అక్కడ ఒక్క నిమిషం ఆపితే చాలు..! 10 Jul 18, 11:53 AM నిమిషం హాల్టింగ్‌తో రైల్వేస్టేషన్‌పై తగ్గనున్న భారం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నగర శివారు స్టేషన్లలో ఆపాలి

అక్కడ ఒక్క నిమిషం ఆపితే చాలు..!

నిమిషం హాల్టింగ్‌తో రైల్వేస్టేషన్‌పై తగ్గనున్న భారం
ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నగర శివారు స్టేషన్లలో ఆపాలి

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గించడానికి నూతనంగా చర్లపల్లి, నాగులపల్లి, లింగంపల్లి ప్రాంతాల్లో రైల్వే టర్మినల్స్‌ ఏర్పాటుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. చర్లపల్లి టర్మెనల్‌కు తప్ప మిగతా రెండింటికి కేవలం కాగితాలకే పరిమితమైంది. టర్మినల్స్‌తో సమస్యలు తీరుతాయని భావించిన రైలు ప్రయాణికులకు నిరాశే మిగులుతోంది. చర్లపల్లి స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న రెండు ప్లాట్‌ఫామ్‌లకు అదనంగా మరో ఆరు ప్లాట్‌ఫామ్‌లు నిర్మించనున్నారు. ఇక్కడ సరిపడా భూమి లేకపోవడంతో భూసేకరణ పనిలో రైల్వేశాఖ ఉంది. సుమారు 80కోట్ల రూపాయలతో భారీ టర్మినల్‌ నిర్మించనున్నారు. గతంలో బడ్జెట్‌లో నిధులు సైతం కేటాయించారు.
 
నాగులపల్లి టర్మినల్‌కు 250 ఎకరాల భూమి అవసరం ఉండడంతో దక్షిణమధ్య రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణపై దృష్టిసారించారు. ఇక లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో ఇప్పటికే 6 ప్లాట్‌ఫామ్‌లు ఉండడంతో టర్మినల్‌ నిర్మాణం త్వరగా చేపట్టవచ్చని రైల్వేశాఖ యోచిస్తోంది. 200 రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు నగరం నుండి రాకపోకలు సాగిస్తూ ప్రయాణికులను చేరవేస్తున్నాయి. కాచిగూడ స్టేషన్‌నుండి 40 రైళ్లు, నాంపల్లి నుండి 45రైళ్లు ఎక్కువ మొత్తంలో 115 రైళ్లు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.
 
అవుటర్‌లో నిలిచిపోతున్న రైళ్లు
సిగ్నల్‌ కోసం సికింద్రాబాద్‌ అవుటర్‌ సిగ్నల్‌ వద్ద రైళ్లు నిలిచిపోతున్నాయి. ఉదయం వేళల్లో ప్లాట్‌ఫామ్‌లు ఖాళీలేక అవుటర్‌ సిగ్నల్‌తోపాటు మౌలాలి, చర్లపల్లి, మల్కాజిగిరి స్టేషన్‌లలో నిలిచిపోతున్నాయి. సరైన సమయానికి తీసుకొచ్చిన రైలు సికింద్రాబాద్‌కు సమీపంలో నిలిచిపోతుండడంతో ప్రయాణికులు విసిగిపోతున్నారు. సమయానికి ఉద్యోగాలకు, కాలేజీలకు వెళ్ళలేక ఒత్తిడికి లోనవుతున్నారు.
 
మౌలాలి, చర్లపల్లికి ప్రయోజనం
ఉప్పల్‌, ఈసీఐఎల్‌, మల్కాజిగిరి, తార్నాక, నాచారం, హబ్సిగూడ, మల్లాపూర్‌, మౌలాలి, లాలాపేట్‌, సఫిల్‌గూడ, నేరేడ్‌మెట్‌ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు మౌలాలి స్టేషన్‌ అందుబాటులో ఉంది. బోడుప్పల్‌, ఘట్‌కేసర్‌, నాగారం, చర్లపల్లి, ఈసీఐఎల్‌ ప్రాంతాలకు వెళ్ళేవారికి చర్లపల్లిస్టేషన్‌ ఉపయోగకరంగా ఉం ది. ఇక్కడ రైళ్లు ఆపటం వల్ల ప్రయాణికులకు ఖర్చు, సమయం, దూరభారం తప్పనుంది.
 
సత్ఫలితాలు ఇస్తున్న గోల్కొండ హాల్టింగ్‌
మౌలాలి రైల్వేస్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్‌ కల్పిస్తుండడంతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉంది. గతంలో ఇక్కడ కేవలం పాసింజర్‌ రైళ్లు మాత్రమే హాల్టింగ్‌ ఉండేది. తర్వాత ఎల్‌టిటి, భయ్యప్పన హలీ, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్‌ కల్పిస్తుండడం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంది. మిగతా రైళ్ళనూ ఆపితే మరింత సౌలభ్యంగా ఉంటుంది.
 
ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు హాల్టింగ్‌..
టర్మినల్స్‌ నిర్మాణం పూర్తికావాలంటే సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపై భారం పడుతుంది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికులతో ఆయా స్టేషన్‌లు మరింత రద్దీగా మారుతున్నాయి. టర్మినల్స్‌ అందుబాటులోకి వచ్చేవరకు నగరంలో శివారులలో ఉన్న రైల్వేస్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు హాల్టింగ్‌ సదుపాయం కల్పిస్తే మూడు స్టేషన్‌లపై కొంత భారం తగ్గించవచ్చు.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!