హౌరా..! బ్రిడ్జ్‌ను తినేస్తున్న పాన్!
హౌరా..! బ్రిడ్జ్‌ను తినేస్తున్న పాన్!
కోల్‌కతా అనగానే ఠక్కున హౌరా బ్రిడ్జ్ గుర్తుకువస్తుంది. ఈ చారిత్రక వంతెన వజ్రోత్సవాలు జరుపుకొంటోంది.
1943, ఫిబ్రవరి 3న కోల్‌కతా-హౌరాలను కలుపుతూ హౌరా బ్రిడ్జ్ ప్రారంభమయింది. నిత్యం లక్షకుపైగా వాహనాలు, లక్షన్నర మంది పాదచారుల రాకపోకలకు ఉపయోగపడుతోంది. 1936లో మొదలైన నిర్మాణం ఆరేళ్లకు పూర్తయింది. హిందువులు, ముస్లింలు, సిక్కులు, నేపాలీలు, గూర్ఖాలు, పఠాన్‌లు ఇలా ఆనాడు కోల్‌కతా ప్రజలంతా ఈ వంతెన నిర్మాణంలో భాగస్వాములయ్యారు. అంతేకాదు.. హౌరాబ్రిడ్జ్‌పై అనేక భారతీయ సినిమాలను షూట్ చేశారు. సత్యజిత్‌రే, రిత్విక్ ఘటక్, మృణాల్‌సేన్, రాజ్ కపూర్, రోలాండ్ జోఫ్, మీరా నాయర్ తదితరులు హౌరా బ్రిడ్జ్‌పై ఔరా అనిపించే సినిమాలు తీశారు. హౌరా బ్రిడ్జ్ నిర్మాణానికి 26,500 టన్నుల స్టీల్ ఉపయోగిస్తే.. అందులో 23,500 టన్నుల స్టీల్‌ను టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ సరఫరా చేసింది. కానీ ఆ ఉక్కు కట్టడం కాలక్రమేణా తుప్పుపడుతోంది. మానవ తప్పిదాలకు ముప్పును ఎదుర్కొంటోంది.
స్టీల్ పిల్లర్లను తినేస్తున్న పాన్, గుట్కా మరకలు
ప్రమాదంలో హౌరా బ్రిడ్జ్!
కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జ్ దేశానికే గర్వకారణం. సముద్ర తుఫానులు కూడా ఈ వంతెనను ఏమీ చేయలేకపోయాయి. వెయ్యి టన్నుల ఓడలు కూడా ఏనాడూ కదపలేకపోయాయి. కానీ 75 ఏళ్ల చరిత్ర ఉన్న హౌరా వంతెన ఇప్పుడు తమలపాకులకు వణికిపోతోంది. ప్రపంచంలోని ఇంజనీరిం గ్ అద్భుతాల్లో ఒకటిగా నిలిచిన ఈ బ్రిడ్జ్‌కు గుట్కాలు, పాన్‌మరకలు సవా ల్ విసురుతున్నాయి. హౌరాబ్రిడ్జ్ హ్యాంగర్లు, లోహ పిల్లర్లపై పాదచారులు ఉమ్ముతున్న గుట్కాలు, కిళ్లీలు వాటిని బలహీనంగా మారుస్తున్నాయి.
స్లో పాయిజన్‌లా మారిన గుట్కా, పాన్
గుట్కా, పాన్‌లకు అంత పవర్ ఉంటుందా? 26,500 టన్నుల స్టీల్ కట్టడం గుట్కా మరకలకు బలహీనపడుతుందా? అనే ఆశ్చర్యం కలుగక మానదు! పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుందంటున్నారు నిపుణులు! ‘వంతెనపై పాన్, గుట్కాలు ఉమ్మినప్పుడు రసాయన చర్య జరుగుతుంది. స్టీల్ మీద నికొటినమైట్ పడటంతోనే యాసిడ్ సామర్థ్యం పెరుగుతుంది. ఆ ప్రభావంతో లోహం బలహీనంగా మారుతుంది. గుట్కా, పాన్ మరకలు వంతెనను స్లో పాయిజన్‌లా తినేస్తున్నాయి’ అని కోల్‌కతాకు చెందిన రసాయనశాస్త్ర నిపుణులు మహ్మద్ షాహ్ ఆలమ్ వివరిస్తున్నారు. 2313 అడుగులు పొడవైన వంతెనపై అనేకచోట్ల బెంగాల్ ప్రభుత్వం బోర్డులు పెట్టింది. బ్రిడ్జ్‌మీద పాన్, గుట్కా ఉమ్మకూడదని చెబుతూనే ఉంది. అయినా జనం పట్టించుకోవడం లేదు. పక్షుల రెట్టల వల్ల కూడా బ్రిడ్జ్‌కు ముప్పు ఉందని ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు.
Sources Andhra Jyothi
Comments
Post a Comment