గాలిలో ఊడిన ఇంజిన్... అత్యవసరంగా దిగిన విమానం...
బ్రేకింగ్ న్యూస్ : గాలిలో ఊడిన ఇంజిన్... అత్యవసరంగా దిగిన విమానం...
పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసరంగా హోనొలులు విమానాశ్రయంలో దిగవలసి వచ్చింది. ఈ విమానంలోని కుడివైపున ఉన్న ఇంజిన్ కవర్ అకస్మాత్తుగా ఊడిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ విమానంలో 363 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ఇంజిన్ కవర్ ఊడిపోవడంతో వీరంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మంగళవారం బయల్దేరిన ఫ్లైట్ 1175 హోనొలులులో దిగవలసి ఉంది. మరో గంటలో హోనొలులు చేరుతుందనగా కుడివైపు ఇంజిన్ కవర్ హఠాత్తుగా ఊడిపోయినట్లు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. విమానం సురక్షితంగా హొనొలులు విమానాశ్రయంలో దిగిందని తెలిపింది. అగ్నిమాపక శకటాలు, సిబ్బంది రన్‌వే వద్ద సర్వసన్నద్ధంగా ఉన్నారని తెలిపింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొంది.
ఓ ప్రయాణికుడు తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితిని ఓ ట్వీట్‌లో వివరించారు. ‘‘నా జీవితంలోనే అత్యంత భయానక విమాన ప్రయాణమిది’’ అని పేర్కొన్నారు.
పసిఫిక్ మహా సముద్రం మీదుగా విమానం ప్రయాణిస్తున్నపుడు ఇంజిన్ కవర్ ఊడిపోయిన తర్వాత ఆ దృశ్యాన్ని ఎరిక్ హడ్డడ్ అనే ప్రయాణికుడు వీడియో తీశారు. ఆ ఇంజిన్ చాలా దయనీయంగా, పేలవంగా కనిపించిందని ట్వీట్ చేశారు.
మరో ప్రయాణికుడు జెఫ్ కార్టర్ పోస్ట్ చేసిన వీడియోలో ఈ విమానం విమానాశ్రయంలో దిగుతున్నపుడు ఏ విధంగా వణికిందో కనిపించింది.
By sources
Comments
Post a Comment