ప్ర‌జ‌లు నిజాయితీతో కూడిన పాల‌న కోరుకుంటున్నార‌ని, కాని ఉచితాల‌ను కోరుకుంటార‌న్న‌ది ఒక భ్ర‌మ అని ప్ర‌ధాని మోడీ అన్నారు.

ప్ర‌జ‌లు నిజాయితీతో కూడిన పాల‌న కోరుకుంటున్నార‌ని, కాని ఉచితాల‌ను కోరుకుంటార‌న్న‌ది ఒక భ్ర‌మ అని ప్ర‌ధాని మోడీ అన్నారు. రానున్న బడ్జెట్‌పై ప‌లు సంకేతాలిచ్చారు. గత మూడున్నరేళ్ల తన పాలనపై రిపోర్ట్‌ కార్డును, భవిష్యత్‌ పాలన ప్రాథమ్యాలను మోడీ వెల్లడించారు. అన్నదాతను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. జీఎస్టీ, ఉద్యోగ కల్పన, కాంగ్రెస్‌ ముక్త భారత్, నోట్ల రద్దు, న్యాయవ్యవస్థ, వ్యవసాయ సంక్షోభం, విదేశాంగ విధానం.. తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. ‘ఆంగ్ల న్యూస్‌ చానెల్‌ ‘టైమ్స్‌ నౌ’ మోడీ ఇంటర్వ్యూను ఆదివారం ప్రసారం చేసింది. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక అం శాలపై ప్రధాని స్పందించారు. ఇంటర్వ్యూ లో ప్ర‌ధాని మాటల్లోనే..

జీఎస్టీ...
జీఎస్టీ.. పన్నుల సంస్కరణలో ఓ కీలక ముందడుగు. దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ ఉండాలన్న ఈ విధానంలోని లోపాలను సరిదిద్దే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చట్టాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తాం. దీర్ఘకాలంలో జీఎస్టీ వల్ల దేశ ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కొత్త మార్పు వస్తున్నప్పుడు ఆరు నెల‌లు, ఏడాది, రెండేళ్లు సమయం పడుతుండవచ్చు. కానీ అన్నీ అడ్డంకులూ తొలగిపోతాయి. ఇందుకు అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. స్వార్థ రాజకీయాలు చేయటం మంచిది కాదు. జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలకూ ప్రాతినిధ్యముంది. కౌన్సిల్‌ భేటీలో సానుకూలంగా మాట్లాడి.. బయటికొచ్చాక విమర్శలు చేస్తున్నారు. పార్లమెంటులోనూ అంతే.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. దీనిపై మేమేమీ మాట్లాడబోం. నోట్ల రద్దు కూడా ఒక విజయగాధ.  

ట్రిపుల్‌ తలాక్‌..
ఏ రాజకీయ పార్టీయైనా దేశం కన్నా గొప్పది కాదు. అన్నింటికన్నా ముందు దేశమే గొప్ప‌ది. అలాంటి దేశంలో బాధిత వర్గానికి మేలు చేసే చట్టం వస్తున్నప్పడు దీన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవటం బాధాకరమే. రాజీవ్‌ గాంధీ చేసిన పొరపాటు (1985లో షాబానో కేసులో)ను కాంగ్రెస్‌ మళ్లీ మళ్లీ చేస్తోంది. ట్రిపుల్‌ తలాక్‌ బాధితుల కథనాలు బాధాకరం. అలాంటి బాధితులకు సరైన గౌరవం కల్పించటం మా బాధ్యత. కాంగ్రెస్‌ దీన్ని రాజకీయం చేద్దామనుకుంటోంది. 

ఉద్యోగకల్పన..
ఉపాధి గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. దేశంలో ఓ స్వతంత్ర సంస్థ జరిపిన విచారణలో.. ఏడాదిలో 18–25 ఏళ్ల లో ఉన్న యువకులతో 70 లక్షల కొత్త ఈపీఎఫ్‌ అకౌంట్లు వచ్చినట్లు తేలింది. ఇది ఉపాధి కల్పన కాదా? రోడ్లు, రైలు పట్టాల నిర్మాణంలోనూ ఉపాధి పెరిగింది. ముద్ర పథకం ద్వారా 10 కోట్ల మందికి రూ.4లక్షల కోట్ల రుణాలిచ్చాం.

సుప్రీం సంక్షోభం..
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా వారి అంతర్గత విషయం. ఈ వివాదానికి రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలి. మన దేశ న్యాయవ్యవస్థ చాలా గొప్పది. దీనిలో భాగస్వాములైన వారంతా చాలా గొప్పవారు, సమర్థులు. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకముంది. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. జమిలీ ఎన్నికలు జరపాలని మేం కోరుకుంటున్నాం. అయితే ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలి.  బడ్జెట్‌కు ఓ తేదీ ఉన్నట్లే.. ఎన్నికలకూ ఐదేళ్లకోసారి ఓ తేదీని ఫిక్స్‌చేయాలి. దీని ద్వారా ఖర్చులు తగ్గుతాయి. చాలా మేలు జరుగుతుంది.  

రానున్న బడ్జెట్‌..
మొదటినుంచీ పాపులిజం (ప్రజాకర్షక విధానాలు)కు వ్యతిరేకం. బడ్జెట్‌ విషయంలో ఆర్థిక మంత్రి, దీనికో బృందం పనిచేస్తుంది. ఇందులో నేను ఏ మాత్రం జోక్యం చేసుకోను. సామాన్యప్రజలు ఏవీ ఉచితంగా కోరుకోరు. వారలా కోరుకుంటారనుకోవడం భ్రమ. ప్రజలు నిజాయితీతో కూడిన పాలనను కోరుకుంటారు.

వ్యవసాయ సంక్షోభం..
అన్నదాతను ఆదుకోవటం మనందరి బాధ్యత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా మరింత కృషిచేయాల్సిన అసవరముంది. మా ప్రభుత్వం తీసుకొస్తున్న పలు పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌పై దృష్టిపెట్టాం. రైతు ఉత్పత్తులకు వాల్యూ అడిషన్‌ చేస్తాం.  

కాంగ్రెస్‌ ముక్త భారత్‌
కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అంటే రాజకీయంగా ఆ పార్టీని అంతం చేయడం కాదు. అవినీతి, కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, ప్రజలను మోసం చేయటం వంటి లక్షణాలున్న కాంగ్రెస్‌ సంస్కృతిని అంతం చేయడం ఆ నినాదం ఉద్దేశం. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌ సంస్కృతి వేరు. ఆ తర్వాతే వారి ఆలోచనా ధోరణి, సంస్కృతిలో చాలా మార్పు వచ్చింది. కాస్త అటుఇటుగా అన్ని పార్టీలకూ ఈ ఆలోచన అలవడింది. కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అంటున్నానంటే.. అది ఒకపార్టీని ఉద్దేశించినట్లు కాదు. ఆ పార్టీ ఆలోచనలతో నిండిన సంస్కృతిని విమర్శించినట్లు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!