ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంబులెన్స్‌ల దుస్థితి ఎలా ఉందో తెలిస్తే..
అందుబాటులో లేని అంబులెన్స్‌లు
తరచూ మరమ్మతులే
రోగికి అత్యవసరం అయితే అవస్థలే
ప్రైవేట్ వాహనాలే దిక్కు
ప్రసూతి ఆస్పత్రుల్లోనూ అదే తీరు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంబులెన్స్‌లు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ, ఇతర అవసరాల కోసం రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించాలంటే కష్టమవుతోంది. ప్రైవేటు వాహనాలను నమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఉస్మానియాలో పాతకాలం నాటివే...
ఉస్మానియా ఆస్పత్రిలో పేరుకు ఆరు అంబులెన్స్‌లు ఉన్నాయి. తాతల కాలం నాటివి కావడంతో పాడైపోయాయి. కొన్ని మొరాయిస్తున్నాయి. రెండు మాత్రమే రోగుల అవసరాలకు వినియోగిస్తున్నారు. ఒక దానిని మందుల తరలింపు, మరొకటి ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో రోగులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. రోగి ఒకచోట, వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరోచోట ఉండడం వల్ల రోగులను ఈ భవనం నుంచి ఆ భవనానికి అంబులెన్స్‌లో తరలించాలి. అవి లేకపోవడంతో వీల్‌చైర్‌లో తీసుకెళ్లాల్సి వస్తోంది. 1980లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు సంజీవిని శకటం పేరిట ఉస్మానియా ఆస్పత్రికి రెండు అంబులెన్స్‌లను మంజూరు చేశారు. 1994లో జపాన్ దేశ ఆర్థిక సహకారంతో ఒకటి, జైకా కంపెనీకి చెందిన రెండు అంబులెన్సులను కేటాయించారు. 2007లో ఒక్కో ఆస్పత్రికి రెండేసి అంబులెన్స్‌లను కేటాయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకూ ఉస్మానియా ఆస్పత్రికి కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు.
చెస్ట్ ఆస్పత్రిలో కష్టమే...
చెస్ట్ ఆస్పత్రిలో 4 ఉన్నాయి. ఇందులో రెండు 15 సంవత్సరాల నాటివి. అవి ఉపయోగపడడం లేదు. మిగతా రెండు ఎవరికి, ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియని పరిస్థితి. చెస్ట్ ఆస్పత్రి నుంచి హార్ట్, న్యూరాలజీ, కిడ్నీ, ఆర్థో, కంటి వంటి పరీక్షలకు రోగులను ఉస్మానియా, నిలోఫర్, గాంధీ, సరోజనీదేవి కంటి ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది. స్కానింగ్, ఎమ్మారై లేకపోవడంతో రోగులను ఉస్మానియా, గాంధీకి తరలించాలి. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో రోగులే నేరుగా ఆటోలు, బస్సుల్లో వెళ్లి పరీక్షలు చేయించుకుని వస్తున్నారు.
నిలోఫర్‌లో.. సఫర్
నిలోఫర్‌లో మూడు డొక్కు అంబులెన్స్‌లు ఉన్నాయి. శిశువులను ఉస్మానియా, గాంధీ, చెస్ట్ ఆస్పత్రులకు వివిధ పరీక్షల కోసం వాటిల్లో పంపించడం ఇబ్బందిగా ఉంది.
గాంధీలో ఉన్నా కనిపించవు...
గాంధీలో ఐదు ఉన్నాయి. ఒకటి కూడా కనిపించదు. రోగులు ఎక్కువగా ప్రైవేటు వాహనాలు, 108 సర్వీసులను వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి సిబ్బంది కూడా రోగులకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపరు.రోగి డిశ్చార్జి అయ్యాక ఇంటికి అంబులెన్స్‌లోనే తరలించాలి. 30 కిలోమీటర్ల లోపు వరకు చార్జీ చేయకుండా తీసుకెళ్లాలి. ఇక్కడ అలాంటి సేవలు అందడం లేదు.
మానసిక ఆస్పత్రిలో వాహనాల కొరత
ఇక్కడి రోగులకు మానసిక వ్యాధికి తప్ప ఇతర చికిత్సలు కావాలంటే మరో ఆస్పత్రికి వెళ్లాల్సిందే. మానసిక రోగులను ప్రైవేటు వాహనాల్లో తరలించడం ఇబ్బందే. సిబ్బంది 108 సర్వీసులకు ఫోన్ చేస్తే అక్కడ అంబులెన్స్‌లు ఉంటాయి కదా.. తమది పంపలేమని చెబుతుండడంతో ఆస్పత్రి వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి.
పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో...
పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ఒకటే అంబులెన్స్ ఉంది. పాతకాలం నాటి జీపు, జిప్సీ ఉన్నాయి. అవి రోగులకు ఉపయోగడడం లేదు. ఉన్న ఒకటి ఒకరిద్దరు రోగులకు మాత్రమే ఉపయోగపడుతోంది. అదీ.. అధ్వానంగా ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న శిశువులను నిలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించాలంటే ఒకటే అంబులెన్స్ ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో...
సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో మూడు అంబులెన్స్‌లున్నాయి. రెండు పాడైపోయాయి. ఒకదాన్ని నవజాత శిశువులను ఇతర ఆస్పత్రులకు తరలించడానికి ఉపయోగిస్తున్నారు. మరో రెండు జీపు లాంటి చిన్నవి ఉండడంతో రోగులకు అనువుగా లేవు.
డ్రైవర్ల కొరత
కొన్ని ఆస్పత్రుల్లో అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ డ్రైవర్లు ఉండడం లేదు. అంబులెన్స్‌లకు డీజిల్ కొరత కూడా తీవ్రంగా ఉంది.వీటి నిర్వహణకు కేటాయించే బడ్జెట్ సకాలంలో విడుదల కావడం లేదు. డీజిల్ లేక కొన్నిసార్లు వాటిని పక్కన పెట్టేస్తున్నారు.
Sources Andhra Jyothi
Comments
Post a Comment