హైదరాబాద్‌లో ప్రమాదభరితంగా యూటర్న్‌లు
హైదరాబాద్‌లో ప్రమాదభరితంగా యూటర్న్‌లు
ఎక్కడా సూచిక బోర్డులు లేవు
రహదారుల విస్తరణ లేదు
ఇరుకు రోడ్లతో ప్రమాదాల్లో వాహనదారులు
నగరంలో యూటర్న్‌లు ప్రమాదభరితంగా మారుతున్నాయి. అక్కడ సిగ్నల్స్, బారికేడ్లు లేకపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్లు ఇరుకుగా ఉండటంతో టర్న్ తీసుకోవడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ట్రాఫిక్ జాం అవుతోంది. కొన్నిచోట్ల ఈ మలుపులు ఉపయోగపడే ప్రాంతాల్లో కాకుండా ఎక్కడో ఉంటున్నాయి. దాని వల్ల చాలా దూరం ప్రయాణించి వెనక్కి తిరిగి రావాల్సి వస్తోంది.
హైదరాబాద్: కేపీహెచ్‌బీ నుంచి కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌కు వెళ్లాలంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకూ వెళ్లి యూటర్న్ తీసుకోవాలి. అంటే హనదారుడు దాదాపు 3 కిలోమీటర్లు అదనంగా వెళ్లి మలుపు తీసుకుని రావాలి. దీనివల్ల సమయం, డబ్బు వృథా అవుతోంది. దీనికి తోడు ట్రాఫిక్ జాం. దీంతో చాలా మంది వివేకానంద రిహబిలిటేషన్ సెంటర్ నుంచి రాంగ్‌రూట్‌లో వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. లేదా చలానాలను భరిస్తున్నారు. అందువల్ల ఈ దూరాభారాలను తగ్గించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.
సిగ్నల్స్ తొలగించి యూటర్న్‌లు
ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్ చౌరస్తా, ముషీరాబాద్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్‌ను తొలగించి యూటర్న్‌లు పెట్టారు. భారీ వాహనాలు మళ్లించే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నల్లకుంట డివిజన్ పరిధిలోని రత్నానగర్ యూటర్న్‌లో ప్రమాదాలు జరుగుతున్నాయి. శంకర్‌మఠ్ కూరగాయల మార్కెట్ సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద, శివం రోడ్డులో శిరిడీ సాయిబాబా దేవస్థానం సమీపంలో, బతుకమ్మ కుంటల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆబిడ్స్ జీపీవో చౌరస్తా, ఎంజేమార్కెట్, అఫ్జల్‌గంజ్ చౌరస్తా, కోఠి ఉమెన్స్ కాలేజీ వద్ద యూటర్న్‌లతో ట్రాఫిక్ స్తంభిస్తోంది.
దూరాభారం
గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి రహేజా మైండ్ స్పేస్ వరకు వెళ్లాల్సిన వారు సైబర్ టవర్ సర్కిల్ వద్దకెళ్లి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి. నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది.
దిల్‌సుఖ్‌నగర్ ఐడియా కళాశాల యూటర్న్ నుంచి రాజధాని థియేటర్ యూటర్న్ మధ్య 900 మీటర్ల దూరం ఉంది.
చైతన్యపురి పుష్పాగార్డెన్ నుంచి కొత్తపేట చౌరస్తా యూటర్న్ వరకు 800 మీటర్ల దూరం ఉంది. వాహనదారులు అటూఇటూ తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
ఎల్‌బీనగర్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణ పనుల వల్ల బారీకేడ్లను ఏర్పాటు చేసి చాలా దూరంలో యూటర్న్‌లిచ్చారు.
బైరామల్‌గూడ నుంచి వచ్చే వాహనదారులు డీమార్టు వద్ద యూ టర్న్ చేసుకొని ఉప్పల్, హయత్‌నగర్ వైపు వెళ్లాల్సి వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉప్పల్, బైరామల్‌గూడ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఇలా రోడ్డు మళ్లింపుతో ఆరేడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామినేని జంక్షన్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణం వల్ల యూ టర్న్‌లు దూరంగా ఏర్పాటు చేయటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఎల్‌బీనగర్ నుంచి మన్సూరాబాద్ వైపు వెళ్లే మార్గంలో యూ టర్న్‌ల మధ్య దూరం సుమారు 800 మీటర్లు ఉంది.
ప్రమాదాల పాయింట్లు
దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో గతంలోని యూటర్న్‌ను మూసేసి ఐడీయల్ జూనియర్ కళాశాల ముందు ఏర్పాటు చేశారు. అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముసారాంబాగ్ నుంచి దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట మార్కెట్ నుంచి ముసారాంబాగ్ వైపు వెళ్లే మార్గాల్లోనూ ఇదే పరిస్థితి. దిల్‌సుక్‌నగర్, గడ్డిఅన్నారం, సలీంనగర్, మలక్‌పేటలో చౌరస్తాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు సిగ్నల్స్‌ను మొదట్లో ఏర్పాటు చేసినా ఇప్పుడు దిల్‌సుక్‌నగర్ చౌరస్తా మినహా ఎక్కడా లేవు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఆర్టీసీ బస్సులు యూటర్న్ తీసుకునే క్రమంలో ట్రాఫిక్ జాం అవుతోంది. సంతో్‌షనగర్‌లోని పిసల్‌బండ చౌరస్తా, రక్షాపురం, డీఆర్‌డీఎల్ వద్ద యూ టర్న్ ప్రమాదకరంగా మారింది. ఎలాంటి సూచికలూ లేకపోవడంతో ప్రమాదాలై చనిపోయిన ఘటనలున్నాయి. పిసల్‌బండ చౌరస్తాలోని యూటర్న్ వద్ద అతి వేగంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వనస్థలిపురం ఆటోనగర్‌లోనూ అదే పరిస్థితి. మల్కాజిగిరి ఆర్‌కేనగర్‌లోని లక్ష్మీవిలాస్ బ్యాంక్ వద్ద సైతం యూ టర్న్ అత్యంత ప్రమాదకరంగా మారింది.
సికింద్రాబాద్ - ఉప్పల్ మార్గంలో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీని వల్ల తార్నాక జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్య తీరింది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్ కింది నుంచి వాహనాలు వెళ్లకుండా మూసేశారు. ఉస్మానియా వర్శిటీ నుంచి వచ్చే వాహనాలు లాలాగూడ వైపు వెళ్లడానికి గానీ, నాచారం వైపు వెళ్లడానికి గానీ తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీ ముందుకెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకోవాలి. అదేవిధంగా లాలాగూడ నుంచి తార్నాక జంక్షన్‌కు వచ్చి ఉస్మానియా యూనివర్శిటీ రోడ్‌లో వెళ్లాలనుకునే వాహనాలు హబ్సీగూడ వరకు వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. కిలోమీటర్ల దూరం వెళ్ళి యూటర్న్‌లు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. సికింద్రాబాద్-ఉప్పల్ మార్గంలో వాహనాలు వేగంగా వెళ్తుండడంతో యూటర్న్ తీసుకునే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఎల్‌బీనగర్ నుంచి సిక్రిందాబాద్‌కు వెళ్ళే మార్గంలో కామినేని ఆస్పత్రి, నాగోల్, ఉప్పల్, ఎన్‌జీఆర్‌ఐ, తార్నాక, మెట్టుగూడ ఉన్న సిగ్నల్స్ పూర్తిగా ఎత్తేసి యూటర్న్‌లు పెట్టారు. ఫ్రీ సిగ్నల్ సిటీకి నగర ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులు కొత్త అర్థం తీసుకొచ్చారు. రోడ్లలో యూటర్న్‌లను తీసుకురావడంతో ట్రాఫిక్ జామ్‌లు తలెత్తుతున్నాయి. వాహనదారులకు సమయం వృథాతో పాటు వాహన మెయింటనెన్స్ ఖర్చు అధికమవుతోంది.
పాతబస్తీలో పాట్లు
పాతబస్తీలో ఘాన్సీబజార్, ముర్గీచౌక్ నుంచి వచ్చే వాహనదారులు యాకుత్‌పురా, బడాబజార్, మీరాలంమండి వెళ్ళాలంటే షెహరాన్ హోటల్ నుంచి యూ టర్న్ తీసుకొని తిరిగి గుల్జార్‌హౌజ్‌కు వచ్చి పంజెషా నుంచి వెళ్ళాల్సి వస్తోంది. ఎతేబార్‌చౌక్ నుంచి దారుషిఫా వెళ్ళే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ జామ్‌లవుతున్నాయి. రక్షాపురం చౌరస్తా వద్ద బారికేడ్ల ఏర్పాటుతో ఉప్పుగూడ, గౌలిపుర, రక్షాపురం కాలనీ, రియాసత్‌నగర్, ఈదీబజార్, యాకుత్‌పురా వైపు నుంచి చాంద్రాయణగుట్ట వెళ్ళాలంటే డీఆర్‌డీఎల్ చౌరస్తాకు వెళ్ళి యూ టర్న్ తీసుకోవాల్సి వస్తోంది. హఫీజ్‌బాబానగర్ చౌరస్తా మూసివేయడంతోనూ అదే పరిస్థితి. చాంద్రాయణగుట్ట కేశవగిరి చౌరస్తాను మూసి రుమాన్ హోటల్ వద్ద యూ టర్న్ పెట్టడంతో వాహనాలు ఇష్టానుసారంగా వస్తున్నాయి. బారికేడ్లను కూడా పెట్టలేదు
కూకట్‌పల్లిలో కిలోమీటర్ల దూరం..
కూకట్‌పల్లి పరిధిలోని ఏఎ్‌సరాజునగర్, సుమిత్రానగర్, కూకట్‌పల్లి, బాలాజీనగర్, ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్ ప్రాంతాలకు కిలోమీటర్ల దూరంలో యూటర్న్‌లు ఉన్నాయి. దీంతో వాహనదారులు రాంగ్ రూట్‌లో వెళ్తున్నారు. ఏఎ్‌సరాజునగర్ వద్ద, కూకట్‌పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఐడీపీఎల్, ఆంధ్రాబ్యాంకు వద్ద గల యూటర్న్‌లతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కేపీహెచ్‌బీ కాలనీ, హైటెక్ సిటీ నుంచి జాతీయ రహదారిపై జేఎన్‌టీయూ వద్ద యూటర్న్ తీసుకుని ప్రగతినగర్, కూకట్‌పల్లి వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ తీవ్రంగా ఉంటోంది. హైదర్‌నగర్ భ్రమరాంభ మల్లికార్జున థియేటర్ల వద్ద, మైసమ్మ టెంపుల్ ముందు గల యూటర్న్‌లు ట్రాఫిక్‌తో స్తంభిస్తున్నాయి.
ఎర్రగడ్డ నుంచి ఖైరతాబాద్ వరకు సూచికల్లేవ్
ఎర్రగడ్డ నుంచి ఖైరతాబాద్ చౌరస్తా వరకు గల ప్రధాన రహదారిలో ఫ్లై ఓవర్ ముందున్న యూటర్న్ వద్ద సూచికబోర్డులు లేకపోవడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. ఎస్‌ఆర్‌నగర్ చౌరస్తా దాటిన అనంతరం ఉన్న యూటర్న్ వద్ద వాహనాలు టర్నింగ్ తిరుగుతున్నాయి. ఇక్కడ రోడ్డు చిన్నగా ఉండడం, సూచిక బోర్డు లేకపోవడంతో యూటర్న్ ఉందనే విషయం తెలియక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బిగ్‌బజార్ వద్ద ఉన్న యూటర్న్ ప్రమాదకరంగా మారింది.
రాజేంద్రనగర్ సర్కిల్‌లో...
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ వరకు ఉన్న పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రె్‌స వే కింద పలు యూ టర్న్‌లున్నాయి. పిల్లర్ నెంబర్ 156 వద్ద వాహనాలు మలుపు తీసుకునే క్రమంలో ప్రమాదాలవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసుల్లేకపోవడంతో శివా నగర్ నుంచి వచ్చే వాహనదారులు రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారు. అదే సమయంలో హైదర్‌గూడ వెళ్ళేవారు ఇదే యూ టర్న్ నుంచి మలుపు తిరిగి బస్తీకి చేరుకోవాల్సి ఉంటుంది. పిల్లర్ నెంబర్ 166, 134ల వద్ద బారికేడ్లు సరిగ్గా లేక వాహనదారులు ఇష్టానుసారంగా మలుపు తీసుకుంటున్నారు.
ట్రాఫిక్ పోలీసులేరి..?
మల్కాజిగిరి జోన్‌లో యూటర్న్‌ల వద్ద ట్రాఫిక్ పోలీసులు లేరు. మల్కాజిగిరి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రేమ్ విజయనగర్ కాలనీ మల్కాజిగిరి బార్ వరకు సుమారు కిలోమీటర్ మేర డివైడర్ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాంగ్ రూట్‌లోనే వెళ్తున్నారు. నేరేడ్‌మెట్ డివిజన్ పరిధిలోని వాయుపురి చౌరస్తాలో రాకపోకలు మూసి జేజేనగర్ వినాయక దేవాలయం దగ్గర యూటర్న్ ఇవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్కాజిగిరి కోర్టు, డీసీపీ కార్యాలయాల నుంచి వెళ్ళేవారంతా నేరేడ్‌మెట్ చౌరస్తా నుంచి సైనిక్‌పురి చౌరస్తాకు వెళ్లి తిరిగిరావాలి. అంత దూరం వెళ్లలేక రాంగ్‌రూట్లలో వెళ్తున్నారు. జేజేనగర్ వినాయక దేవాలయం దగ్గర ఇచ్చిన యూటర్న్ ఇరుకుగా ఉండి ప్రమాదాలకు, ట్రాఫిక్ జామ్‌లకు నిలయంగా మారింది. ఈ మార్గంలో రోడ్డును ఆరు లైన్లుగా మారుస్తున్నా సమీపంలో మంత్రి బంధువుల ఇళ్లు ఉండడంతో రోడ్డును విస్తరించ లేకపోతున్నారు.
పాదచారులకు నరకం....
యూటర్న్‌ల రాకతో సిగ్నల్స్ తీసివేయడంతో పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చందానగర్, గంగారం, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో పాదచారులు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. గచ్చిబౌలిలోని నాయక్ నగర్ యూటర్న్ వద్ద వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో గడ్డర్లను ఏర్పాటు చేస్తే స్ర్టెయిట్‌గా వచ్చే వాహనాలు యూటర్న్ తీసుకునే వాటిని ఢీ కొట్టే ప్రమాదం ఉండదు. గచ్చిబౌలి ప్లాటినం బిల్డ్డింగ్ వద్ద, గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాల, లింగంపల్లి ఆలిండ్ కాలనీ, నెహ్రూనగర్, చందానగర్, గంగారం, మదీనగూడ, మియాపూర్, హఫీజ్‌పేట్, కొత్తగూడ, కొండాపూర్ సిగ్నల్, కొండాపూర్ రామాలయం, హైటెక్‌సిటీ మైహోమ్ ప్రాంతాల్లోని యూటర్న్‌ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.
వివిధ ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి.. (ఫొటోలు)
మెహిదీపట్నంలో మొఘల్‌నగర్ చౌరస్తాను మూసేసి పిల్లర్ నెంబర్ 104, 105 మధ్యలో యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. కార్వాన్, గుడిమల్కాపూర్, రేతిబౌలి నుంచి వచ్చే వాహనాదారులు లంగర్‌హౌజ్ వైపు వెళ్లాలంటే ఇక్కడికొచ్చి యూటర్న్ తీసుకోవాల్సిందే.
నానాల్‌నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ పడగానే టోలిచౌకి వైపునకు వెళ్లే వాహనాలు లంగర్‌హౌజ్ మలుపులో నిలువగానే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
బాపూఘాట్ ఎదురుగా ఉన్న బ్యాంకులకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. వాటివల్ల గాంధీనగర్ చౌరస్తా నుంచి యూటర్న్ తీసుకునే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
మెట్టుగూడ డివిజన్‌లోని ఆలుగడ్డబావి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో నాలుగు యూటర్న్‌లున్నాయి. దూరాభరంతో సమయం, డబ్బు వృథా అవుతోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి, సఫిల్‌గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు సికింద్రాబాద్ వెళ్ళాలంటే మెట్టుగూడ జంక్షన్ వరకూ వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, రేతిఫైల్ బస్‌స్టేషన్, గురుద్వార వద్ద గల బస్ పాయింట్‌ల వద్ధ 1171 బస్సులు 6850 ట్రిప్పుల్లో భాగంగా యూటర్న్‌లు తీసుకునేక్రమంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
తిరుమలగిరి మహాత్మాగాంధీ కమ్యూనిటీ హాల్ వద్ద యూటర్న్‌ను వీఐపీలు వచ్చేటప్పుడు బంద్ చేస్తున్నారు. దీంతో వాహనదారులు సుమారు 2-4 కిలోమీటర్లు ముందుకెళ్ళి తిరిగి రావాల్సి వస్తోంది.
ఎల్‌బీనగర్ నుంచి కొత్తపేట వరకు ఆరు యూటర్న్‌లున్నాయి. భారీ వాహనాలు టర్న్ తీసుకునే సమయంలో ట్రాఫిక్ నిలిచిపోతోంది.
రసూల్‌పురా నుంచి మినిస్టర్ రోడ్డు వెళ్లే రోడ్డు మూసివేయడంతో అటు వెళ్లే వాహనాలు 100 మీటర్లు ముందుకెళ్లి రావాల్సి వస్తోంది.
శ్రీనగర్ కాలనీ నుంచి పంజాగుట్ట వెళ్లే రహదారిలో పీవీఆర్ నూతన మాల్ వద్ద యూటర్న్ ఏర్పాటు చేసిన రోడ్డు చిన్నగా ఉంది.
ఖైరతాబాద్ రైల్వే గేటు చౌరస్తా నుంచి మునిసిపల్ ఆఫీస్ వైపు వెళ్లే మార్గంలో ఐటీ మాల్ ఎదురుగా ఉన్న యూటర్న్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది.
పంజాగుట్ట బిగ్‌బజార్ ముందున్న యూటర్న్ వద్ద ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. రామంతాపూర్ మసీద్, హోటల్ గ్రాండ్ స్వాగత్ యూటర్న్‌ల వద్ద కూడా అదే పరిస్థితి.
సైనిక్‌పురి నుంచి ఈసీఐఎల్ చౌరస్తా ప్రధాన రహదారిలోని సైనిక్ పురి పెట్రోలు పంప్, అరుల్ కాలనీ, నార్త్ కమలానగర్ చౌరస్తాల్లోని యూటర్న్‌ల వద్ద వాహనదారులు అడ్డదిడ్డంగా వస్తున్నారు.
చిలకలగూడ చౌరస్తా నుంచి జామై ఉస్మానియా వరకు రోడ్డు కుంచించుకుని ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సీతాఫల్‌మండి, వారాసిగూడ, ఆర్ట్స్‌కాలేజీ మూల మలుపుల వద్ధ వాహనాలు ఎదురెదురుగా వస్తే వెళ్లలేని పరిస్థితి.
నిజాంపేట్ బస్టాండ్ చౌరస్తా మొదలుకొని అంబేద్కర్ విగ్రహం మూలమలుపు, భవ్యాస్ ఆనందం వరకు ఈ మధ్య కాలంలో నిత్యం వాహనాల రద్దీ ఉంటోంది. బాచుపల్లి, భౌరంపేట్, మల్లంపేట్‌ల నుంచి వచ్చి వెళ్లే వాహనాలతో యూటర్న్ స్తంభించిపోతుంది.
నిజాంపేట్ అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు గుంతలమయంగా మారి యూటర్న్ తీసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చింతల్‌లో ఎటువైపు వెళ్లాలన్నా ప్రతీ ఒక్కరూ గణే్‌షనగర్ వద్ద ఉన్న యూటర్న్ వద్దకు రావాల్సిందే.
రహదారి విస్తరణ చేపట్టాలి
కూకట్‌పల్లి ప్రాంతంలోని యూటర్న్‌ల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో వాహనదారులు ఇష్టానుసారం వెళ్తున్నారు. యూటర్న్‌ల వద్ద రహదారి విశాలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- వీరేంద్ర, ప్రైవేటు ఉద్యోగి, కూకట్‌పల్లి
రాంగ్‌రూట్‌లలో వాహనదారులు
తొందరగా గమ్యానికి చేరుకోవాలనే ఆతృతతో వాహనదారులు రాంగ్‌రూట్‌లలో వెళ్తున్నారు. ఫుట్‌పాత్‌లపై పయనిస్తున్నారు. అమీర్‌పేట నుంచి పంజాగుట్ట చౌరస్తా వద్ద రైట్ టర్న్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది.
- శ్రీనివాస్, వాహనదారుడు, సనత్‌నగర్.
నిమ్స్ ఆసుపత్రి వద్ద...
ఖైరతాబాద్ నుంచి అమీర్‌పేటకు వచ్చే ప్రధాన రహదారిలో ఎర్రమంజిల్ నుంచి మొదలుకుని పంజాగుట్ట చౌరస్తా వరకు వెళ్లాలంటే 40 నిమిషాల సమయం పడుతోంది. రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్‌లు ఇష్టమొచ్చినట్లున్నాయి. నిమ్స్ ఆసుపత్రి సమీపంలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్‌జాం అవుతోంది.
- విష్ణుభూషణ్ వాహనదారుడు, పంజాగుట్ట.
చాలా దూరంలో యూ టర్న్
ఎల్‌బీనగర్ చౌరస్తాలో నిత్యం ట్రాఫిక్ జాం అవుతోంది. నాగోలు నుంచి వచ్చి దిల్‌సుఖ్‌నగర్ వైపు, బైరామల్‌గూడ నుంచి ఉప్పల్ వైపు వెళ్లాలంటే చాలా దూరం వెళ్లి యూటర్న్ చేసుకోవాల్సి వస్తోంది. ఎల్‌బీనగర్ ప్రధాన కూడలి కాబట్టి.. ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్ రోడ్లు వేగంగా పూర్తి చేయాలి
- నాగేశ్వరరావు, ఎల్‌బీనగర్
తరచూ ప్రమాదాలు
యూటర్న్‌ల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మెట్రో రైల్, అండర్ బైపాస్, ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన యూటర్నులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలి. ప్రమాదాలను నివారించాలి.
- చంద్ర శేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర కాలనీ, హస్తినాపురం.
హయత్‌నగర్ యూటర్న్ వద్ద...
హయత్‌నగర్ హైవే బావర్చి వద్ద గల యూ టర్న్ వద్ద రోడ్డును విస్తరించాలి. కుంట్లూర్ నుంచి వచ్చే వాహనాలు ఇక్కడే యూ టర్న్ తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురువతున్నాయి. ట్రాఫిక్ పోలీసులను అందుబాటులో ఉంచాలి. లేదా కుంట్లూర్ రోడ్డుకు ఎదురుగా యూ టర్న్ తీసి సిగ్నల్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ చిక్కులు తొలగిపోతాయి
- సూర్య శ్రీనివా్‌సరెడ్డి, హయత్‌నగర్
సిగ్నల్ ఏర్పాటు చేయాలి...
కెనరా బ్యాంకు చౌరస్తా వద్ద నాలుగు వైపుల నుంచి వాహనాలు రావడంతో ట్రాఫిక్ జాం అవుతోంది. యూ టర్న్‌ను మల్‌రెడ్డి యాదిరెడ్డి బస్టాండ్ అవతల నుండి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ నెలకు నాలుగు ప్రమాదాలు జరుగుతున్నాయి
- వర్కాల బాల్‌రాజ్, స్థానికుడు.
ప్రమాద సూచికను ఏర్పాటు చేయాలి
ప్రమాదకరంగా ఉన్న పిసల్‌బండ యూటర్న్ వద్ద అధికారులు తగు చర్యలు చేపట్టాలి. సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను నియమించాలి. యూటర్న్ వచ్చే 100 మీటర్ల ముందు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి.
- శ్రీనివాస్, వాహనదారుడు, సంతోష్‌నగర్.
మెట్టుగూడ జంక్షన్ వద్ద యూ టర్న్ ఎత్తేయాలి...
ఎక్కడికెళ్ళాలన్నా వన్ వే అయిపోయింది. మెట్టుగూడ జంక్షన్ వద్ద యూ టర్న్ ఎత్తివేసి సిగ్నల్స్ ఉన్న చోట ప్రారంభించాలి. యూ టర్న్‌లను దూరంగా పెట్టడం వల్ల సమయం, డబ్బు వృథా అవుతోంది. అంథోని చర్చి వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలి.
- మహేందర్‌యాదవ్
By sources
Comments
Post a Comment