800 పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం లేదు 319 ప్రాథమిక, 481 ఉన్నత పాఠశాలకు కోత నిరుటితో పోలిస్తే 59 వేల మంది భోజనానికి విద్యార్థుల దూరం 30 వేల కిచెన్‌ షెడ్డులకు కేంద్రం అనుమతిస్తే రాష్ట్రంలో కట్టింది 10 వేలే ఆరు బయట వంటవార్పుతో అవస్థలు

800 పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం లేదు

 319 ప్రాథమిక, 481 ఉన్నత పాఠశాలకు కోత
 నిరుటితో పోలిస్తే 59 వేల మంది భోజనానికి విద్యార్థుల దూరం
 30 వేల కిచెన్‌ షెడ్డులకు కేంద్రం అనుమతిస్తే రాష్ట్రంలో కట్టింది 10 వేలే
 ఆరు బయట వంటవార్పుతో అవస్థలు


పేద విద్యార్థులు ఆధారపడ్డ మధ్యాహ్న భోజనం పథకానికి ఇటు కేంద్రం, అటు రాష్ట్రం కలిసి గండికొడుతున్నాయి. 2018-19 విద్యా సంవత్సరానికి ఏకంగా 800 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోత పెట్టడం గమనార్హం. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 800 స్కూళ్ల సంఖ్యను తగ్గించారు. ఇందులో 319 ప్రాథమిక పాఠశాలలు ఉండగా 481 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. స్కూళ్ల సంఖ్యలో కోత పెట్టడంతో అనివార్యంగానే మధ్యాహ్న భోజన సదుపాయం పొందే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయింది. గత ఏడాది పోల్చితే ఈసారి ఏకంగా 59 వేల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి దూరం కానున్నారు. 2017-18 విద్యా సంవత్సరంలో తెలంగాణలో 20,424 ప్రాథమిక పాఠశాలు, 8,999 ప్రాథమికోన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేశారు. ఈ మొత్తం పాఠశాలల్లో 11,50,000 మంది విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించారు. అయితే 2018-19 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి మాత్రం ప్రాథమిక పాఠశాలల సంఖ్య 20,105కు, ప్రాథమికోన్నత పాఠశాలల సంఖ్య 8,518కు తగ్గడం గమనార్హం. ఇందుకు సంబంధించి కేంద్ర ప్లానింగ్‌ అప్రూవల్‌ బోర్డుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించగా కేంద్రం యథావిఽధిగా ఆమోదించింది. ఇక విద్యార్థుల సంఖ్యకు వస్తే 2017-18లో 11,50,000 మంది విద్యార్థులు ఉండగా 2018-19 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 11,93,149 మంది విద్యార్థుల సంఖ్యతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. కానీ కేంద్రం 59 వేల మంది విద్యార్థుల సంఖ్యలో కోత పెట్టి 10,93,149 మంది విద్యార్థులకు ఆమోదముద్ర వేసింది.
 
కిచెన్‌ షెడ్డులేవీ..?
వాస్తవానికి తెలంగాణలో 30,408 కిచెన్‌ షెడ్డుల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం 10,077 షెడ్డులను మాత్రమే నిర్మించింది. రాష్ట్ర వాటాకు సంబంధించిన నిధుల కొరతతో మిగతా వాటిని నిర్మించలేకపోయినట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్రానికి తెలపడం గమనార్హం. కాగా, 15,348 కిచెన్‌ షెడ్డుల నిర్మాణం కనీసం ప్రారంభించలేదు. మరో 7,609 కిచెన్‌ షెడ్డుల నిర్మాణం వివిధ దశల్లో ఉందని కేంద్రానికి తెలిపారు. కిచెన్‌ షెడ్డులు లేకపోవడంతో మధ్యాహ్న భోజనం వంటవార్పు అంతా ఆరుబయటే జరుగుతోంది.
 
తగ్గిన విద్యార్థుల సంఖ్య
తెలంగాణలో మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతున్నట్లు కేంద్రం పేర్కొంది. సర్వే ప్రకారం 2016-17 విద్యా సంవత్సరంలో స్కూళ్లలో చేరిన విద్యార్థుల్లో 94 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్నారని కేంద్రం పేర్కొంది. అయితే 2017-18 విద్యా సంవత్సరంలో మాత్రం మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల సంఖ్య 88 శాతానికి తగ్గినట్లు కేంద్రం పరిశీలనలో తేలింది.
 మధ్యాహ్న భోజనం తయారీకి నేటికి కూడా స్కూళ్లలో కట్టెల పొయ్యినే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేవలం 16 శాతం పాఠశాలలు మాత్రం ఎల్‌పీజీ గ్యాస్‌ను వినియోగిస్తున్నట్లు కేంద్రం పరిశీలనలో తేలింది.
 విద్యార్థులకు తాగేందుకు కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. కేవలం 1,251 పాఠశాలల్లో మాత్రమే నీటి శుద్ధి పరికరాలు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. దీంతో వీలైంనంత త్వరగా అన్ని పాఠశాలల్లో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!