ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ
ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ
18 Jul 2018, 05:26 PM
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడంతో మోదీ సర్కార్ విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. అవిశ్వాస తీర్మానంపై వచ్చే శుక్రవారం చర్చించనున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ తన పార్టీ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఒకవేళ ఆ రోజు లోక్‌సభలో జరిగే చర్చలో పాల్గొనకుండా డుమ్మా కొట్టిన ఎంపీలపై అనర్హత వేటు కూడా వేసే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం రోజున జరిగే సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజంతా చర్చలు జరగనున్నాయి. జీరో అవర్‌తో పాటు ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టేందుకు అవకాశంలేదు. ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం అనంతరం అవిశ్వాసంపై ఓటింగ్ జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జులై 20న జరిగే విశ్వాస పరీక్షలో పూర్తి మెజారిటీతో గెలుస్తామని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ఓటింగ్‌లో నెగ్గడం తమకు చాలా సులువైన విషయమని పేర్కొన్నారు. మా సామర్థ్యం ఏంటో ప్రతిపక్షానికి చూపిస్తామని సవాల్ చేశారు.
Comments
Post a Comment