కొత్త రేషన్‌కార్డులకు మోక్షమెన్నడో..?

కొత్త రేషన్‌కార్డులకు మోక్షమెన్నడో..?

పెండింగ్‌లో 8వేల దరఖాస్తులు
పథకాల అమలులో అధికారుల బిజీ
విచారణకు నోచుకోని దరఖాస్తులు
ఆర్‌ఐ లాగిన్‌లో ఓపెన్‌ చేయని పరిస్థితి
నల్లగొండ: అర్హులైన పేదలు ఆహార భద్రత కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తకార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. మూడేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం పేరిట ఆహారభద్రత కార్డులను జారీ చేశారు. ఈ కార్డులు కూడా అర్హులందరికీ పూర్తి స్థాయిలో అందలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 2105 నుంచి 2017 వరకు ఆహార భద్రత కార్డు రానివారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఏడాదిన్నర క్రితం జిల్లాల పునర్విభజన నేప థ్యంలో వెబ్‌సైట్‌ను ప్రభుత్వం నిలిపి వేయడంతో అప్పటి నుంచి కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునే వీలు లేకుండాపోయింది. తాజాగా గత ఏప్రిల్‌ 1నుంచి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి మళ్లీ కొత్తకార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో నూతన రేషన్‌కార్డుల కోసం 8వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటికి ఎప్పటి లోగా మోక్షం కలుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వరుసగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రెండు నెలల క్రితం కొత్తకార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కార్డుల పంపిణీకి మరికొం త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
 
పెండింగ్‌లోనే దరఖాస్తులు..
ఆహార భద్రత కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 8వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆయా మండలాల ఆర్‌ఐల వద్దనే ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం జి ల్లా పౌర సరఫరాలశాఖ అధికారి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. భూరికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకం తదితర పనులతో రెవెన్యూ అధికారులు బిజీబిజీగా ఉండడంతో కార్డుల జారీలో ఆలస్యమవుతున్నట్లు చెబుతున్నారు. పాస్‌పుస్తకాల్లో ఉన్న తప్పుల సవరణకు మరికొ న్ని రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన ఆహార భద్రత కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ఈ నెలలో మోక్షం కలిగేలా కనిపించడంలేదు. జిల్లాలో 4,49,823 ఆహార భద్రతా కార్డులు, 28,941 అంత్యోద య, 73 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. కొత్తకార్డులు మంజూరైతే వీటి సంఖ్య మరింత పెరగడంతోపాటు ప్రతినెల కోటా కూడా పెరగనుంది.
 
ప్రభుత్వ పథకాలకు దూరం..
కొత్తకార్డుల కోసం మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే అన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న చాలా మంది రసీదులను తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించలేదని తెలిసింది. దీంతో సంబంధిత దరఖాస్తులు పరిశీలనకు రావడంలేదని సమాచారం. కార్డుల జారీలో జాప్యంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆరోగ్యశ్రీ తదితర పథకాలకు నోచుకోలేక పోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
 
By sources


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!