సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళుతున్నారా..? అయితే జర జాగ్రత్త..!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళుతున్నారా..? అయితే జర జాగ్రత్త..!
టీటీఈల అరాచకానికి కేరాఫ్... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..!
బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్న టీటీఈలు
ప్రయాణికులను కొట్టడానికి స్టేషన్‌లో ప్రత్యేక గది
అక్రమ సంపాదనతో నిండుతున్న టీటీఈల జేబులు
ప్రయాణికులపై హల్‌చల్
కొరవడిన రైల్వే ఉన్నతాధికారుల పర్యవేక్షణ
అది దక్షిణమధ్య రైల్వే స్టేషన్లలో అత్యంత పెద్ద స్టేషన్. నిత్యం వందల రైళ్ల రాకపోకలతో.. లక్షల మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే స్టేషన్. దేశం నలుమూలలకూ ప్రయాణికులను సురక్షితంగా చేరవేస్తూ.. కీర్తిప్రతిష్ఠలు పొందిన స్టేషన్. ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలిచిన స్టేషన్. ఇదీ ఇప్పటి వరకు ఈ స్టేషన్‌కున్న ఘన చరిత్ర...! కానీ.. కొంత మంది సిబ్బంది కారణంగా రూపుమాపేలా గొప్ప అపకీర్తిని మూటగట్టుకుంటోంది. కొందరు టీటీఈల అరాచకాలు, దాడులు, బెదిరింపుల కారణంగా స్టేషన్‌కు చెడ్డపేరుస్తోంది. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను బెదిరించి, దాడులు చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అమయాక ప్రయాణికుల నిలువు దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. అదే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్...!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో టీటీఈలు ప్రతి నెలలో పదిహేను రోజులు తిష్ఠ వేస్తారు. టార్గెట్ పేరుతో ప్రయాణికులను బెదిరించి.. వినకుంటే దాడులు చేసి మరీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నల్లకోటు ధరించి చేతిలో పుస్తకంతో సిద్ధంగా కనిపిస్తారు. రైల్వే టీటీఈ చేతిలో చిక్కితే చాలు ప్రయాణికులు డబ్బులు ముట్టజెప్పాల్సిందే. టికెట్ ఉన్నా డబ్బులు ఇవ్వాల్సిందే. ఇదేంటని అడిగితే.. కొందరికి దెబ్బలు కూడా తప్పలేదు. ఉన్నతాధికారులు అలసత్వం వల్ల వీరి ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
నిత్యం వందల రైళ్ల రాకపోకలు...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కలిపి నిత్యం 294 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. వీటిలో దాదాపు 2 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 12 వరకు బిహార్, ఉత్తరప్రదేశ్, హౌరా, మహారాష్ట్ర ముంబై తదితర రాష్ట్రాల నుంచి అనేక రైళ్లు వస్తాయి. సికింద్రాబాద్‌లో దిగుతున్న వారిలో అధిక శాతం కూలీలు ఉంటారు.
కూలీలే టీటీఈల టార్గెట్...
పొట్టకూటి కోసం నగరానికి రైళ్లలో వస్తున్న ప్రయాణికులు దాదాపు 90 శాతం టికెట్ తీసుకొని సికింద్రాబాద్‌లో దిగుతారు. ఇదే అదునుగా భావించిన సికింద్రాబాద్‌రైల్వే స్టేషన్‌లో తిష్ఠ వేసిన టీటీఈలు బిహార్, మహారాష్ట్ర నుంచి వచ్చే కూలీలను టార్గెట్ చేస్తున్నారు. బిహార్ నుంచి సికింద్రాబాద్‌కు రాత్రి 10 గంటలకు పాట్నా ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ రైలులో వచ్చే వారంతా కూలీలు, కంపెనీలో పనిచేసేందుకు వచ్చే కార్మికులు. గుంపులు గుంపులుగా వచ్చే వారి నడక, మాటతీరును గమనించి టీటీఈలు టికెట్ చూపించాలని అడుగుతారు. గుంపులో ఒకరికి ఇద్దరికి టికెట్ ఉండదని తెలిసి.. వారిని టార్గెట్ చేస్తున్నారు. టికెట్ లేని ప్రయాణికులుంటే చాలు వారి నుంచి దాదాపు రూ.2 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. అందుకు రశీదు కూడా ఇవ్వరు. స్టేషన్‌లో సీసీపుటేజీలు లేని దగ్గర ప్రయాణికులతో ఇలా బేరసారాలు ఆడుతుంటారు. రైల్వే టీటీఈల వేధింపులపై సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో అనేక సార్లు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడం లేదు.
టికెట్ ఉన్నా చలాన్లు...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఔరా వైపు వెళ్లే సాయంత్రం 4 గంటలకు బయల్దేరే ఫలక్‌నుమా రైలులో చాలా మంది కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళుతుంటారు. వారంతా రైలు సాయంత్రం 4 గంటలకు ఉంటే ఉదయం 6 గంటలకు ప్లాట్ ఫాం నెంబరు 1పై క్యూ కడుతుంటారు. దాదాపు ప్లాట్‌ఫాం పొడవున్నా క్యూలో ఉంటారు. వీరిని గమనించి రైల్వే టీటీఈలు ప్లాట్‌ఫాం టికెట్ లేకుండా లోపలికి ఎలా వచ్చారంటూ ప్రశ్నిస్తారు. ఫలక్‌నుమా రైల్లో వెళ్ళాలని చెప్పినా వినిపించుకోరు. బలవంతంగా రూ. 1000 తీసుకొని కేవలం రూ.150 చలానా రాసిస్తారు. మిగతా రూ.850లను రైల్వే టీటీఈలు జేబులో వేసుకుంటున్నారు. చలానాలు రాసిచ్చి ప్రయాణికుల్ని జనరల్ బోగిలో ఎక్కనివ్వకుండా రిజర్వేషన్ బోగిలో ఎక్కాలని సూచిస్తారు. తీరా రిజర్వేషన్ బోగిలో ఎక్కిన ప్రయాణికులను.. ఆ బోగిలో టికెట్ తనిఖీల కోసం వచ్చే టీటీఈలు మళ్లీ జనరల్ బోగిలకు పంపిస్తారు. ఇలా రైల్వే స్టేషన్‌లో నిత్యం మోసమే జరుగుతోంది.
సీసీ కెమెరాలు లేని దగ్గర...
రైల్వే స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫాంలలో 44 సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో సికింద్రాబాద్‌లో దిగుతున్న అమాయక ప్రయాణికులను గేటు వద్ద ఉన్న టీటీఈలు టికెట్ చూపాలని అడుగుతుంటారు. ఎవరి దగ్గరైనా టికెట్ లేకపోతే ఇక ఆ ప్రయాణికుడిని చితకబాది ఓ గదిలో బంధిస్తారు. ఇదంతా సీసీ కెమెరాలు లేని దగ్గర జరుగుతోంది. కొందరైతే టికెట్ చూపించిన తరువాత మెల్లగా రైల్వేస్టేషన్ మాస్టర్ చాంబర్ సమీపంలో ఉన్న ప్రత్యేక గదిలోకి ప్రయాణికుడిని తీసుకెళతారు. టికెట్ చూపించినా ఇక్కడి నుంచి ఎందుకు నడుస్తున్నావు..? లగేజీ ఇంత ఎక్కువ ఎందుకుంది..? అంటూ ప్రయాణికుడిని బెదిరించి రూ.1000 నుంచి రూ.4 వేల వరకు దోచేస్తున్నారు. లేదంటే పోలీసులకు పట్టిస్తానని, జైలుకు పంపుతామంటూ బెదిరించడంతో.. సదరు ప్రయాణికులు రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చామని భయపడి తమ ఖర్చుల కోసం తెచ్చుకున్న డబ్బులను రైల్వే టీటీఈలకు ముట్టజెప్పుతూ ఆవేదనతో బయటికి వెళ్లిపోతున్నారు.
టార్గెట్ పేరుతో దోపిడీ...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న రైల్వే టీటీలు అందరూ ప్రతి నెలా దాదాపు రెండు లక్షల వరకు చలానాల రూపంలో ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఒకటవ తారీఖు వచ్చిందంటే చాలు రైల్వేస్టేషన్‌లో టీటీఈలు వాలిపోతారు. అమాయక ప్రయాణికులు కనిపిస్తే చాలు చితక్కొట్టి మరీ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ బోగిలో ఈ తతంగం ఎక్కువగా జరుగుతోంది. వందల మంది ఒడిశా, యూపీకి చెందిన ప్రయాణికులు ఉదయాన్నే క్యూలో ఉంటారు. క్యూలో ఉన్నా బలవంతంగా ప్లాట్‌ఫాంపైనే చలానాలు రాస్తున్నారన ఆరోపణలున్నాయి!
టికెట్ చూపించినా చితక్కొట్టాడు...
నేను హైదరాబాద్ రేంజ్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాను. నా సొంత ఊరుకు వెళుదామని గతేడాది ఆగస్టు 3న ఉదయం 8.20 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చాను. ఊరెళ్లేందుకు టికెట్ తీసుకున్నప్పటికీ రైల్వేస్టేషన్‌లో రైల్వే టీటీ శ్రీనివాస్ టికెట్ చూపించాలని అడిగాడు. టికెట్ చూపించినా స్టేషన్ మాస్టర్ చాంబర్ సమీపంలో ఉన్న ప్రత్యేక గదికి తీసుకెళ్లి చితక్కొట్టాడు. అదేమని అడిగితే మళ్లీ కొట్టాడు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన నాకే ఈ పరిస్థితి ఎదురైతే.. ఇక సామాన్య ప్రయాణికులకు ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు చూద్దాంలే అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఇలా టీటీఈల దాష్టీలకాలపై ఎందరో ఫిర్యాదులు చేస్తున్నా రైల్వే పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు.
- బాధితుడు వెంకటేష్, దమ్మాయిగూడ
Comments
Post a Comment