క్రైస్తవుల కోసం తీసుకున్న నిర్ణయం ఓవైసీ బీపీ పెంచింది
క్రైస్తవుల సంక్షేమం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి బీపీ పెంచింది. ముస్లింలకు హజ్ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం తొలిగించిన నెలరోజుల తర్వాత…తాజాగా బీజేపీ క్రైస్తవులకు జెరూసలేం ఉచిత యాత్ర ఆఫర్‌ను ప్రకటించింది. త్వరలో జరుగనున్న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే క్రైస్తవులను ఉచితంగా జెరూసలేం యాత్రకు పంపుతామని బీజేపీ హామీ ఇచ్చింది. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఎన్నాళ్లుగానో ఇస్తున్న రాయితీని నెలరోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. తద్వారా మిగిలే నిధులను మైనార్టీల సంక్షేమానికి ఉపయోగిస్తామని ప్రకటించింది. మైనార్టీలను బుజ్జగించడం కోసం కాకుండా, వారికి సగౌరవంగా సాధికారత కల్పించేందుకే తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని అప్పట్లో కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ తాజా హామీని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ క్రిస్టియన్లను ఉచితంగా జెరూసలేం పంపుతామని హామీ ఇస్తోంది. సబ్సిడీ ఏదైనా సరే.. అందరికీ ఒకేలా ఉండాలి. ముస్లింలకు హజ్ సబ్సిడీని తొలిగించడం, హిందూవులకు మానససరోవరం యాత్ర సబ్సిడీని కొనసాగించడం, క్రిస్టియన్లను ఉచితంగా జెరూసలేం పంపుతామని ప్రకటించడం సరైన పద్ధతి కాదు` అని అసదుద్దీన్ తెలిపారు. ఎన్నికల్లో ఉపయోగపడేలా ఉంటే బీజేపీ ముస్లింలకు కూడా రాయితీ కొనసాగించేదని, ఇదే ఆ పార్టీ నమ్మిన ఇండియా ఫస్ట్ నినాదమని ఆయన ఓ ట్వీట్‌లో విమర్శించారు. అయితే ఈ హామీ కేవలం నాగాలాండ్‌కే పరిమితమా? ఈశాన్య రాష్ర్టాల్లోని క్రైస్తవులందరికీ కల్పిస్తారా? దేశంలోని క్రిస్టియన్లందరికీ వర్తిస్తుందా? అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. త్వరలో జరుగనున్న ఈశాన్య రాష్ర్టాల(మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర) ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ హామీని బీజేపీ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. మేఘాలయలో 75శాతం జనాభా, నాగాలాండ్‌లో 88 శాతం జనాభా క్రైస్తవులే. ఈమేరకు క్రైస్తవులను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. నాగాలాండ్‌లో తమకు అధికారం కట్టబెడితే, క్రైస్తవులకు ఉచితంగా జెరూసలేం యాత్రకు పంపుతామని బీజేపీ వాగ్దానం చేస్తున్నది అని వుయ్ ది నాగాస్ అనే వార్తాసంస్థ ట్విట్టర్‌లో వెల్లడించింది.
మతపరమైన యాత్రలకు రాయితీలు ఇవ్వడాన్నే తాము వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం తెలిపింది. మరోవైపు బీజేపీ హామీపై ఇజ్రాయెల్ మీడియా భిన్నంగా స్పందించింది. ప్రభుత్వాలు యాత్రికులను సబ్సిడీపై పుణ్యక్షేత్రాలకు పంపాలనుకోవడం ఇదేమీ తొలిసారి కాదని, నైజీరియా తమ దేశంలోని ముస్లిం, క్రిస్టియన్ యాత్రికులను మక్కా, జెరూసలేంకు ఏటా పంపుతున్నదని జెరూసలేం పోస్ట్ అనే పత్రిక తెలిపింది. అయితే ఈ తరహా ఎన్నికల హామీలన్నీ తర్వాత క్రమంగా మరుగున పడుతాయని వ్యాఖ్యానించింది.
By sources
Comments
Post a Comment