హైదరాబాద్‌లో ఐటీ కంపెనీ నిర్వాకం.. 180 మంది తొలగింపు
హైదరాబాద్‌లో ఐటీ కంపెనీ నిర్వాకం.. 180 మంది తొలగింపు
అరగంట టైమిచ్చి రాజీనామాకు ఆదేశం
180 మందిని తొలగించిన సీడీకే గ్లోబల్
బెదిరించి తొలగించారంటున్న బాధితులు
రొటీన్‌లో భాగమేనన్న కంపెనీ ఎండీ
ఐటీలో కార్మిక చట్టాలు చట్టుబండలు
హైదరాబాద్ సిటీ,
రాజధానిలో మరో ఐటీ కంపెనీ అక్కరలేని ఉద్యోగులను వదిలించుకోవడానికి నిబంధనలను తుంగలో తొక్కింది. రహేజా మైండ్‌స్పేస్‌లో ఉన్న సీడీకే గ్లోబల్ ఇండియా సంస్థ గత శుక్ర, సోమవారాల్లో కలిపి 180 మంది ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయించింది. అందులో కొంతమంది పుణే కార్యాలయ ఐటీ నిపుణులు కూడా ఉన్నారు. పొద్దున్నే ఉత్సాహంగా ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులను ‘‘ముప్పయి నిమిషాల సమయం ఇస్తున్నాం. రాజీనామా చేసి వెళ్లిపోండి’’ అంటూ హెచ్‌ఆర్ సిబ్బంది ఆదేశించారు. లేఆఫ్ ఉద్యోగులకు ఇచ్చే పరిహారాలేవీ ఇవ్వలేదు. ఇస్తామని కూడా చెప్పలేదు. నిబంధనల గురించి ప్రశ్నించిన వారిని ఐటీ రంగంలో మరెక్కడా ఉద్యోగం దొరక్కుండా చేస్తామని బెదిరించారు. రాజీనామా చేసిన వారంతా నిజానికి గెంటివేతకు గురైనవారే. ఉద్యోగుల తొలగింపు వ్యవహారంలో సీడీకె గ్లోబల్ పూర్తిగా చట్టాలను ఉల్లంఘించిందని ఫోరమ్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ ప్రతినిధి ప్రవీణ్ ఆరోపించారు.
సీడీకే గ్లోబల్ బాధితులు తమను ఆశ్రయించారని చెప్పారు. సీడీకే సంస్థ ప్రతినిధులతో చర్చించడానికి ప్రయత్నించినా వారెవరూ స్పందించలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల విషయంలో కఠినంగా ఉండకపోవడం వల్లే ఇటీవల ఐటీ రంగంలో అడ్డగోలు లేఆఫ్‌లు ఎక్కువయ్యాయని బాధితులు అంటున్నారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించడం నగరంలోని ఐటీ సంస్థల్లో ఏడాదికాలంగా యథేచ్చగా జరుగుతోంది. లేబర్ కమిషనర్‌కు వినతి పత్రాలు జారీచేసి, కార్యాలయం ముంగిట ఆందోళనలు నిర్వహించడం తప్ప ఫలితమేమీ లభించడం లేదు. ఐటీ సంస్థలు కార్మిక శాఖ కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదని, అలాంటి వారిపట్ల లేబర్ కమిషనర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఐటీ మంత్రి కూడా కంపెనీల పక్షాన మాట్లాడటానికే ఆసక్తి చూపుతున్నారని ఆరోపిస్తున్నారు.
తమ సమస్యలను వినే తీరిక మంత్రికి లేదని, ట్విట్టర్‌లో తమ సమస్యలు విన్నవించినా వాటికి తప్ప అన్నిటికీ ఆయన సమాధానాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీడీకే గ్లోబల్ ఉద్యోగుల తొలగింపు అంశాన్ని లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని, రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఫోరమ్ ఫర్‌ఐటీ ప్రతినిధులు అంటున్నారు. గతంలో లేబర్ కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదుచేసిన కొంతమందిని విధుల్లోకి తీసుకున్నారని, కార్మిక శాఖ మరింత కఠినంగా ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని వ్యాఖ్యానించారు.
తొలగించింది నిజమే
103 మందిని మాత్రమే తొలగించాం. ఇది రోటీన్‌గా జరిగే ప్రక్రియ. కంపెనీ వృద్ధి, వ్యాపారావకాశాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా కొందరిని తొలగించాం. అంతా పరస్పర అంగీకారంతోనే జరిగింది. ఉద్యోగులను సానుభూతితో చూడటంతో పాటుగా వారికి అవసరమైన ఆర్థిక సహకారం, ప్లేస్‌మెంట్ సహకారం చేస్తున్నాం. మూడేళ్లలోనే మా కంపెనీ 800 నుంచి 1400 మంది ఉద్యోగులకు ఎదిగింది. మరో 150 మందిని తీసుకోనున్నాం.
- అరవింద్ చతుర్వేది, సీడీకే గ్లోబల్(ఇండియా) ఎండీ
By sources
Comments
Post a Comment