గాంధీ వారసులం కలవడం కష్టం కుటుంబ సభ్యులు 150 మందికిపైనే
గాంధీ వారసులం కలవడం కష్టం
కుటుంబ సభ్యులు 150 మందికిపైనే
బాపూజీ కుటుంబం సభ్యులు ఎంత మంది ఉన్నారు? వారంతా ఎక్కడ ఉన్నా... ఎప్పుడైనా కలుస్తారా?ఆ కుటుంబంలో ఇప్పటి పిల్లలకు మహాత్ముడి ఆశయాల గురించి తెలుసా?జాతిపిత వారసులు ప్రస్తుతం ఎలా ఉన్నారు? గాంధీ సిద్ధాంతాల పట్ల వారి అభిప్రాయమేంటి? ... అక్టోబరు 2 వస్తోందంటే ఇలా అందరిలో ఎన్నో ప్రశ్నలు... మరి సమాధానాలు ఎలా కనుక్కోవాలి? గాంధీ మునిమనవడు డాక్టర్ ఆనంద్ గోకని గాంధీ అలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను 'హాయ్ 'తో పంచుకున్నారు.* గాంధీజీ కుటుంబ సభ్యులంతా ఎక్కడ? ఎలా ఉన్నారు?
మహాత్మా గాంధీకి నలుగురు మగ పిల్లలు. హరిలాల్ , మణిలాల్ , రామ్ దాస్ , దేవదాస్ . రామ్ దాస్ గాంధీ చిన్న కుమార్తె నా తల్లి. గాంధీజీ నలుగురు కుమారుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన జీవనశైలి. హరిలాల్ గాంధీ జీవితం కొంచెం చెదిరిపోయింది. మహాత్ముని సూత్రాలు, ఆదర్శాలను ఆయన విభేదించేవారు. ఆయన ఒక్కరే ఒకవైపు ఉండిపోయారు. మిగతా ముగ్గురు కుమారులు గాంధీతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లిపోయారు. ముగ్గురు మగపిల్లలు గాంధీ వెంటే ఉన్నారు. కానీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చేటప్పుడు రామ్ దాస్ , దేవదాస్ తిరిగి వచ్చారు. మణిలాల్ గాంధీ అక్కడే ఉండి వ్యాపారంలో స్థిరపడ్డారు. వారి పిల్లలు అక్కడే పెరిగి పెద్దవారయ్యారు. రామ్ దాస్ ... గాంధీతో పాటు ఉన్నారు. దేవదాస్ గాంధీ చెన్నై వెళ్లిపోయారు. దీంతో ఒక్కొక్కరూ ఒక్కోచోట స్థిరపడిపోయారు. ప్రస్తుతం గాంధీజీ కుటుంబంలోని నాలుగో తరం వచ్చింది. వీళ్లు దేశ విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. వేర్వేరు ప్రాంతాలు, మతాల వారిని వివాహాలు చేసుకుని.. ప్రపంచ మంతా ఒక్కటే అనే భావనతో ఉన్నారు. ఇలా భారతీయులతో పాటూ విదేశీయులు, హిందూ, ముస్లింలను కొందరు వివాహం చేసుకున్నారు. అందుకే అంతర్జాతీయ సమైక్యత గాంధీ కుటుంబంలో కన్పిస్తోంది.
* కుటుంబసభ్యులు మహాత్ముని ఆదర్శాలను నేటికీ ఆచరిస్తున్నారా?
లేదండి. ఈ రోజుల్లో మహాత్ముని ఆదర్శాలను పూర్తిగా ఆచరించడం అసాధ్యమే. కొన్ని సందర్భాలలో కొందరు ఆచరిస్తుంటారు. ఎక్కువ శాతం ఆచరించలేని వాళ్లే గాంధీ కుటుంబంలోనూ ఉన్నారు. కానీ ప్రతిఒక్కరి హృదయంలో గాంధీజీపై ప్రేమ, గౌరవం, ప్రత్యేకమైన స్థానం ఉన్నాయి. మా కుటుంబంలోని ప్రతిఒక్కరూ వారి రంగంలో ఉన్నతంగా ఉంటూ.. వీలైనంత మందికి సాయం చేస్తున్నారు.
* మీ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఎలా ఉన్నాయి?
అన్ని సాధారణ కుటుంబాల్లో అనుబంధాలు ఎలా ఉంటాయో, మాకూ అలాగే ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు, గౌరవ మర్యాద, అభిప్రాయ బేధాలు, కొన్ని విభేదాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మావాళ్లంతా స్థిరపడిపోవడంతో వారితో సంబంధ బాంధవ్యాలను కొనసాగించడానికి నాలాంటి వాళ్లం ప్రయత్నిస్తుంటాం. కుటుంబ సంబంధాలను నిలబెట్టడంలో ఈ మధ్య కొంతవరకూ సఫలమయ్యాను. నా దగ్గర కుటుంబంలోని ప్రతి సభ్యుడి ఫోన్ నంబర్లు, చిరునామాలు ఉన్నాయి. నిరంతరం వారితో ఫోన్లలో మాట్లాడుతుంటాను.
* మీ పిల్లలకు బాపూజీ గొప్పతనం గురించి చెబుతుంటారా?
మా ఇంట్లో పిల్లలకు గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడుకునే మాటల్లో మహాత్ముని పేరు, లక్షణాలు, ప్రత్యేకతలు గురించి ప్రస్తావన వస్తుంటుంది. ఆయన భారతదేశానికి చేసిన సేవల గురించి పిల్లలకు తెలుస్తూనే ఉంటుంది. పాఠశాలలో కంటే ఇంటిలోనే ఎక్కువగా ప్రస్తావన వస్తుంది. ఆయన సిద్ధాంతాలు, ఆదర్శాలు, కథలు, అనుభవాలు బాల్యం నుంచే వారందరికీ కొట్టిన పిండి. వారు తెలుసుకోవాలనుకున్నా.. లేకపోయినా.. గాంధీజీ గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. దేశానికే జాతిపిత అయిన మహాత్ముడు తమ కుటుంబానికి చెందినవారేనని తెలిస్తే ఎవరికి గర్వంగా ఉండదు చెప్పండి.
* బాపూలా మీలో ఎవరైనా న్యాయవాద వృత్తిలో ఉన్నారా?
మీరు అడిగారు కనుక చెబుతున్నా. న్యాయవాద వృత్తికి సంబంధించి మా కుటుంబంలోనే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. నా పెద్ద కుమారుడు కరణ్ గోకని గాంధీ లండన్ లో న్యాయవాద విద్యను అభ్యసించే, అక్కడే ఐదేళ్లు ప్రాక్టీస్ చేశారు. గాంధీజీ తర్వాత మా కుటుంబంలో ఉన్న ఏకైక న్యాయవాది కరణే. కానీ.. కరణ్ ఆ వృత్తిని మధ్యలోనే వదిలేసి ప్రస్తుతం వేరే రంగంలోనికి వెళ్లిపోయాడు. న్యాయవాద వృత్తితో తాను ఎవరి జీవితంలోనూ ఆనందం నింపలేకపోతున్నాననే బాధతో కరణ్ వదిలేశాడు. లండన్ లో భార్యతో కలిసి భారతీయ రెస్టారెంట్ ను నడుపుతున్నాడు.
* మీరు వైద్య వృత్తిలో స్థిరపడి.. దేశవ్యాప్తంగా గాంధీజీ జ్ఞాపకాలున్న ప్రతి ప్రాంతానికీ వెళ్లి వస్తున్నట్టున్నారు!
అవునండి. నేను ముంబయిలో మధుమేహ నిపుణుడిగా స్థిరపడ్డాను. నా భార్య, ఇద్దరు పిల్లలతో ముంబయిలో ఉంటున్నాను. మా అమ్మ, సోదరుడు ఉన్నారు. నా సోదరుడు కెనడాలో అతని కుటుంబంతో స్థిరపడ్డాడు. నా రెండో కుమారుడూ వైద్య వృత్తిలోనే ఆప్తమాలజీ సర్జన్ , గ్లకోమా స్పెషలిస్ట్ గా స్థిరపడ్డారు. గాంధీజీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనమంటూ ఎందరో అడుగుతుంటారు.
* గాంధీజీ కుటుంబ సభ్యులెంత మంది? అందరూ కలుస్తుంటారా?
150 మందికి పైగా సభ్యులు ఉన్నారు. అందరూ ఒకేసారి కలవడం చాలా కష్టం. కొంతమందినైనా ఒకచోటికి అప్పుడప్పుడూ చేర్చే ప్రయత్నం చేస్తుంటాను. దేశవిదేశాల్లో ఎన్నో వృత్తుల్లో స్థిరపడ్డారు. వారి జీవితాల్లో బిజీగా ఉన్నారు. అందరికీ ఒకేసారి ఖాళీ సమయం దొరకదు. అందరినీ కలపడానికి రెండు, మూడు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. వేడుకల సమయంలో ఓ పాతిక కుటుంబాల వరకూ కలుస్తుంటాం.
* గాంధేయవాదం నేటి సమాజానికి ఎంత అవసరం?
గాంధేయవాదం నేటి సమాజానికి చాలా అవసరం. కానీ.. ఆచరణలో చూపడం చాలా కష్టం. అది ఎప్పటికైనా ఆచరించి తీరాల్సిందే. గాంధీ తత్వం మనచుట్టూ ఉండే కొండల మాదిరిగా చాలా పాతదే అయినా.. దృఢమైనది. గాంధీజీ నమ్మిన, ఆచరించిన సత్యం.. ప్రాచీన కాలం నుంచి వచ్చినదే. దానినే ఆయన కృతనిశ్చయంతో ఆచరించి.. విజయం సాధించారు. ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులోనైనా గాంధేయవాదం అనేది కచ్చితంగా వచ్చి తీరుతుందనేది నా నమ్మకం. సమాజంలోని సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకు చేయగలిగితే అంత చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అదే గాంధీ సిద్ధాంతం.
* ప్రస్తుత నాయకుల్లో మీకు ఇష్టమైన వారెవరు?
ప్రస్తుత రాజకీయాల్లో నరేంద్ర మోదీకే నా మద్దతు ఇస్తాను. ఆయన దృఢమైన వ్యక్తి. ఆయన నిర్ణయాలు తీసుకునే విధానం బాగుంటుంది, మాట్లాడే విధానం నచ్చుతుంది. ఆయనలో ధైర్య, సాహసాలు ఉన్నాయి. దేశానికి ఇప్పుడు ఏదైనా కావాలంటే అది మంచి నాయకత్వమే. ఇందిరాగాంధీలో ఆ లక్షణాలు ఉండేవి. గాంధీజీ హయాంలో ఉన్న కాంగ్రెస్ కు, ఇప్పుడున్న కాంగ్రెస్ పూర్తి భిన్నమైంది. కాంగ్రెస్ అనేక భాగాలు, అంతర్భాగాలుగా అయిపోయి, స్వరూపం పూర్తిగా మార్చేసుకుంది.
* మీ దగ్గరున్న గాంధీజీ గుర్తులేంటి?
గాంధీ జ్ఞాపకాలంటే అవి మా కుటుంబానికి చెందినవని నేను భావించను. అవి జాతి సొత్తు. ఆయనకు సంబంధించిన కొన్ని లేఖలు మాత్రం మా దగ్గర ఉన్నాయి. తన సొంత దస్తూరీతో మా అమ్మకు, మామయ్యకు రాసిన ఉత్తరాలు తప్ప ఇంకేం లేవు. ఆయన జీవితంలో వాడిని వస్తువులే చాలా తక్కువ. అవన్నీ ఇప్పుడు మ్యూజియంలో ఉన్నాయి. బ్యాగు, చెప్పులు, చేతికర్ర, కళ్లజోడు, చరఖా వంటివన్నీ మణిభవన్ లో ఉన్నాయి. దేశంలో ఆయన జ్ఞాపకాలు, గుర్తులు చూస్తే గర్వంగా ఉంటుంది. వాటిని చూసి ఉబ్బితబ్బిబ్బవుతూ అవుతుంటాను. గాంధీ బోధనలు, ఆదర్శాలు, లక్ష్యాలు నేను నా జీవితంలో అనుసరించేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఉండి ఉంటే.. మనల్ని చూసి సంతోషించాలనేదే నా అభిమతం.
* గాంధీజీ కలలుగన్న భారతదేశం సాకారమైందా?
గాంధీ స్వాతంత్య్రం కల నెరవేరింది, కానీ స్వరాజ్య కల నెరవేరలేదు. మనదేశంలో విభిన్న సంస్కృతులు, మతాలు ఉండడమే అతిపెద్ద సమస్య. మనమంతా ఒక్కటే అని ఏ సంస్కృతి చెప్పదు. అదే ఇంగ్లాండ్ వెళితే అక్కడ అందరూ ఆంగ్లంలోనే మాట్లాడుతారు. ప్రతిఒక్కరూ తమ దేశ ప్రగతి గురించి తప్ప ఇంకేం ఆలోచించరు. ఒక దేశం.. ఒక భాష.. ఒక తిండి.. ఇదే స్వరాజ్యమని నా భావన. మన దేశంలో విభిన్న మతాలు, అన్నింటికీ ప్రాధాన్యతలు, వేర్వేరు భాషలు ఉన్నాయి. అందరూ ఒక్కటై.. ఆలోచించినప్పుడే స్వరాజ్యం సిద్ధిస్తుంది.
* స్వరాజ్య కల సాకారానికి మీరేం చేస్తున్నారు?
స్వరాజ్యం సాకారం కావాలంటే మతం కన్నా మానవత్వం గొప్పదని చాటి చెప్పాలి. మా కుటుంబంలో కొందరం అదే చేస్తున్నాం. ఏ దరఖాస్తులోనైనా మతాన్ని వదిలేసి మానవత్వం అని రాయాలని ఐదువేల మందితో ఇప్పటివరకూ నేను వ్యక్తిగతంగా ప్రతిజ్ఞ చేయించాను. నేను ఏ మతం వాడినైనా కావచ్చు. కానీ అది నా వ్యక్తిగతం. నేను ఇంట్లో ఆచరించుకుంటాను. బయట మాత్రం నా మతం ఏదని అడిగితే మానవత్వం అని చెబుతాను. మానవత్వం అనే రాస్తాను.
ఎవ రీ ఆనంద్ గోకని?
గాంధీ మహాత్ముని కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎనలేని గౌరవభావం ఉంది. ఆ కుటుంబంలో చాలామంది ఉన్నా.. దేశంలో ఎక్కువగా వినిపించే పేరు డాక్టర్ ఆనంద్ గోకని గాంధీదే. గాంధీజీ మూడో కుమారుడు రామ్ దాస్ గాంధీ మనువడే ఈ ఆనంద్ గోకని. రామ్ దాస్ గాంధీ చిన్న కుమార్తె కుమారుడు. గాంధీజీకి మునిమనువడు. దేశంలోని ఏ ప్రాంతంలో జాతిపితకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినా.. ఆనంద్ గోకని వెళ్లి వస్తుంటారు.
వారసులుగా, కుటుంబ సభ్యులుగా సమాజంలో నేటికీ ఎంతో గౌరవం లభిస్తోంది. కానీ.. మా కుటుంబం ఎక్కడెక్కడో స్థిరపడిపోవడంతో.. చాలావరకూ గాంధీజీ వారసులనే విషయం ఎవరికీ తెలియదు. ముంబయిలో నన్ను ఎవరూ గుర్తు పట్టరు. వైద్యునిగానే గుర్తిస్తారు. కొందరు గుర్తించినా.. చేయి ఊపి వెళ్లిపోతారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు గాంధీజీ వారసుడనగానే ఎంతో అభిమానం, ప్రేమ చూపుతారు.
విజయవాడలో ఇటీవల గాంధీ కొండకు వెళ్లాను. అక్కడికి పిల్లలు, పెద్దలు చాలామంది వచ్చారు. వారు చూపించిన ఆదరణ, గౌరవం చూస్తుంటే, గాంధీజీ అంటే తెలుగువాళ్లకు ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో కళ్లారా చూశాను. నేను గాంధీ ప్రతీకను, ఆయన వల్లే నాకు ఈ గౌరవం వచ్చిందని నేను భావిస్తాను. ఈ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు.
Comments
Post a Comment