హత్యానేరం కేసులో ఏపీ డిప్యుటీ సీఎం కొడుకుపై అరెస్టు వారెంట్
కృష్ణగిరిలో జరిగిన చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుతో పాటు మరో ఇద్దరిపై డోన్ కోర్టు శుక్రవారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. గత ఏడాది మే నెలలో పత్తికొండ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ నారాయణరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేఈ శ్యాంబాబు, కప్పట్రాళ్ల బొజ్జమ్మతో పాటు మరో 13 మందిపై మృతుని బంధువులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణలో 13 మందినే అరెస్టు చేసి వీరిద్దరి పేర్లను కేసు నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరితో పాటు ఎస్సై నాగతులసీ ప్రసాద్‌లపై కూడా కేసు నమోదు చేయాలని మృతుని భార్య శ్రీదేవి కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించి బాధితుల నుంచి వివరాలు నమోదు చేసిన న్యాయమూర్తి ఆంజనేయులు ముగ్గురికీ అరెస్టు వారెంట్‌లు జారీ చేయాలని ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేసినట్లు సమాచారం.
By sources
Comments
Post a Comment