ముందస్తు ఖాయమే! నవంబరు-డిసెంబర్లోనే లోక్‌సభ ఎన్నికలు? మరో 15 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

ముందస్తు ఖాయమే!

నవంబరు-డిసెంబర్లోనే లోక్‌సభ ఎన్నికలు?
మరో 15 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

ప్రత్యర్థులు పూర్తిగా కూడదీసుకోకమునుపే దెబ్బ కొట్టేయాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహంలా కనిపిస్తోంది. ఈ ఏడాది నవంబరు- డిసెంబర్లోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని ఆయన గట్టిగా భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం జాతీయ స్థాయిలో భారతీయ జనతాపార్టీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మోదీకీ, ఇతర ప్రతిపక్షాలన్నింటికీ మధ్య జరిగే పోరాటంగా దీన్ని చిత్రించాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. తమ అభిప్రాయాలతో ఏకీభవించే కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా ఈ మేరకు సంకేతాలను అందజేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరుసగా రెండురోజులు ముందస్తు విషయాన్ని ప్రస్తావించడం ఈ విషయాన్ని ధ్రువపరుస్తోందని విశ్లేషకులంటున్నారు. ముందస్తుకు సిద్ధం కండి.. అని ఆయన తన సహచరులను అప్రమత్తం చేయడమే కాక- ప్రత్యర్థి శిబిరాల్ని నిర్వీర్యం చేసే రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించడం గమనార్హం. ముందస్తు సన్నాహాలు అనేక రాష్ట్రాల్లో కూడా కనిపిస్తున్నాయి.
 
బిహార్‌లో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ కూడా సీట్ల బేరసారాలను ఇప్పటికే ముమ్మరం చేసింది. ఒకవేళ సీట్లు పెంచేందుకు బీజేపీ అంగీకరించకపోతే రాం విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి, ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని ఆర్‌ఎల్‌ఎ్‌సపీ, జేడీయూలు కలిసి మరో కూటమి ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ‘కూటమి నుంచి బయటకి పోతే పొండని’ జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ ఆదివారం రాత్రి బీజేపీకి కరాఖండీగా తేల్చిచెప్పేయడం విశేషం. ఇటు కర్ణాటకలో ముఖ్యమంత్రి, జేడీఎస్‌ అధినేత కుమారస్వామి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ అభిప్రాయాలకు భిన్నంగా పూర్తి స్థాయి జనరంజక బడ్జెట్‌ ను ప్రవేశపెట్టాలని, వంద కోట్ల మేరకు రుణమాఫీ ప్రకటించాలని నిర్ణయించారు. నవంబర్‌, డిసెంబర్‌ ల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిషా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిపించేందుకు ఆయా రాష్ట్రాలను ఒప్పించాలని మోదీ సర్కార్‌ భావిస్తున్నట్లు సమాచారం.
 
జమ్ముకాశ్మీర్‌లో ఇప్పటికే రాష్ట్రపతి పాలన విధించారు. కొన్ని రాష్ట్రాల్లో 2018 మే నుంచి 2019 జనవరి వరకు వివిధ తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీ, తెలంగాణల్లో ఏప్రిల్‌-మే నెలల్లో ఎన్నికలు జరగాలి. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని, రాష్ట్రపతి పాలన అనివార్యం కావొచ్చని కేంద్రం అభిప్రాయం. 18 మంది ఎమ్మెల్యేల అనర్హతపై మద్రాసు హైకోర్టు మూడో జడ్జి వెలువరించబోయే తీర్పు ఆ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వ పతనానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మొత్తం మీద- మోదీ సర్కార్‌ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే లోక్‌సభతో పాటు 15 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే ఎన్నికల వాతావరణం ఏర్పడిన రీత్యా చాలా రాష్ట్రాలు ముందస్తుకు మొగ్గు చూపించవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ రీత్యా జులైలో జరిగే వర్షాకాల సమావేశాలే 16వ లోక్‌సభకు చివరి సమావేశాలని, ఈ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను ప్రకటించనున్నదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జనవరిలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పదవీకాలం పూర్తవుతున్నందున ఆ లోపే సార్వత్రిక ఎన్నికలు జరిపి ఆయన సారథ్యంలో బీజేపీని రెండోసారి అధికారంలోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం.
 
అమిత్‌ షా స్థానంలో మరొకరిని నియమించి ఆయనను మంత్రివర్గంలో తీసుకోవాలని సంఘ్‌ నుంచి ఒత్తిళ్లు వస్తున్న తరుణంలో ముందస్తు ఎన్నికలు జరిపి సత్తా నిరూపిచుకోవాలని మోదీ, షా ద్వయం భావిస్తోంది. కూటముల నిర్మాణంలో విపక్షాలు కీచులాడుకుంటున్న దశలోనే దెబ్బ పడాలన్నది వారి లక్ష్యం. విపక్షాలు ఎటూ మోదీనే టార్గెట్‌ చేస్తున్నందున 2019 ఎన్నికల్ని ‘‘మోదీ వర్సెస్‌ విపక్షాల’’ పోరాటంగా ప్రచారం చేసి బీజేపీ లాభపడాలనుకుంటోంది. ఇప్పటికే ఉప్పందుకున్న కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున సంస్థాగత మార్పులను ప్రారంభించింది. త్వరలో కేంద్ర స్థాయిలో వర్కింగ్‌ కమిటీని, ఎన్నికల కమిటీలను కాంగ్రెస్‌ నియమిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తాము పోటీ చేయాల్సిన 300 నుంచి 350 లోక్‌సభ స్థానాలను ఇప్పటికే గుర్తించిందని, మిగతా సీట్లను ఆయా రాష్ట్రాల్లోని మిత్రపక్షలకు కేటాయించాలని భావిస్తోందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.
 
నవంబరు- డిసెంబరులో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు
రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ‌స్‌గఢ్‌, మిజోరం అసెంబ్లీ ముందస్తుకు అవకాశం!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ 
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!