సికింద్రాబాద్ రైల్వేస్టేషనే వారి టార్గెట్..అక్కడ జరిగే పని ఇదే..

సికింద్రాబాద్ రైల్వేస్టేషనే వారి టార్గెట్..అక్కడ జరిగే పని ఇదే..

అన్ని ప్రాంతాల్లో నిఘా కరువు
దొంగలకు సేఫ్ జోన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
సీసీ కెమెరాలున్నా ఫుటేజీల్లో స్పష్టత కరువు
ముందుకు సాగని కేసుల దర్యాప్తు
బయటి కెమెరాల ఆధారంగా ఛేదన
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, 

నేర పరిశోధనలో సీసీ ఫుటేజీలు కీలక భూమిక పోషిస్తాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు నేరస్థుల కదలికలు వాటి ఆధారంగా బయటపడుతున్నాయి. కేసుల దర్యాప్తులో పోలీసులకు మార్గదర్శకంగా పనిచేసి దొంగలను పట్టుకోవడంలో సహకరిస్తున్నాయి. కెమెరాల నిఘాలో ఉన్న ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితులు సులువుగా దొరికే అవకాశాలు ఎక్కువ. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాలు ఉన్నా ఫుటేజీల్లో స్పష్టత లేకపోవడంతో నిందితులను గుర్తించడంలో పోలీసులకు సవాల్‌గా మారుతోంది. 220 రైళ్లలో సుమారు లక్షా 60 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌లో సీసీ కెమెరాల వ్యవస్థ పటిష్ఠంగా లేదు. ఎప్పుడో ఏర్పాటు చేసిన వాటిపై ఆధారపడుతున్నారు తప్ప ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావటానికి రైల్వేశాఖ శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీల్లో స్పష్టతలేకపోవడంతో బయట ఉన్న కెమెరాల ఫటేజీల ఆధారంగా నేరస్థులను గుర్తించారు. అలాంటప్పుడు రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరాల వ్యవస్థ ఉండి ప్రయోజనం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
 
సీసీ కెమెరాల నిఘా ఉన్నా...
అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సరిపడా సీసీ కెమెరాలు లేవు. ఉన్న వాటి ఫుటేజీల్లో స్పష్టత లేకపోవడంతో కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. కొంతమంది చోరులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. రైల్వే ప్రింటింగ్‌ ప్రెస్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శాండిల్‌కుమార్‌ చెన్నై ఎక్స్‌ప్రె్‌సలో గురువారం ఉదయం 5 గంటలకు 9వ నెంబర్‌ ప్లాట్‌ ఫారంలో లగేజీ దించుతూ హ్యాండ్‌బ్యాగ్‌ బెర్త్‌పై పెట్టాడు. రెప్పపాటులో గుర్తుతెలియని వ్యక్తి బ్యాగ్‌ తీసుకొని ఉడాయించాడు. అందులో 13 తులాల బంగారం, రూ. 20 వేలు, సెల్‌ఫోన్‌, ఏటీఎం కార్డులు ఉన్నాయి. బాధితుడు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలను పరిశీలించగా ఫుటేజీలో స్పష్టత లేదు.
 
రైళ్లు, రైల్వేస్టేషన్‌లే టార్గెట్‌
ప్రయాణికులను దొంగలు మాటల్లోకి దింపి నిలువునా దోచేస్తున్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి స్టేషన్‌లో ప్రయాణికులను దోచుకొని పారిపోవడం కొందరు వృత్తిగా మార్చుకున్నారు. టికెట్‌ కొనడం, రైలెక్కడం, దిగిపోయే హడావిడిలో ప్రయాణికులు ఉన్నప్పుడు కేటుగాళ్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్ లు, బంగారు ఆభరణాలు, పర్సులు, బ్యాగ్‌లు అపహరించడం నిత్యకృత్యమైంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దొంగలకు సేఫ్‌ జోన్‌గా మారింది. పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లి బయటకు వచ్చినా వారిలో మార్పు రావడం లేదు. జనరల్‌, తత్కాల్‌ టికెట్లు తీసుకొని రిజర్వేషన్‌ కోచ్‌లలో దొంగతనాలకు పాల్పడుతుండడంతో పోలీసులు పట్టుకోవడం కష్టంగా మారింది.
 
కీలక కేసుల్లో...
2015 జూలైలో లాలాపేటలో 17 ఏళ్ల మృతదేహం లభించింది. ఆ యువతి 25వ తేదీ మధ్యాహ్నం ఓ యువకుడితో కలిసి నడుచుకుంటూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఫుటేజీలో స్పష్టత లేకపోవడంతో ఆమె పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుపట్టలేకపోవడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. మరో ఘటనలో అదే ఏడాది రైల్వేస్టేషన్‌లో తల్లిని మాటల్లో పెట్టి తన ఐదేళ్ల పాపను గుర్తుతెలియని మహిళ కిడ్నాప్‌ చేసింది. ఈ దృశ్యం కెమెరాల్లో రికార్డయినప్పటికీ స్పష్టత లేకపోవడంతో స్టేషన్‌ బయట ఉన్న కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీలను పరిశీలించి కిడ్నాప్‌ ముఠాను అరెస్టుచేశారు.
 
ఆధునిక టెక్నాలజీ కెమెరాలు అవసరం
కేసుల దర్యాప్తులో సీసీకెమెరాల ఫుటేజీలు కీలకం. లక్షల మంది రాకపోకలు సాగించే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అంతటా పోలీసులు నిఘా పెట్టాలంటే సాధ్యం కాదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో సీసీ కెమెరా ఉన్నదా? అనేది ప్రాథమికంగా పరిశీలిస్తాం. దానిలో రికార్డయిన ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు సులభం అవుతుంది. కెమెరాలు లేకపోతే దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఆధునిక సాంకేతికత ఉన్న కెమెరాలు ఉంటే నేరస్థులను పట్టుకోవడం సులభం.
- అశోక్‌కుమార్‌, రైల్వే ఎస్పీ
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!