ప్రపంచ కుబేరుల్లో భారత్‌కు మూడో స్థానం

ప్రపంచ కుబేరుల్లో భారత్‌కు మూడో స్థానం

దేశంలో 131 మంది శ్రీమంతులు
అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ
న్యూఢిల్లీ : ప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత మన దేశంలోనే ఎక్కువ మంది సంపన్నులున్నారు. గురువారం వెలువడిన ‘హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2018’ ప్రకారం... ప్రస్తుతం మన దేశంలో 100 కోట్ల డాలర్లు (బిలియన్‌) లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారి సంఖ్య 131. గత ఏడాదితో పోలిస్తే కొత్తగా 31 మంది ఈ జాబితాలో చేరారు. స్టాక్‌ మార్కెట్లో కొనసాగిన బూమ్‌ ఇందుకు బాగా దోహదం చేసింది.
 
ముకేశ్‌ అంబానీయే నెంబర్‌ వన్‌
గత ఏడాదిలా ఈ సంవత్సరం కూడా 45 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.92 లక్షల కోట్లు) ఆస్తులతో ముకేశ్‌ అంబానీ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గౌతమ్‌ అదానీ 14 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.91,000 కోట్లు) ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే అంబానీ ఆస్తుల విలువ 73 శాతం, గౌతమ్‌ ఆదానీ ఆస్తుల విలువ 109 శాతం పెరిగాయి. హురున్‌ సంపన్నుల జాబితా ప్రకారం... ప్రస్తుతం ముకేశ్‌ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో 19వ స్థానంలో, అదానీ 98వ స్థానంలో ఉన్నారు. ప్రవాస భారతీయ సంపన్నులను కూడా కలుపుకుంటే జాబితాలోని భారత బిలియనీర్ల సంఖ్య 170కి చేరుతుంది. దాదాపు 18 బిలియన్‌ డాలర్ల ఆస్తులున్న ఉక్కు దిగ్గజం లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌... ముకేశ్‌ అంబానీ తర్వాత రెండో అత్యంత సంపన్నుడైన భారతీయుడవుతారు.
 
రంగాల వారీగా ...
రంగాల వారీగా చూస్తే మన దేశంలోని అత్యంత సంపన్నుల్లో 19 మంది ఫార్మా రంగానికి, 14 మంది ఆటోమొబైల్‌ రంగానికి, 11 మంది కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగానికి చెందిన వ్యక్తులు ఉన్నారు.
 
ప్రపంచ జిడిపిలో 13.2 శాతం
ప్రపంచంలోని 68 దేశాల్లో 100 కోట్ల డాలర్ల (బిలియన్‌ డాలర్లు)కంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తులు 2,694 మంది, కంపెనీలు 2,157 ఉన్నాయి. వీరి సంపద మొత్తం విలువ 10.5 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.682.5 లక్షల కోట్లు). ప్రపంచ జిడిపిలో ఇది 13.2 శాతానికి సమానం. గత ఏడాది కాలంలోనే ఈ కుబేరుల సంపద విలువ 31 శాతం పెరిగింది.
 
అమెరికాను అధిగమించిన చైనా
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న బిలియనీర్లలో 819 మంది కమ్యూనిస్టు చైనాలో ఉంటే, అమెరికాలో 571 మంది మాత్రమే ఉన్నారు. గత ఏడాది ఈ విషయంలో రెండు దేశాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల హవాతో ఈ సంవత్సరం చైనా ఈ విషయంలో అమెరికాను మించిపోయింది.
 
అమెజాన్‌ అధినేత అత్యంత ధనికుడు
ఈ సంవత్సరం 123 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. తర్వాత 102 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో వారెన్‌ బఫెట్‌ రెండో స్థానంలో, 90 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ మూడో స్థానంలో, 79 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ నాలుగో స్థానంలో నిలిచారు.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!