బ్యాంకు అధికారుల సంచలన నిర్ణయాలు
బ్యాంకు అధికారుల సంచలన నిర్ణయాలు
అన్ని కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది
తక్కువ లావాదేవీలు జరిగేవి అర్ధరాత్రి మూసివేత
సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టడానికి బ్యాంకర్ల చర్యలు
శివారు ప్రాంతాల్లో ఉన్న వాటి వివరాలు అందజేయాలన్న పోలీసులు
సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టడానికి బ్యాంకర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేటుగాళ్లు ఏటీఎం మెషీన్లలో స్కిమ్మర్లను అమర్చి డెబిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించే వీల్లేకుండా అన్నింట్లో యాంటీ స్కిమ్మర్ టెక్నాలజీని అప్‌లోడ్ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో సైబర్ క్రైం పోలీసులు, బ్యాంకు అధికారుల సమావేశం ఇటీవల జరిగింది. సైబర్ నేరగాళ్లు ఏటీఎం సెంటర్లలో స్కిమ్మర్లను బిగించి డెబిట్ కార్టుల సమాచారాన్ని తస్కరించి నకిలీ కార్డులను సృష్టించి అమాయకుల ఖాతాల నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టారు. మరికొంతమంది కేటుగాళ్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కిందిస్థాయి బ్యాంకు సిబ్బందిని బుట్టలో వేసుకొని క్రెడిట్ కార్డులు పొందారు. వాటి ద్వారా రెండు ముఠాలకు చెందిన సైబర్ నేరగాళ్లు బ్యాంకులకు రూ. 2 కోట్లు కుచ్చుటోపీ పెట్టారు. ఇలా బ్యాంకులను టార్గెట్ చేసుకొని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. దీంతో పోలీసులతోపాటు బ్యాంకర్లు అప్రమత్తం కావాల్సిన అవసరముందని సీపీ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా పలు బ్యాంకుల ఉన్నతాధికారులు, సైబర్ క్రైం పోలీసులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశంలో సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకు అధికారులు, పోలీసులు తాము తీసుకోబోయే నిర్ణయాలను, కార్యాచరణను ప్రకటించారు.
బ్యాంకు అధికారుల నిర్ణయాలు
శివారు ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్ల వద్ద తప్పని సరిగా భద్రతా సిబ్బందిని, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం.
ఏటీఎంలలో సైబర్ నేరగాళ్లు స్కిమ్మర్లను ఏర్పాటు చేసే అవకాశం లేకుండా యాంటీ స్కిమ్మర్ టెక్నాలజీని అప్‌లోడ్ చేయడం.
శివారు ప్రాంతాల్లో తక్కువ లావాదేవీలు జరిగే సెంటర్లను గుర్తించి వాటిని రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మూసివేయడం.
సైబర్ నేరగాళ్ల బారిన పడిన బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు సేకరించిన సమాచారం, ఎఫ్‌ఐఆర్ కాపీ, ఈమెయిల్ ఐడీలను బ్యాంకు అధికారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
కొత్త కొత్త సైబర్ నేరాల గురించి పోలీసులు ఎప్పటికప్పుడు సమావేశం ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలి. అందుకోసం బ్యాంకుల తరపున నోడల్ అధికారిని నియమించడం.
ఏటీఎం సెంటర్ల వద్ద కస్టమర్లకు కనిపించే విధంగా సైబర్ నేరాలకు సంబంధించిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం.
బ్యాంకు అధికారులు స్కూళ్లు, కళాశాలలకు వెళ్లి సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం.
బ్యాంకుల లావాదేవీల సమాచారాన్ని వినియోగదారుడికి స్థానిక భాషలో సమాచారం పంపడం.
ఖాతా నుంచి డబ్బు డ్రా అయినట్లు కస్టమర్‌కు సమాచారం అందిన వెంటనే అప్రమత్తమై బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసేలా, తదుపరి ట్రాన్జాక్షన్‌ను నిలిపివేసేలా బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లో అధికారి ఫోన్ నెంబర్ ఉండేలా చూడటం.
నగరంలోని శివారు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భద్రతలేని ఏటీఎం సెంటర్లు ఉన్నాయో గుర్తించి వాటి వివరాలను పోలీసులకు అందజేయడం.
సైబర్ నేరాలపై పోలీసుల నుంచి వచ్చిన నోటీసులకు బ్యాంకు అధికారులు వెంటనే స్పందించి బాధిత ఖాతాదారుల, సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన ఐపీల వివరాలను పోలీసులకు అందించారు.
ఎక్కడెక్కడ ఏటీఎం కేంద్రాల్లో సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడ్డారో వాటి వివరాలను ప్రజలకు తెలియజేయడం లాంటి ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నట్టు బ్యాంకర్లు నిర్ణయించారు. ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయ అధికారులతో చర్చించి వాటిని వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు.
రాత్రివేళల్లో తక్కువ లావాదేవీలు జరుగుతున్న ఏటీఎంలను గుర్తించి నిర్దిష్ట వేళ్లల్లో మాత్రమే పనిచేసేలా కెనరా బ్యాంకు చర్యలు తీసుకుంది.
Comments
Post a Comment