ముఖ్యమంత్రి నివాసం నుంచి కుటుంబంతో సహా బయటకు వెళ్లిపోయిన ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తన అధికారిక నివాసం నుంచి బుధవారం రాత్రి బయటకు వెళ్లిపోయారు
ఆయన వెనుకే ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే, ఆయన సోదరుడు తేజస్ ఠాక్రే, వారి తల్లి రష్మీ ఠాక్రేలు కూడా ఆ నివాసం నుంచి వెళ్లిపోయారు.
నివాసం వెలుపల భారీగా పోగైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ‘ఉద్ధవ్ మీరు వెళ్లండి.. మీ వెంటే మేమున్నాం’ అంటూ నినాదాలు చేశారు.
అసహజ సంకీర్ణం’ నుంచి తప్పుకోవాలి: ఏక్‌నాథ్ షిందే
దీనికి ముందు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిందే అస్సాం రాజధాని గౌహతిలో బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన మనుగడ సాగించాలంటే ‘అసహజ సంకీర్ణం’ నుంచి శివసేన బయటపడాల్సి ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రెండున్నరేళ్ల సంకీర్ణ ప్రభుత్వ హయాంలో భాగస్వామ్య పార్టీలే లాభపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఏక్‌నాథ్ షిందే కొందరు తిరుగబాటు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని మంగళవారం నాడు ముంబై నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు చేరుకోవటంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలైంది.
ఆయన బుధవారం సాయంత్రం సూరత్ నుంచి తనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు సహా అస్సాం రాజధాని గౌహతి చేరుకున్నారు.
తనకు ఏడుగురు స్వతంత్ర శాసనసభ్యులు సహా మొత్తం 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.
Comments
Post a Comment