరెస్‌కి స్పందన వస్తే ఒట్టు. ఈ సయామీ ట్రిప్లెట్స్‌తో సహా కేసీఆర్ బీఆరెస్‌కి.... రాష్ట్రంలో దాని మాతృపార్టీ టీఆరెస్‌కి ప్రజలు వీఆరెస్ ఇవ్వడం ఖాయం.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!