నేను పరాయివాడిని : నరేంద్ర మోదీ
నేను పరాయివాడిని : నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆసక్తికరంగా మాట్లాడారు. విద్యార్థులతో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’లో ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాలకు పరాయివాడినన్నారు. తనలో స్వభావరీత్యా రాజకీయవేత్త లేడన్నారు. ఢిల్లీ జవహర్ నవోదయ విద్యాలయంలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి దిలీప్ అడిగిన ప్రశ్నకు మోదీ స్పందిస్తూ...
‘‘నేను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చాను. చాలామంది దీనిని అంగీకరించలేరు’’ అన్నారు. ‘‘నేను రాజకీయ వ్యవస్థలో ఉన్నాను, కానీ స్వభావ రీత్యా నేను రాజకీయవేత్తను కాను. పని చేయడమే నా స్వభావం’’ అని మోదీ తెలిపారు. తనకు 125 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదాలు ఉన్నాయన్నారు. ఎన్నికల ఫలితాలనేవి అనుబంధ ఉత్పత్తి వంటివని చెప్పారు.
దేనినైనా తయారు చేసినపుడు, ఆ ప్రక్రియలో అనుబంధంగా వచ్చే ఉత్పత్తితో ఎన్నికల ఫలితాలను పోల్చారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఉద్దేశించి దిలీప్ మాట్లాడుతూ ‘‘మీరు మీ పరీక్షకు సిద్ధంగా ఉన్నారా? లేదంటే కాస్త భయపడుతున్నారా?’’ అని అడిగారు.
విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలని, నేర్చుకునేందుకు ప్రయత్నించాలని, నేర్చకోవడంపైనే దృష్టి కేంద్రీకరించాలని, విద్యార్థులు తమలోని విద్యార్థిని సాధ్యమైనంత శక్తిమంతంగా ఉంచుకోవాలని చెప్పారు. దీనిని విద్యార్థులు తమ జీవనశైలిగా మార్చుకోవాలన్నారు. పరీక్షలు, ఫలితాలు, మార్కులను అనుబంధ ఉత్పత్తులుగా చూడాలన్నారు. ‘‘మీ పని మీరు చేశారు, ఫలితం వస్తుంది. మార్కుల వెంటపడితే, నిజంగా అవసరమైనదానిని సాధించలేకపోవచ్చు, నేను రాజకీయాల్లో ఇదే సూత్రంతో పని చేస్తాను’’ అన్నారు.
తన సమయం, శక్తి, మానసిక సామర్థ్యం... ఇలా అన్నీ 125 కోట్ల మంది భారతీయులకోసమే ఖర్చు కావాలన్నారు. ఎన్నికలు వస్తూ, పోతూ ఉంటాయన్నారు. అవన్నీ అనుబంధ ఉత్పత్తులన్నారు. ‘‘మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీకు సంవత్సరానికి ఒకసారే పరీక్షలు, మాకు రోజులో 24 గంటలూ పరీక్షలే’’ అని తెలిపారు.
By sources
Comments
Post a Comment