ప్రజల మధ్య ప్రజల మనిషి
ప్రజల మధ్య ప్రజల మనిషి
వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రాజ్యసభ మూడుసార్లు మాత్రమే సమావేశమైనప్పటికీ 27 కీలక బిల్లులు ఆమోదం పొందేలా చేశారు. సభలో ఎవరైనా ఏ నివేదిక అయినా, ప్రకటన అయినా ప్రవేశపెట్టాలంటే ‘యాచిస్తున్నాను.. (బెగ్)’ అన్న పదం వాడాల్సి వచ్చేది. కాని ఆయన బ్రిటిష్ రాచరిక కాలం నాటి ఆ పదం తొలగించి మామూలుగా ‘ప్రవేశపెడుతున్నాను..’ అనేందుకు వీలు కల్పించారు. వెంకయ్యలాంటి వ్యక్తిని ఏ రాజ్యాంగ బంధనాలూ బంధించలేవు. ఆయన ఇప్పటికే ఈ బంధనాల్లో చాలా వాటిని తెంచుకున్నారు.
‘ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్‌గా రాజ్యసభలో అడుగుపెట్టినప్పటినుంచీ ఆయనను గమనిస్తున్నాను. ఒక రాజ్యాంగ హోదా ఏర్పర్చిన బంధనాల పరిధిలో తనను తాను ఇముడ్చుకునేందుకు నిగ్రహంతో, సంయమనంతో ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత ప్రశంసనీయం. ఆయన అత్యంత క్రమశిక్షణ గల నాయకుడే కాదు, అతి వేగంతో, సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకొనగల ధీశాలి. ఉపరాష్ట్రపతి పదవికి ఆయన వన్నె తేవడమే కాదు, ఆయన ఆ పదవికి కొత్త అర్థాన్ని, కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు.’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఏడాది అయిన సందర్భంగా రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరిస్తూ అన్నారు.
నిజానికి ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడును ఎంచుకున్నప్పుడు ఆ నిర్ణయం ఆయనకే కాదు, ఆయన అభిమానులకూ, శ్రేయోభిలాషులకూ ఎవరికీ నచ్చలేదు. నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ ఏ బాధ్యత అప్పజెప్పినా వెంటనే నెరవేర్చి, తనదైన ముద్ర తో పనిచేయగల వెంకయ్యనాయుడుకు కేబినెట్ లో మరింత కీలకమైన బాధ్యతలు అప్పజెబితే వారు సంతోషించేవారేగాని, ఆయనను రాజ్యాంగ బంధనాల్లో పనిచేసే ఉత్సవ విగ్రహంలా చూడాలని ఎవరూ అనుకోలేదు. వెంకయ్య ఈ పదవి అయిష్టంగానే, మోదీ, అమిత్ షాలు బలవంతం చేసిన తర్వాతే ఒప్పుకున్నారని అప్పటి పరిణామాలను సమీపం నుంచి గమనించిన నాకు తెలుసు. వాజపేయి హయాంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా గానీ, పట్టణాభివృద్ధి మంత్రిగా గానీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా గానీ, సమాచార ప్రసార శాఖ మంత్రిగా గానీ ఆయన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించలేదని ఎవరైనా అనగలరా? నిజానికి గ్రామీణాభివృద్ది మంత్రిగా వెంకయ్య అద్భుతంగా పనిచేశారని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఆయన సృష్టేనని స్వయంగా మోదీ సైతం పలు సందర్భాల్లోచెప్పారు. పట్టణాభివృద్ది మంత్రిగా రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం లాంటి కీలక చట్టాల్ని ప్రవేశపెట్టి, స్మార్ట్ సిటీలు, స్వచ్ఛభారత్ వంటి పథకాలకు ఒక ఊపునిచ్చారు. సమాచార ప్రసార శాఖమంత్రిగా ఆయన లేకపోతే పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాలను కూడా భుజాన వేసుకుని సమర్థవంతంగా ప్రతిపక్షాల దాడిని తిప్పిగొట్టేవారు కాదు. ఇవాళ వెంకయ్యలాగా మోదీని భుజస్కంధాలపై మోసి సుడిగాలిలా తిరిగి, ప్రతిపక్షాలు తమ వ్యూహాన్ని రూపొందించేలోపే వారి వాదనల్ని తుత్తునియలు చేయగలిగిన నాయకుడు కేబినెట్ లో ఎవరూ కనపడడకపోవడమే వెంకయ్య ప్రతిభను మనకు అవగతం చేస్తుంది. ఇవాళ పార్లమెంట్ కార్యకలాపాలను బిజెపి తరఫున నిర్వహిస్తున్న వారిని చూస్తుంటే పార్లమెంటరీ వ్వవహారాల మంత్రిగా వెంకయ్యే సమర్థవంతంగా పనిచేశారని అర్థమవుతుంది.
సమర్థులు ఎటువంటి అవకాశాలనైనా మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటారని వెంకయ్య విషయంలో అడుగడుగునా నిరూపితమవుతుంది. విద్యార్థికాలంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించి, యువనేతగానే జాతీయ పార్టీ దృష్టిలోపడ్డారు. శాసన సభ్యుడుగా ఉండగానే ప్రజాస్వామ్య ఉద్యమాలు నిర్వహించాల్సి వచ్చింది. ఆయన శాసన సభలో నిలబడి మాట్లాడడం ప్రారంభించారంటే చాలు అదొక ఉధృత ప్రవాహంలా అనిపించేది. వెంకయ్యను తట్టుకోవడం అధికార పక్ష నేతలూ, స్పీకర్‌కూ సాధ్యమయ్యేది కాదు. అదే అనర్గళ ప్రసంగ చాతుర్యం వల్లనే ఆయన ఒక జాతీయ కార్యవర్గ సమావేశంలో వాజపేయి, ఆడ్వాణీల దృష్టిలో పడి ఢిల్లీ స్థాయికి ఎదిగారు. అధికార ప్రతినిధిగా ఆయన వాక్చాతుర్యం మొత్తం మీడియాను పార్టీకి అనుకూలంగా మారేలా చేసింది. పార్లమెంట్ లో ఆయన లేచి నిలబడ్డారంటే చాలు మాటల జడి వడివడిగా అలజడిగా మారాల్సిందే. ఉత్తరాదిలో కూడా హిందీలో ఆయన ఒక గొప్ప వక్తగా పేరొందారు. అన్నిటికన్నా మించి ఏ కార్యభారాన్నైనా ఆయన నిర్వహించే తీరు ప్రతి ఒక్కరినీ అచ్చెరువు పరుస్తుంది.
ఆశ్చర్యకరమైనదేమంటే ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయన గతంలో ఆ పదవులు నిర్వహించిన వారి మాదిరి విశ్రమిస్తారని, అడపాదడపా నాలుగు ఉపన్యాసాలు చేసి, రాజ్యసభలో కేవలం ప్రశ్నోత్తరాల సమయం మాత్రమే నిర్వహించి పదవీ విరమణ చేసిన వారిలా కృష్ణా, రామా అంటూ కాలం గడుపుతారని అనుకున్న వారు ఇవాళ ఆశ్చర్య చకితులు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. తనకు ముందు ఉపరాష్ట్రపతిగా ఉన్న హమీద్ అన్సారీ పదేళ్ల పాటు చేసిన పనులను ఆయన ఒక్క ఏడాదిలో చేశారు. హమీద్ అన్సారీ పదేళ్లలో 26 రాష్ట్రాలు పర్యటించగా, వెంకయ్య ఈ ఒక్క ఏడాదిలోనే 28 రాష్ట్రాలు పర్యటించారు. వాతావరణం సరిగా లేక ఆయన సిక్కిం వెళ్లలేకపోయారే కాని హెలికాప్టర్ వెళ్లగలిగి ఉంటే ఆయన మొత్తం 29 రాష్ట్రాలనూ సందర్శించగలిగేవారే.
ఏ కీలకమైన పదవి లభించినా నేతలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. అప్పుడే నాయకులు తమకు దూరం కాదని ప్రజలు భావిస్తారు. 13వ ఉప రాష్ట్రపతిగా వెంకయ్య అదే చేశారు. ఒక్క ఏడాదిలో 56 యూనివర్సిటీలు సందర్శించి, 29 స్నాతకోత్సవాల్లో పాల్గొన్నారు. 15 శాస్త్ర, సాంకేతిక పరిశోధనా సంస్థల్ని సందర్శించి శాస్త్త్రవేత్తలు, పరిశోధకులతో మాట్లాడారు. గత 365 రోజుల్లో ఆయన 313 ప్రధాన సదస్సుల్లో, సమావేశాల్లో పాల్గొన్నారు. గత ఏడాదిలో ప్రతి రోజూ ఆయన సగటున 450 మంది దేశప్రజలను కలుసుకున్నారని ఉపరాష్ట్రపతి భవన్ అధికారులు చెబుతుంటే ఇంతకు మించిన ప్రజల మనిషి ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే రాజ్యసభ చైర్మన్ గా ఆయన నిర్వహించిన బాధ్యతలు మరో ఎత్తు. శరద్ యాదవ్ లాంటి నేతల అనర్హతకు సంబంధించి కేసులు వస్తే కూడా ఆయన మూడునెలల్లో తేల్చి పారేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి పై అభిశంస తీర్మానానికి నోటీసు వస్తే ఆ పదవి ప్రతిష్ఠ కాపాడేందుకు అతి వేగంగా దానిపై నిర్ణయం తీసుకున్నారు. సభ నిబంధనల్ని సమీక్షించేందుకు ఇద్దరు సభ్యుల కమిటీని వేశారు. మంత్రులు మౌఖికంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలన్నిటికీ ఒకే రోజు సమాధానం ఇచ్చేలా చేశారు. జీరో అవర్ లో రికార్డు స్థాయిలో ప్రజల సమస్యలపై 24 మంది సభ్యులు ప్రస్తావనలు చేసేందుకు అనుమతించారు. 22 భారతీయ భాషల్లో ఏ భాషలోనైనా సభ్యులు మాట్లాడేందుకు వీలుగా అనువాద సౌకర్యాలు కల్పించారు. ఆయన ఉపరాష్ట్రపతి అయినతర్వాత రాజ్యసభ మూడు సార్లు మాత్రమే సమావేశమైనప్పటికీ 27 కీలక బిల్లులు ఆమోదం పొందేలా చేశారు. సభలో ఎవరైనా ఏ నివేదిక అయినా, ప్రకటన అయినా ప్రవేశపెట్టాలంటే ‘యాచిస్తున్నాను.. (బెగ్)’ అన్న పదం వాడాల్సి వచ్చేది. కాని ఆయన బ్రిటిష్ రాచరిక కాలం నాటి ఆ పదం తొలగించి మామూలుగా ‘ప్రవేశపెడుతున్నాను..’ అనేందుకు వీలు కల్పించారు.
వెంకయ్యలాంటి వ్యక్తిని ఏ రాజ్యాంగ బంధనాలూ బంధించలేవు. ఆయన ఇప్పటికే ఈ బంధనాల్లో చాలా వాటిని తెంచుకున్నారు. ‘జనం మధ్యకు తాను పోవాలి, పోలేకపోతే, జనమే తన వద్దకు వచ్చేలా చేయాలి’ అన్నది ఆయన సిద్ధాంతం. ఇవాళ వెంకయ్య ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్టించిన తెలుగు నాయకుడే కాదు, దక్షిణాదిలో అత్యంత ప్రాధాన్యత గల నాయకుడే కాదు, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ తన వైపునుంచి తిప్పుకోకుండా చేయగలుగుతున్న ఏకైక అజాత శత్రువు అని చెప్పవచ్చు.
నిజానికి వెంకయ్యకు ఏ ఉన్నత పదవిలోనైనా పూర్తి కాలం పనిచేసే రాత లేదేమో.. గ్రామీణాభివృద్ది మంత్రిగా ఉన్న కాలంలో ఆయనను మధ్యలో పిలిపించి పార్టీ జాతీయ అధ్యక్షుడుగా నియమించారు. అది కూడా పూర్తి కాలం చేయనివ్వలేదు. మోదీ నాలుగేళ్లకాలంలో పలు మంత్రిత్వ శాఖల్ని నిర్వహించినప్పటికీ వాటిని పూర్తి కాలం నిర్వహించకుండానే ఉపరాష్ట్రపతి పదవి లో నియమించారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పూర్తి కాలం నిర్వహించి రాష్ట్రపతి భవన్ లో అడుగుపెడతారా, లేక మరేమైనా కీలక రాజకీయ పరిణామాలు జరుగుతాయా.. అన్నది రాబోయే కాలం నిర్ణయిస్తుంది
Comments
Post a Comment