కేంద్రం.. పలాయనవాదం

కేంద్రం.. పలాయనవాదం!

వీగిన అవిశ్వాసం 
అనుకూలం 126
వ్యతిరేకం 325 
325 ఓట్లతో మోదీ విజయం 
ఓటింగ్ లో పాల్గొనని టీఆర్ఎస్..సేన గైర్హాజరు
బీజేడీ సభ్యుల వాకౌట్
ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ..
సాగిన 12 గంటలు సాగిన సభ
సభ సాక్షిగా మాటల మాయ హామీలపై దాటవేత 
విభజన సమస్యలు కాంగ్రెస్‌ పాపమే
ఆర్థిక సంఘం వల్లే హోదా ఇవ్వలేదు
హోదాతో సమానమైన ప్యాకేజీ ప్రకటించాం
అందుకు చంద్రబాబు అంగీకరించారు
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ‘యూటర్న్‌’
వైసీపీ వలలో పడొద్దని ఫోన్‌ చేసి చెప్పాను
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం
అవిశ్వాసంపై చర్చలో మోదీ మళ్లీ పాత పాట
 హోదాపై చర్చ వద్దు.. ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి
లెక్కలపై హోంమంత్రి రాజ్‌నాథ్‌దీ అదే బాట
గల్లా ప్రశ్నలకు సమాధానం నిల్‌

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మాటలతో మాయ చేశారు. నవ్యాంధ్రకు ఏమిచ్చారో చెప్పకుండా, ఎలా న్యాయం చేస్తారో వివరించకుండా... చర్చమాటున మాట దాటవేశారు. నవ్యాంధ్రకు అన్యాయంపై తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు సవివరంగా సమాధానం ఇవ్వాల్సిన ప్రధాని... తూతూమంత్రంగా పాత పాటే పాడారు. మొత్తంగా ఏపీకి సాయంపై తగిన సమాధానం ఇవ్వకుండా కేంద్రం పలాయన వాదం చిత్తగించింది. ‘ఇదీ మాకు జరిగిన అన్యాయం’ అంటూ శుక్రవారం ఉదయం టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రాత్రి రామ్మోహన్‌ నాయుడు అంశాల వారీగా గణాంకాలు, ఆయా పరిణామాలను సవివరంగా వివరించారు. ప్రధానిని సూటిగా ప్రశ్నించారు.
 
వీటన్నింటికీ సమాధానం ఇవ్వాల్సిన ప్రధాని మోదీ... కాంగ్రె్‌సపై విరుచుకుపడుతూ, మధ్యలో ఏపీ ప్రస్తావన తీసుకొచ్చి మళ్లీ జాతీయ అంశాలను ప్రస్తావించి, చివర్లో ‘ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం’ అంటూ ఒక గంభీరమైన ప్రకటన చేసి ప్రసంగం ముగించారు. మోదీ ఏపీ అంశాలపై స్పందించాలంటూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగగా... ‘మిస్టర్‌ జయదేవ్‌ గల్లా... మీ వద్దకు కూడా వస్తున్నా! తొందరపడొద్దు. ఎవ్వరినీ వదలను! అందరికీ బదులిస్తా!’ అంటూ ప్రధాని హెచ్చరిక స్వరం వినిపించారు. విభజన సమస్యలను పరిష్కరించాల్సిన స్థానంలో ఉన్న ఆయన... ఈ కష్టాలన్నింటికీ కాంగ్రెసే కారణమని నిందించారు. పోలవరం, రెవెన్యూ లోటు భర్తీ, ఆస్తుల విభజన, విద్యాసంస్థలకు తగిన స్థాయిలో నిధుల విడుదల, విశాఖకు రైల్వే జోన్‌, కడప ఉక్కు కర్మాగారం... ఇలా అనేక సమస్యలున్నప్పటికీ దేనినీ ప్రధాని ప్రస్తావించలేదు. ‘హోదా ఇవ్వలేక పోయాం. ప్యాకేజీ ఇచ్చాం. రాజధాని పనులకు తోడ్పాడు అందిస్తాం’ అనే మాట మాత్రమే చెప్పారు.
 
తలుపులు మూసి విభజించారు!
‘‘18 ఏళ్ల క్రితం వాజపేయి ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి గందరగోళం, సమస్య లేదు. ఆ రాష్ట్రాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. కానీ... కాంగ్రెస్‌ మాత్రం పార్లమెంటు తలుపులు మూసివేసి ఏపీని విభజించింది’’ అని మోదీ తెలిపారు. ‘తెలుగు తమ తల్లి. ఆ స్ఫూర్తిని కాపాడాలి’ అని తాను చెప్పానన్నారు. తల్లిని చంపి, బిడ్డకు జన్మనిచ్చారని తాను అప్పుడు చెప్పానని... ఇప్పుడు కూడా చెబుతున్నానని అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ ఇలా చేసిందని ఆరోపించారు. ‘‘ఒక చోట పోయినా, మరో చోట అధికారంలోకి రావొచ్చునని కాంగ్రెస్‌ భావించింది. కానీ, ప్రజలు రెండుచోట్లా బుద్ధి చెప్పారు’’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని విభజించి పాకిస్థాన్‌ను ఏర్పాటు చేసిందని... ఇప్పటికీ రెండు దేశాల మధ్య గొడవలు నడుస్తూనే ఉన్నాయని తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య కూడా ఇదే పరిస్థితి సృష్టించారన్నారు. ఆస్తులు, అప్పులపై ఇప్పటికీ గొడవ జరుగుతోందని... దీనిని బట్టి విభజన జరిగిన తీరు తెలుస్తోందని అన్నారు.
 
అందుకే హోదా ఇవ్వలేదు...
హోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు మధ్య తేడా ఉండదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని మోదీ తెలిపారు. ఈ సిఫారసులు తమ చేతులు కట్టేయడంవల్లే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామని ప్రధాని వివరించారు. అదే సమయంలో... ఒక రాష్ట్రానికి చేసే సహాయం, మరో రాష్ట్రంపై ప్రభావం చూపించొద్దని అన్నారు. ఏపీకి హోదాపై స్వయంగా కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీ ఇదే సభలో అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ‘‘ఏపీ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా గౌరవిస్తాం. అభివృద్ధికి సహకరిస్తాం.
 
హోదాతో లభించే ప్రయోజనాలకు సమానంగా ప్యాకేజీ ఇవ్వాలని 2016లో సెప్టెంబరులో నిర్ణయించాం. దీనిని 2016 నవంబరులో చంద్రబాబు కూడా స్వాగతించారు. కానీ... కేవలం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారు’’ అని మోదీ ఆరోపించారు. ఎన్డీయే నుంచి వైదొలగాలని టీడీపీ నిర్ణయించుకున్నప్పుడు తాను స్వయంగా చంద్రబాబుకు ఫోన్‌ చేసి... ‘మీరు వైసీపీ వలలో పడుతున్నారు. దాని నుంచి బయటపడలేరు’ అని చెప్పానన్నారు. ఇప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య విభేదాలను పార్లమెంటుదాకా తీసుకొచ్చారని విమర్శించారు.
 
మేమే పరిష్కరించాను...
విభజన అంశాలపై తొలి ఏడాది చంద్రబాబు, కేసీఆర్‌ గొడవలు పడుతుంటే గవర్నర్‌, హోంమంత్రి, తాను సమావేశమై పరిష్కరించే వాళ్లమని మోదీ చెప్పారు. వాళ్లను శాంతపరిచేందుకు ప్రయత్నించామన్నారు. టీఆర్‌ఎస్‌ పరిణతి ప్రదర్శించి అభివృద్ధిపై దృష్టి సారించిందని, ఏపీలో ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందేనని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘‘విభజన సమస్యలు నిజమే. కాంగ్రెస్‌ ఆ పరిస్థితి సృష్టించింది. ఏపీ, తెలంగాణకు కేంద్రం ఏ లోటూ రానివ్వదు. ఏపీ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నెరవేరుస్తాం. రాజధాని పనులు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం పాటుపడుతుంది. వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు. ఇది నేను ఇస్తున్న భరోసా’’ అని తెలిపారు. మోదీ ప్రసంగం సాగినంత సేపు టీడీపీ ఎంపీలు ఆందోలన చేస్తూనే ఉన్నారు. అయినా... పట్టించుకోకుండా మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!