ప్రధానికి దగ్గరగా వెళ్లేందుకు ఎవరినీ అనుమతించొద్దు..! రాష్ట్రాలకు ఆదేశాలు

ప్రధానికి దగ్గరగా వెళ్లేందుకు ఎవరినీ అనుమతించొద్దు..! రాష్ట్రాలకు ఆదేశాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముప్పు పొంచి ఉందా? ఆయనను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి నిఘా సంస్థలు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను హెచ్చరించాయి. ప్రధాని పర్యటన సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సందేశమిచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ప్రధాని సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవ్వరినీ ప్రధానికి దగ్గరగా వెళ్లేందుకు అనుమతించొద్దని.. చివరకు అధికారులు, మంత్రులైనా సరే మోదీకి సంబంధించిన ప్రత్యేక భద్రతా సిబ్బంది నుంచి అనుమతి పొందిన తర్వాతే ఆయనను కలిసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తూ హోంశాఖ అన్ని రాష్ట్రాల్లోని పోలీస్‌ చీఫ్‌ లకు లేఖలు రాసింది.

ఎల్లప్పుడూ ప్రధాని చుట్టూ ఉండే భద్రతా సిబ్బందికి హోం శాఖ అధికారులు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. అవసరం లేకుండా మోదీకి దగ్గరగా ఎవ్వరినీ రానీయొద్దని చెప్పారు. ఈ బృందం ఎప్పుడూ మోదీకి దగ్గరలోనే ఉంటుంది. మోదీ ప్రజలకు దగ్గరగా వెళ్లే సందర్భాలను కూడా బాగా తగ్గించాలని హోంశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ వెంట ఉండే కమాండోలను కూడా పెంచనున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధాని మోదీనే అత్యధిక ప్రాధాన్యత గల లక్ష్యంగా ఉన్నారని జాతీయ భద్రతా కౌన్సిల్‌ ఇతర ఏజెన్సీలకు తెలిపింది. మోదీ రక్షణ గురించి ఏజెన్సీలు ప్రశ్నించగా కౌన్సిల్ ఈ విధంగా వెల్లడించింది. ఇటీవల నక్సలైట్ల నుంచి కూడా మోదీకి ముప్పు ఉందని ఓ లేఖ ద్వారా విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రోడ్‌ షోల సమయంలో మోదీ హత్యకు కుట్ర పన్నారని ఇటీవల పుణె పోలీసులు ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొనే ప్రముఖ వ్యక్తి మోదీనే. అయితే ఆయనను రోడ్‌ షోలు చేయొద్దని, ప్రచార ప్రణాళికలు, ఓ చోటు నుంచి మరో చోటుకు ఏ మార్గంలో వెళ్తారనే విషయాలను బహిర్గతం చేయకపోవడమే మంచిదని నిఘా వర్గాలు సూచిస్తున్నట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!