దేశంలో ఇప్పటికీ ఎక్కువ మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు పెంచారు. గిట్టుబాటు ధరలు దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులను తగ్గించడానికి..

దేశంలో ఇప్పటికీ ఎక్కువ మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు పెంచారు. గిట్టుబాటు ధరలు దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులను తగ్గించడానికి.. మద్దతు ధరను సమీక్షించబోతున్నారు. ప్రధాన పంటలను సాగు చేయడానికి రైతు కయ్యే ఖర్చుకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధరను ప్రకటిస్తామనడం ద్వారా.. రైతులను ఖుషీ చేశారు. దీనికి తోడు ఉల్లి, టమాటా, బంగాళా దుంపల ధరలను స్థిరీకరించేందుకు ఆపరేషన్ గ్రీన్‌ ప్రకటించడం ద్వారా.. అటు రైతులను, ఇటు వినియోగదారులను ఆకట్టుకున్నారు జైట్లీ.

బీజేపీకి ఓట్లు కురిపించగలిగే మరో అస్త్రం.. ఆయుష్మాన్ భారత్‌. జనాన్ని ఆకర్షించడానికి మోడీ చేసిన మరో మ్యాజిక్ ఇది. దేశంలో దాదాపుగా 50 కోట్ల మంది కవర్‌ అయ్యేలా.. 10 కోట్ల కుటుంబాలకు ఏటా 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రవేశ పెట్టింది కేంద్రం. రోజురోజుకూ పెరుగుతున్న వైద్య ఖర్చులను తట్టుకోలేని కుటుంబాలకు ఇది నిజంగా వరమనే చెప్పాలి. దీంతో పాటు ప్రజలకు అందుబాటులోకే సంపూర్ణ వైద్య చికిత్సలను ఉచితంగా అందుబాటులోకి తేవడానికి దేశ వ్యాప్తంగా లక్షా 50 వేల హెల్త్ అండ్ వెల్‌ నెస్‌ సెంటర్లనూ ఏర్పాటు చేయనున్నారు. సమీకృత ఆరోగ్య సేవలతో పాటు, దీర్ఘ కాలిక రోగాలు, మాతాశిశు వైద్య సేవలూ ఈ సెంటర్లలో అందుబాటులోకి రానున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో ఏర్పడితే.. మోడీ సర్కార్‌ను జనం నెత్తిన పెట్టుకోవడం ఖాయమే. 

ఇక  మహిళలనూ ఆకట్టుకునేందుకు స్వయం సహాయక బృందాలకు 75వేల కోట్ల రుణాలు ఇవ్వబోతున్నారు. పేదలను ఆకట్టుకోవడానికి ఈ ఏడాదే కోటి ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2022 నాటికి ప్రతీ కుటుంబానికి ఇల్లు ఉండాలన్నదే తమ లక్ష్యమని బడ్జెట్‌ సాక్షిగా మరోసారి హామీ ఇచ్చింది మోడీ సర్కార్.   

అత్యంత కీలకమైన ఆదాయపన్ను శ్లాబుల విషయంలోనూ ఆచి తూచి వ్యవహరించారు జైట్లీ. మెప్పించక, నొప్పించక అన్నట్లు.. కేంద్రానికి భారీగా లోటు రాకుండానే.. వ్యక్తిగత ఆదాయపన్ను కట్టే వారికి స్వల్ప ఊరట ఇచ్చారు. ఆదాయపన్ను కట్టే వారికి 40వేల వరకూ మినహాయింపు ఇచ్చారు. ఇక చిన్న, మధ్య, సూక్ష్మ రంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతానికి తగ్గించారు. దీంతో.. చిన్న వ్యాపారుల మెప్పును జైట్లీ పొందారనే చెప్పొచ్చు.

దళితులు, గిరిజనులనూ  మెప్పించేందుకూ ఈ బడ్జెట్‌లో ప్రయత్నాలు జరిగాయి. ఎస్సీలకు 52 వేల 716 కోట్ల నిధులు కేటాయించగా, గిరిజనులకు 32 వేల 508 కోట్లను అందించారు. నవోదయ విద్యాలయాల తరహాలో ఎస్టీలకు ప్రత్యేకంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు.  విద్యా వ్యవస్థలో మౌలిక సదుపాయాల ప్రక్షాళన కోసం వచ్చే నాలుగేళ్లలోనే  లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్నారు జైట్లీ. 

ఇక ఓటు హక్కు వచ్చిన విద్యార్థులనూ మెప్పించడానికి ఓ స్పెషల్ స్కీమ్‌నూ ప్రవేశపెట్టారు. ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్‌ ఫెలోస్‌ స్కీమ్ కింద వెయ్యి మంది బీటెక్ విద్యార్థులను ఎంపిక చేసి ఐఐటీ, ఐఐఎస్సీలో పీహెచ్‌డీ  చేసే అవకాశం కల్పించడంతో పాటు, ఆకర్షణీయమైన  ఫెలోషిప్‌ను అందించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన లాంటి పథకాలకూ నిధులు పెంచడం ద్వారా జనం దృష్టిని ఆకర్షించారు జైట్లీ. గుజరాత్‌ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు దూరం కావడంతో.. ఈ బడ్జెట్‌తో ఆ వర్గానికి మళ్లీ దగ్గరయ్యేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!