తెలంగాణా తాజా వార్తలు సెల్లు నోటికి కేసీఆర్ సవరణల తాళం
నిన్నటి వరకూ నోరు మాత్రమే మాట్లాడేది. మాట్లాడే నోటితో వచ్చే ముప్పుకు మించిన ముప్పు ఒకటి వచ్చేసింది అది సెల్లుఫోను. నోరు విప్పకుండా.. చిన్న టచ్ తో షేర్ చేసేసి తానేం చెప్పాలనుకున్నా సైలెంట్ గా చెప్పేస్తున్న వైనం తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఇలాంటివి ఒక ఎత్తు అయితే.. అడ్డగోలు బెదిరింపులు.. ఆకాశరామన్న ఉత్తరాలతో సామాజిక మాథ్యమాలతో ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న వైనంపై తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇప్పటివరకూ ఉన్న చట్టాన్ని మరింత పదునెక్కించటం ద్వారా సెల్లుకు తాళం వేసే దిశగా అడుగులు వేస్తోంది. బెదిరింపులకు పాల్పడటం.. కించపర్చటం లాంటి ఉదంతాలకు పరిమితులు విధించేందుకు వీలుగా ఇప్పుడున్న ఐపీసీ సెక్షన్లకు సవరణలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటివరకూ ఉన్న చట్టాల ప్రకారం నేరపూరిత బెదిరింపులకు ఐపీసీ సెక్షన్ 506.. 507 కింద నేరాలకుపాల్పడిన వారిని అరెస్ట్ చేయాలంటే ముందస్తుగా కోర్టు అనుమతి అవసరం. ఈ సెక్షన్ల కింద నేరాలు చిన్నవిగా ఉండటంతో ఫిర్యాదు చేసినంతనే అరెస్ట్ చేసేవారు కాదు. దర్యాప్తు మాత్రమే చేపట్టేవారు. అయితే.. ఇందుకు సవరణలు చేరుస్తూ తయారు చేసిన ఫైలుకు ముఖ్యమంత్రి ఓకే అనేశారు. దీంతో ఇప్పటివరకూ చిన్న నేరాలుగా ఉన్న స్థానే.. గుర్తించదగిన నేరాలుగా ప్రభుత్వం సవరణలు తీసుకొస్తోంది. దీంతో.. ఈ సెక్షన్ల కింద నమోదైన నేరాల్లో దర్యాప్తు.. అరెస్ట/ ల విషయంలో మెజిస్ట్రేట్ ద్వారా తదుపరి చర్యల విషయంలో ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉండేది. ఇప్పుడు అలాంటిదేమీ లేకుండానే నేరుగా చర్యలు తీసుకునేలా సవరణలు చేస్తున్నారు. సోషల్ మీడియా విపరీతంగా యాక్టివ్ అయిన నేపథ్యంలో.. నచ్చినోళ్లను ఆకాశానికి ఎత్తేయటం.. నచ్చని వారిపై విమర్శల కత్తి కట్టటం.. వారిని ఎటకారం చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇది.. అధికార పక్షానికి ఇబ్బందిగా మారింది. ఎక్కడి దాకానో ఎందుకు.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో భారీ బహిరంగసభల్లో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంతనే మొదటి ముఖ్యమంత్రిగా దళిత వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చుంటారని చెప్పటం కనిపిస్తుంది. ఈ వీడియోకు మరికాస్త యాడ్ చేసి.. ఎంత అబద్ధం చెప్పారో అంటూ ఎటకారం చేసుకునే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ఇదొక్కటే కాదు.. ఇలాంటి వీడియోలెన్నో ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఒక్క కేసీఆర్ వి మాత్రమే కాదు.. పలువురు ప్రముఖు నేతలు మొదలు.. సినీ ప్రముఖులు.. సెలబ్రిటీలకు చెందిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయంటూ ప్రధాన మీడియా సైతం వాటితో వార్తలు అల్లేయటం ఎక్కువైంది. ఈ ధోరణి టీవీ ఛానళ్లలో అంతకంతకూ పెరుగుతోంది. ఇలా.. ఒకరి పేరు చెప్పి మరొకరు చేస్తున్న ప్రచారాలతో ఇబ్బంది పడుతున్న అధికారపక్షం.. అందుకు ముకుతాడు వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడున్న చట్టాలకు మరింత పదును పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఐపీసీ సెక్షన్ 503 విషయాన్నే తీసుకుంటే నేరం కిందకు వచ్చే బెదిరింపుగా చెప్పాలి. ఎవరి వ్యక్తిత్వాన్నికి అయినా హాని చేస్తామని కాని.. పరువు లేదా ఆస్తి వ్యవహారంలో నష్టం చేస్తామని భయపెట్టడాన్ని బెదిరింపుగా పరిగణించొచ్చని చెప్పింది. సాధారణ బెదిరింపులకు పాల్పడిన వారికి ఐపీసీ సెక్షన్ 506 కింద రెండేళ్ల జైలు.. జరిమానా లేదా రెండూ విధించొచ్చని చట్టం చెబుతోంది. ఐపీసీ సెక్షన్ 507 ప్రకారం సామాజిక మాధ్యమాలు.. లేఖలు.. ఆకాశరామన్న ఉత్తరాలు.. మొయిళ్లు.. ఫోన్ నుంచి బెదిరింపు తదితరాల వెల్లడి ద్వారా బెదిరింపులకు పాల్పడితే రెండేళ్లు వరకూ శిక్ష ఉంది. 506 సెక్షన్లో పేర్కొన్న అంశాలు 507కు వర్తిస్తాయి. ఈ సెక్షన్‌ను గుర్తించదగిన నేరాలుగా మార్చటం ద్వారా కోర్టు ప్రమేయం లేకుండా అరెస్ట్ చేసే వీలుంది. ఈ చట్ట సవరణ ద్వారా ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా సాగే ప్రచారాల్ని ఉక్కుపాదంతో అణిచివేయొచ్చన్న అభిప్రాయం ఉంది. స్వేచ్ఛగా తమ భావాల్ని వ్యక్తీకరించటానికి వీల్లేని రీతిలో చట్టానికి కొత్త పరిమితులు తీసుకొస్తున్నారని చెబుతున్నారు. ఈ తీరు రానున్న రోజుల్లో భావ స్వేచ్ఛకు బంధనాలుగా మారుతుందన్న అభిప్రాయం ఉంది. ఏమైనా.. అభిప్రాయ వ్యక్తీకరణ విషయంలో కొత్త పరిమితులు ప్రజాస్వామ్యానికి.. స్వేచ్ఛా ప్రియులకు ఏ మాత్రం మంచివి కావన్నది మర్చిపోకూడదు. ఒకవేళ.. ఇలాంటి పరిమితులు మరింతగా ఉండి ఉంటే.. అంత స్వేచ్ఛగా తెలంగాణ రాష్ట్ర పోరాటం సాగేది కాదన్న విషయం ఉద్యమనేత కేసీఆర్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నడిచి వచ్చిన దారిని మర్చిపోతే భవిష్యత్ తరాలు క్షమించదు.
By sources
Comments
Post a Comment