తెలంగాణకు కేంద్రం తీపి కబురు
తెలంగాణకు కేంద్రం తీపి కబురు
జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి బోర్డు అనుమతినిచ్చింది. ఈ మేరకు గురువారం కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం పంపింది. ఎకో సెన్సిటివ్ జోన్‌లోని 443 హెక్టార్లలో ప్రాజెక్టు పనులకు అభ్యంతరాలు లేవని వన్యప్రాణి బోర్డు తెలిపింది. మణుగూరు ఫారెస్ట్ డివిజన్లోని 257.1154 హెక్టార్లు, పాల్వంచ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో 185.8437 హెక్టార్లకు అనుమతి లభించింది. వన్యప్రాణి అనుమతులు వచ్చినందున ఈ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ఆయా అటవీ ప్రాంతాల్లో అవరోధాలు తొలగిపోయాయి.
పూర్వ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. కీలకమైన వన్యప్రాణి అనుమతులు లభించడం పట్ల ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి డాక్టర్ హర్శవర్ధన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ అటవీ అనుమతులు గత జనవరి 19న లభించాయి. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన 3,781 ఎకరాల అటవీ భూములు సేకరించడానికి కేంద్ర అటవీశాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం గతంలో అనుమతులు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం అటవీ డివిజన్లలోని 1201 హెక్టార్లు 330 హెక్టార్లలో, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్లలోని 330 హెక్టార్ల అటవీ భూమిని సాగునీటి శాఖకు బదలాయించేందుకు గత జనవరిలో అనుమతి ఇచ్చారు. ప్రాజెక్టు రెండో దశకు చెందిన అటవీ అనుమతులు కూడా త్వరలోనే లభించనున్నాయి.
ఈ ప్రాజెక్టు పనుల పురోగతి ఇంకా వేగంగా జరగాలని హరీశ్‌రావు కోరారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా జరగనుంది. ప్రాజెక్టులోని అన్ని ప్యాకేజీల్లోనూ యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని హరీశ్‌రావు సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌ను, ఇరిగేషన్ అధికార యంత్రాంగాన్ని గురువారం ఆదేశించారు.
Comments
Post a Comment