తిరుగులేని నేతగా పేరున్న ఆయనకు చెక్‌పెట్టడానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్..?

కాంగ్రెస్ ఉద్దండులను దెబ్బతీయడానికి సీఎం కేసీఆర్ ఏ వ్యూహం అమలుచేస్తున్నారు? ఆయా నేతల నియోజకవర్గాల్లో ఎలాంటి పనులు చేపడుతున్నారు? నోడల్ అధికారులతో ప్రత్యేక యంత్రాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్టు? నల్లగొండలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల సంగతేంటో ఈ స్టోరీలో వివరంగా చూద్దాం..

కాంగ్రెస్ కంచుకోటగా ముద్రపడిన నల్లగొండ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఉద్దండులైన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ జిల్లానుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలోనే వీరికి చెక్‌పెట్టడానికి టీఆర్‌ఎస్‌ నేతలు రంగం సిద్ధంచేశారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రమైన నల్లగొండ అసెంబ్లీ స్థానాన్ని తొలి టార్గెట్‌గా చేసుకున్నారు. ఇదే తరహా ప్రణాళిక మిగతా నియోజకవర్గాల్లోనూ అమలుచేసి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనేది వారి ప్రధాన వ్యూహమట.


            ఇప్పటికే నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తన ఆపరేషన్‌ మొదలుపెట్టింది. స్పష్టమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళుతోంది. సీఎం కేసీఆర్‌ నేరుగా దృష్టి సారించడంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కేసీఆర్‌పై నేరుగా విమర్శలు గుప్పించడం ద్వారా సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిత్యం వార్తల్లో నానుతుంటారు. కేసీఆర్‌ను పలుమార్లు ఐరన్ లెగ్‌గా ఆయన అభివర్ణించారు. "గజ్వేల్‌లో నేను పోటీచేసినా 50వేల మెజారిటీతో గెలుస్తాను'' అంటూ కేసీఆర్‌ని తీసిపారేస్తుంటారు. కాంగ్రెస్ ఎంపీగా గెలిచి టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన గుత్తా సుఖేందర్‌రెడ్డితోనూ కయ్యానికి కాలుదువ్వడం కోమటిరెడ్డికి అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిపై జిల్లా ముఖ్యులతోపాటు సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి.

               జరుగుతున్న పరిణామాలు కూడా ఇందుకు తగ్గట్టే ఉన్నాయి. నల్లగొండ ప్రజల అవసరాలు ఏంటి? తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలేంటి? వాటికి అవసరమైన నిధులు ఎంత? వంటి అంశాలపై సీఎం కేసీఆర్‌ గత కొద్దిరోజులుగా ఫాలోఅప్ చేస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌తో కూడా సీఎం కేసీఆర్‌ పలుమార్లు నేరుగా మాట్లాడారట. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రాజెక్టుల గురించి ఆరాతీశారట. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధంచేయమని కలెక్టర్‌ను ఆదేశించినట్టు సమాచారం.

               నల్లగొండలో తొలిదశలో 500 కోట్లరూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. నల్లగొండ జిల్లాకు త్వరలో మెడికల్ కాలేజీ, ఐటీ పార్క్‌ను మంజూరు చేస్తూ ప్రకటనలు వెలువడబోతున్నాయట. ఇందుకు సంబంధించిన గ్రౌండ్‌వర్క్ కూడా పూర్తయ్యింది. పదివేల డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళు, శిల్పారామం ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. పాడుబడిన బంగ్లాను తలపించే టౌన్‌హాల్‌ను రవీంద్రభారతి తరహాలో నిర్మించేందుకు డిజైన్లు ఖరారుచేశారు. భారీ తరహాలో మటన్, కూరగాయాల మార్కెట్ల నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చేశారు. సీఎం విడుదల చేసిన 19 కోట్లరూపాయల ప్రత్యేక నిధులతో రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వీటికితోడు మెడికల్ కాలేజీని ప్రకటిస్తే... దానికి అనుబంధంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిని తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్తగా మాతా-శిశు సంక్షేమ కేంద్రం, అదనంగా 150 పడకలతో ఆసుపత్రి నూతన భవనం నిర్మాణాలు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన పెండింగ్‌ పనులను పూర్తిచేసేందుకు కూడా నిధులు మంజూరుచేశారు.

            తన కలల ప్రాజెక్టు అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పుకునే పానగల్ ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులను సైతం ఇప్పుడు వేగవంతం చేశారు. దీనిపై ప్రత్యేకంగా మంత్రి హరీశ్‌రావు దృష్టిపెట్టారు. పలుమార్లు ప్రాజెక్టు పనులను తనిఖీ చేశారు. డిసెంబర్‌లో ట్రయల్ రన్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ మధ్య కూడా హరీశ్‌రావు జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే వీరేశం క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. అధికారులకు తగిన దిశానిర్దేశం చేశారు. ఎస్ఎల్‌బీసీ సొరంగమార్గం పనులను కూడా వేగవంతం చేశారు.

                  నల్లగొండలో చేపట్టిన అభివృద్ధి పనులపై పలుమార్లు సీఎం కేసీఆర్‌ జిల్లా ముఖ్యులతో సమీక్షలు జరిపారు. ఇక నియోజకవర్గానికి గుండెకాయ వంటి నల్లగొండ మున్సిపాలిటీపైనా ఆయన గురిపెట్టారు. ఈ మున్సిపాలిటీలోని 40 వార్డులకు జిల్లాస్థాయి అధికారులతో కూడిన 40 కమిటీలను ఏర్పాటుచేశారు. ఆయా వార్డులలో ప్రజల సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం రోడ్‌మ్యాప్ రూపొందించి ఆయా కమిటీలు ప్రభుత్వానికి సమర్పిస్తాయి.

కొత్త ప్రతిపాదలనకు తగ్గట్టుగా ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని భావిస్తున్నారు. తద్వారా మున్సిపాలిటీలో ప్రజల మన్ననలు పొందాలనీ, కోమటిరెడ్డికి చెక్‌ పెట్టాలనీ కేసీఆర్‌ పథకం పన్నారు. దసరా అనంతరం ఈ పథకం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చనుంది. నేరుగా జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. మరోవైపు ఎప్పటినుంచో పెండింగ్ డిమాండ్‌గా ఉన్న బత్తాయి మార్కెట్ నిర్మాణాన్ని సైతం స్పీడప్ చేశారు. తద్వారా రైతుల అభిమానాన్ని చూరగొనవచ్చునన్నది కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్. ఇలాంటి అనేక అభివృద్ధి పథకాలతో, ప్రణాళికలతో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంపై పట్టు సాధించాలన్నది అధికారపార్టీ ముఖ్యుల లక్ష్యంగా కనిపిస్తోంది.

                     దసరా అనంతరం సీఎం కేసీఆర్‌ నల్లగొండ పర్యటనకు వస్తారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా చేపట్టబోయే పథకాల గురించి కూడా ఈ సందర్భంగా కేసీఆర్‌ అధికారిక ప్రకటనలు చేసే అవకాశముందట. ఎలాగైనా సరే... నల్లగొండలో తిరుగులేని నేతగా పేరున్న కోమటిరెడ్డికి చెక్ పెట్టాలని టీఆర్ఎస్ మంకుపట్టుతో దూసుకుపోతోంది. పనిలో పనిగా నల్లగొండ ఎంపీ స్థానానికి ఉపఎన్నిక వచ్చినా... లబ్ధిచేకూరేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. చూద్దాం.. కేసీఆర్‌ వ్యూహం, నల్లగొండ తెరాస నేతల పట్టుదల ఎంతవరకూ నెరవేరతాయో!

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!