మనం చేసే పనే మోడీ చేస్తే కోపమేల జితేందర్ జీ?
గులాబీ నేతలకు కోపం వచ్చేస్తుంటుంది. చేతిలో అధికారం ఉన్నా.. లేకున్నా ఎవరో ఒకరిని తప్పు పట్టటం.. వారి మీద ఆవేశాన్ని ప్రదర్శించటం చేస్తుంటారు. పవర్ చేతిలో లేనప్పుడు పనులు చేయలేకపోతున్న బాధ సహజం. దాన్ని అర్థం చేసుకోవచ్చు. చేతిలో తిరుగులేని అధికారం ఉన్న వేళ కూడా తిట్ల దండకం అందుకోవటంలో అర్థమేమైనా ఉందా? అన్నది వారికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. అందరితో పంచాయితీలు పెట్టుకుంటే పనులు పూర్తి కావు. ఆ విషయం టీఆర్ఎస్ నేతలకు తెలియంది కాదు. కానీ.. అప్పుడప్పుడు తమ వైఫల్యాల్ని ఎవరో ఒకరి మీద పెట్టేసి.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టటం ఒక అలవాటుగా మారిందన్న విమర్శ ఉంది. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవహారమే చూస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.5వేల కోట్ల బకాయిలు ఉన్నాయని.. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు..ఈసారైనా బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. బీజేపీ మాటల ప్రభుత్వమేనని తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. మూడున్నరేళ్లుగా కేంద్రం హామీలతోనే సరి పెడుతోందన్న అసంతృప్తి వ్యక్తం చేసిన జితేందర్.. మాటలతో ఊరుకునేది లేదని చేతల్లో పనులు పూర్తి చేయాల్సిందేనన్నారు. హైకోర్టు.. స్టీల్ ఫ్లాంట్.. హార్టీకల్చర్ వర్సిటీ.. ఎయిమ్స్ నిధులపై ఈసారి బడ్జెట్‌లో ప్రకటన వస్తుందని తాము ఆశిస్తున్నట్లుగా చెప్పారు. కేంద్రం తీరును తెలంగాణ ప్రజలు ఊరుకోరని.. తగిన బుద్ధి చెబుతారంటూ శాపనార్థాలు పెడుతున్న జితేందర్ రెడ్డి మాటలు కొన్ని చిత్రంగా ఉంటాయని చెప్పాలి. కేంద్రంతో పేచీ పెట్టుకొని సాధించేదేమీ లేదన్న విషయం గులాబీ ఎంపీకి తెలియంది కాదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎందుకు ఆగుతున్నాయన్న విషయాన్ని చెప్పటం వదిలేసి.. ఏదో చెప్పామంటే చెప్పామన్నట్లుగా నాలుగు మాటలు చెప్పేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. బీజేపీది మాటల ప్రభుత్వమేనంటూ విమర్శలు చేస్తున్న జితేందర్.. తెలంగాణ అధికారపక్షంగా తాము సైతం అదే తీరును ప్రదర్శిస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. పెద్ద పెద్ద హామీల్ని పక్కన పెడితే.. హైదరాబాద్ మహానగరంలో ఆ మధ్యన వరుస పెట్టి మరీ వివిధ కులాలకు భూములు కేటాయించిన విషయాన్ని మర్చిపోకూడదు. భూములు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేయటంతో పాటు.. ఆ భూమిలో నిర్మించాల్సిన భవన సముదాయాలకు కోట్ల లెక్కన నిధులు మంజూరు చేస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేశారు. మరి.. మూడున్నరేళ్లలో ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క భవన్ పూర్తి అయ్యిందా? ఈ విషయాన్ని వదిలేద్దాం. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో.. 2019 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని సురక్షిత తాగునీటిని అందిస్తామని..తాము చెప్పిన పని చేయకుంటే ఓట్లే అడగమని చెప్పారు. కేసీఆర్ మాట చెప్పాడంటే తల తెగినా వెనక్కి తగ్గేది లేదని చెబుతుంటారు. అదే నిజమైతే..ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు ఏర్పాటు చేయకపోతే ఓట్లు అడగమని.. బరిలోకే దిగమని ఇప్పుడు కూడా చెబుతారా? అన్నది ప్రశ్న.
ప్రతి విషయానికి ప్రజలే బుద్ది చెబుతారంటున్న జితేందర్ సాబ్ మాట విన్నంతనే ఒక సందేహం తన్నుకొస్తుంది. ప్రజలే బుద్ది చెప్పేటట్లైయితే.. మీ చేతికి పాలనా దండం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప‌్రజలే చూసుకునే పక్షంలో అధికారపక్షం ఎందుకు? ఏదో మాట్లాడామంటే మాట్లాడామన్నట్లుగా.. కెమేరాల మీద చెలరేగిపోవటంలో అర్థం లేదన్నది మర్చిపోకూడదు. మోడీ లాంటి నేత ప్రధానిగా ఉన్న వేళ.. మీడియా ముందుకొచ్చి అదే పనిగా నోరు పారేసుకోవటం వల్ల ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువన్న విషయం ఎంపీ జితేందర్ రెడ్డి గుర్తు పెట్టుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేలెత్తి చూపించే ముందు.. నాలుగు వేళ్లు తమను ప్రశ్నిస్తూ ఉంటాయన్న చిన్న విషయాన్ని ఎంపీ జితేందర్ సాబ్ లాంటోళ్లు గుర్తిస్తే మంచిది.
Comments
Post a Comment