కేసులంటే నాకు భయం లేదు..బీజేపీ శ్వేతపత్రం ఇవ్వాలి
రాష్ట్రంలోని పరిణామాలపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరోమారు స్పందించారు. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్డించే వారు మనవారైతే చివరి పంక్తిలో కూర్చున్నా వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు కేంద్రంలో వడ్డించే వారు మనవారు కాదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసిన చంద్రబాబు ఇందుకోసం ఎంతదూరం వెళ్లడానికైనా సిద్ధమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ లెక్కలు అడిగినా ఇచ్చేందుకు మనకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్వేతపత్రాలు అడిగితే సున్నిత పద్దతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కేంద్రం ఏం చేసిందనే శ్వేతపత్రం బీజేపీ ఇవ్వాలన్నారు. కాగితంపై పెట్టిన 27 పేజీల లెక్కలు చెప్పారే తప్ప, ఎంత మంజూరు చేశారో చెప్పలేదని బాబు అన్నారు. తానేదో కేసులకు భయపడుతున్నానని ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. `నేను కేసులకు భయపడతానా? కేసులంటే నాకెందుకు భయం. కాంగ్రెస్ పాలిత సీఎంలూ ఉన్నారు, అందరూ కేసులకు భయపడుతున్నారా?` అని చంద్రబాబు పార్టీ నేతలను ప్రశ్నించారు. `రాజధానిలో లక్ష కోట్ల అవినీతి అని కేసులు పెట్టారు, ఏం జరిగింది. మనపై ఎన్ని కేసులు పెట్టినా అన్నిటికీ క్లీన్‌చిట్ వచ్చింది` అంటూ బాబు తెలిపారు. టీడీపీ చేసినవి రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని కాని జగన్ ఏది చేసినా కేసుల మాఫీ, లాలూచీ కోసమే చేస్తారని ఆరోపించారు. మనం ఢిల్లీ దేనికోసం వెళ్లాం, జగన్ దేని కోసం తిరిగారో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటిస్తారని మనకు తెలియక ముందే జగన్ వెళ్లి ఫొటో దిగారన్నారు. అడగకుండానే జగన్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మద్దతిచ్చాడని పేర్కొన్నారు. జగన్నాటకాలు అని పత్రికలు రాసినట్లుగా ఆ నాటకాలను ప్రజలకు తెలపాలని నేతలకు సూచించారు. ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా తెలుగుదేశం తిరిగి గెలవడం ఖాయమన్నారు.
కాపు రిజర్వేషన్ల అంశాన్ని షెడ్యూల్ 9లో పెట్టి న్యాయం చేయాలని, బీసీ సంక్షేమ శాఖ దీనికి సంబంధించి వివరణ ఇస్తుందని పార్టీ నేతలకు చంద్రబాబు తెలిపారు. కాగా, ఈ చర్చ సమయంలోనే టీవీలలో పోలవరంపై ఒడిశా పిటిషన్‌కు సంబంధించిన వార్తలను చూసి చంద్రబాబు స్పందించారు. పోలవరంపై మీడియాలో వస్తున్న తాజా సమాచారాన్ని చంద్రబాబు నేతలకు చదివి వినిపించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని, ఎన్ని సమస్యలు ఎదురైనా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. తాజా సమస్యను పూర్తిగా అధ్యయనం చేసి తగురీతిలో పరిష్కరించుకుందామన్నారు. పోలవరం సకాలంలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉందన్నారు. కాగా, ఈ సందర్భంగా పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ చాలా బాగుందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బాగున్నా నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పార్టీ కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమనుకునేవారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పదవులు తీసుకొని సొంత పనులు చేసుకుంటూ పార్టీని విస్మరించడం తగదన్నారు. నిరంతరం పార్టీకి అండగా నిలవాలనే బాధ్యతను చాలా మంది విస్మరిస్తున్నారని ఆగ్రహించారు. టీవీలకు వెళ్లి వాస్తవాలు చెప్పండి అనే పరిస్థితిని కొందరు నేతలు కల్పిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
Comments
Post a Comment