హైదరాబాద్‌లో బస్సెక్కాలంటే..
హైదరాబాద్‌లో బస్సెక్కాలంటే..
పాతబస్సులతో ప్రయాణం నరకప్రాయం
కండిషన్‌లో లేని వాహనాలతో అవస్థలు
ట్రాఫిక్ వలయంలో డ్రైవర్లపై ఒత్తిడి
పట్టించుకోని ఆర్టీసీ అధికా
నగరంలో ఓ గంట బండి నడపాలంటే కష్టం. అలాంటిది ట్రాఫిక్ పద్మవ్యూహం చుట్టుముడుతున్న రోడ్లపై 8గంటలపాటు పాత బస్సులు నడపాలంటే ఎంత అవస్థనో అర్ధం చేసుకోవచ్చు. గ్రేటర్ ఆర్టీసీలోని 2,340 ఆర్డినరీ బస్సుల్లో సగం పాతవే కావడంతో డ్రైవర్లకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. కండిషన్ సరిగ్గా లేని బస్సులతో రద్దీ ప్రాంతాలు, ట్రాఫిక్‌లో ఎక్కడ నిలిచిపోతాయో, ఎక్కడ కంట్రోల్ అవ్వవోనని ఆందోళన చెందుతున్నారు.
డ్రైవింగ్ సీటు కూడా అనువుగా లేక ఆస్పత్రుల పాలవుతున్నారు. కొందరు డ్రైవర్లు సొంత ఖర్చులతో సీటు మరమ్మతులు చేయించుకుంటున్నారు. ప్రధాన రహదారుల్లో తిరిగే బస్సులకు సైతం బ్రేకులు సరిగ్గా పడక ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో బస్సులకు హెడ్‌లైట్స్ వెలగడం లేదు. శివారు ప్రాంతాలకు తిరిగే బస్సులకు హెడ్‌లైట్స్, ఇండికేటర్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. హారన్లు మోగడం లేదని డిపోల్లో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారని డ్రైవర్లు వాపోతున్నారు.
ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతుందో...
నిత్యం రద్దీగా ఉండే నగర రోడ్లపై ఆర్టీసీ బస్సు ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితుల్లో డ్రైవర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మధ్యలో నిలిచిపోయి న బస్సులకు మరమ్మతులు చేసేలా మొబైల్ వ్యాన్లను రోడ్లపై ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. రిపేర్లకు గురవుతున్న బస్సుల సంఖ్య పెరుగుతుండడంతో కష్టంగా మారుతోందని మెకానిక్‌లు చెబుతున్నారు. గ్రేటర్‌లో 29డిపోలకు గాను గతంలో 10 రిలీప్ వ్యాన్లు ఉండగా, ఆ సంఖ్య ప్రస్తుతం ఆరుకు చేరింది. కోఠి, దిల్‌సుఖ్‌నగర్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, పికెట్ డిపోల పరిధిలోనే ఉన్నాయి. ఒక బస్సు రిపేర్ చేసేలోపు మరో బస్సు రిపేర్ అంటూ ఫోన్ వస్తుండడంతో మెకానిక్‌లు బెంబేలేత్తిపోతున్నారు.
ఒత్తిడి పెరుగుతోంది
ప్రతి డిపోలోనూ పాత బస్సులతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌లో పాత బస్సులు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతో ఒత్తిడి పెరుగుతోంది.
- ఓ బస్సు డ్రైవర్
Comments
Post a Comment