ఢిల్లీ పర్యటనపై ఇంత రహస్యమెందుకు కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పర్యటన ప్రారంభం అయింది మొదలు..ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం ఆసక్తిని సృష్టిస్తోంది. దంత పరీక్ష కోసం ఢిల్లీ వెళుతున్నారని, దాంతో పాటు రాష్ట్ర సమస్యలపై అక్కడ కొంతమంది కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు అందిస్తారని మీడియాలో లీకులు వచ్చాయి. అంతకుమించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. వారం రోజులుగా ఢిల్లీలో ఎవరెవరిని కలుసుకుంది ఎవరితో సమావేశం అయింది కూడా ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు తెలియజేయలేదు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని వారం రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయినా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనను రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటన్న చర్చ నడుస్తోంది. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏమైందన్న ఆందోళన కూడా ప్రజల్లో ఒకవైపు ఉంది. ఇలాంటి విషయాలను రహస్యంగా ఉంచడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఇదిలావుండగా, దంతపరీక్ష కోసం ఢిల్లీ వెళ్లినా ఈ సందర్భంగా అనేక అంశాలపై సీఎం కేసీఆర్ కొంతమంది కేంద్రపెద్దలతో చర్చిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారు. ఎంతగా స్నేహ హస్తాన్ని అందించినా నిధులు కేటాయించలేదు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్లారని, డిమాండ్ల పరిష్కారంలో కేంద్ర పెద్దలను ఒప్పించడమే ముఖ్యమంత్రి ముందున్న లక్ష్యమని టీఆర్‌ఎస్‌పార్టీ వర్గాలు అంటున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం అయ్యేందుకు కేసీఆర్ అపాయిమెంట్ అడిగినట్టు తెలిసింది. రెండురోజులక్రితం ఎంపీలతో సమావేశమైనప్పుడు, విభజన హామీలతో పాటు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలపైనా పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని సూచించినట్టు తెలిసింది. కేంద్రప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి పట్టుబట్టాలని ముఖ్యమంత్రి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి వినతులతోనే సరిపెడతారని తెలుస్తోంది. ఒకవేళ ప్రధానమంత్రి అపాయిమెంట్ లభిస్తే, రాజకీయ అంశాలపైనే పూర్తిగా చర్చిస్తారని తెలిసింది. తమకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలూ లేవని, రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందించాలని, కేంద్రానికి పూర్తి మద్దతు ప్రకటించేలా పీఎంకు సీఎం భరోసా కల్పిస్తారని తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షంతో భేటీ, ఎస్సీ, మైనార్టీలకు రిజర్వేషన్ల పెంపు, కొత్త జిల్లాలలోని వెనుకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపు, వ్యవసాయానికి ఆర్థికసాయం తదితర అంశాలను ప్రస్తావిస్తారని అంటున్నారు. ప్రత్యేకంగా టీఆర్‌ఎస్‌పార్టీ ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పెంపు గురించే గట్టిగా కోరతారని తెలిసింది.
By sources
Comments
Post a Comment