గౌరీలంకేష్‌ను హత్య చేసిందెవరో తెలిసింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఓ అరుదైన టెక్నాలజీతో నిందితుడిని తేల్చారు.
గౌరీలంకేష్‌ను హత్య చేసిందెవరో తెలిసింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఓ అరుదైన టెక్నాలజీతో నిందితుడిని తేల్చారు. పరశురాం వాగ్మూరే. గౌరీ లంకేష్‌పై తుపాకీ ఎక్కుపెట్టి కాల్చాడని నిర్ధారించారు.
ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యకేసు మిస్టరీ వీడింది. దేశంలోనే తొలిసారిగా ఓ అరుదైన టెక్నాలజీ ఆధారంగా గౌరీలంకేష్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించారు. తమకు దొరికిన ఆధారాలతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షలతో ఈ మిస్టరీని ఛేదించారు.
బుధవారానికి గౌరీ లంకేష్‌పై కాల్పులు జరిగి సరిగ్గా యేడాది. ఈ సమయంలో అసలు లంకేష్‌పై కాల్పులు జరిపిందెవరో గుర్తించడం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విజయంగా డిపార్ట్‌మెంట్ పెద్దలు అభివర్ణిస్తున్నారు. అదీ అరుదైన పరీక్షల ద్వారా నిందితుడి ఆనవాళ్లు గుర్తించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
గౌరీ లంకేష్ హత్య జరిగిన రెండోరోజే కర్నాటక ప్రభుత్వం ఈ కేసులో సిట్‌ను ఏర్పాటు చేసింది. అప్పటినుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం ఈనేక కోణాల్లో దర్యాప్తు సాగించింది. పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. వారిలో కొందరిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే గత జూన్ 11వ తేదీన పరశురాం వాగ్మూరే అనే వ్యక్తి ఈ హత్యకేసులో సిట్‌కు చిక్కాడు. అతని దగ్గర దొరికిన కొన్ని ఆధారాలు దర్యాప్తు అధికారులనే విస్తుపోయేలా చేశాయి. వాటిని విశ్లేషించిన అధికారులు వాగ్మూరేను అరెస్ట్ చేసి పలుకోణాల్లో విచారించారు.
చివరకు గౌరీలంకేష్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరో సిట్ తేల్చింది. సేకరించిన భౌతిక ఆధారాలతో పాటు సైంటిఫిక్ ఆధారాలతో గౌరీ లంకేష్‌పై ఆమె ఇంటి ముందే తుపాకీతో కాల్చిన వ్యక్తిని గుర్తుపట్టారు. ఇటీవల పోలీసులకు చిక్కిన పరశురాం వాగ్మూరే ఈ దుర్మార్గానికి తెగించినట్లు తేల్చారు.
పీడియాట్రిక్ గెయిట్ ఎనాలసిస్ పరీక్ష ఆధారంగా పరశురాం వాగ్మూరే గుట్టును తేల్చారు సిట్ అధికారులు. ఈ పరీక్ష నిర్వహించి ఒక కేసులో నిందితుడిని గుర్తించడం మన దేశంలో ఇదే ప్రథమం. అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీ ఆధారంగా సిట్‌కు ఇది సాధ్యమైంది.
వాస్తవానికి ఆరు సెకన్ల సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రమే పోలీసులకు దొరికింది. దీని ఆధారంగా సీరియస్‌గా దర్యాప్తు చేసిన సిట్ బృందం వాగ్మూరే బండారాన్ని బట్టబయలు చేసింది. లండన్‌లో 18 సంవత్సరాల క్రితం ఇదే టెక్నాలజీని వినియోగించి ఓ కేసులో నిందితుడిని గుర్తించారని పోలీసు నిపుణులు చెబుతున్నారు. దాన్ని అధ్యయనం చేసిన సిట్ బృందం పరశురాం వాగ్మూరేను ఇదే టెక్నాలజీతో గుర్తించింది.
పీడియాట్రిక్ గెయిట్ ఎనాలసిస్‌లో కండరాలు, అస్థిపంజరం పనితీరును అంచనా వేస్తారు. అలాగే నరాల పనితీరునూ విశ్లేషిస్తారు. కండరాలు, అస్థిపంజర పరీక్షల్లో భాగంగా నడుస్తున్న సమయంలో సంకేతాల కోసం వెన్నెముకను పరీక్షిస్తారు. శరీర బరువు ప్రభావితమైనవైపు క్షితిజ సమాంతర స్థితిలో వెన్నెముక చివర భాగాన్ని కూడా విశ్లేషిస్తారు. కాలి పొడవును కొలుస్తారు. తొడలు, మోకాలు, మడమల కదలిక శ్రేణిని అంచనా వేస్తారు. అరికాలి వంపులో అసమానతలను కూడా అంచనా వేస్తారు. అలాగే మరికొన్ని పరీక్షల ఆధారంగా పీడియాట్రిక్ గెయిట్ ఎనాలసిస్ చేస్తారు.
ఇక న్యూరోలాజికల్ అసెస్‌మెంట్‌లో భాగంగా అసంకల్పిత ప్రతిచర్యలను అంచనా వేస్తారు. ఇంద్రియజ్ఞానము, శబ్ద లక్షణము, నిలకడలో తేడా, కండరాల బలాన్ని కూడా విశ్లేషిస్తారు. నడకలో వ్యత్యాసం, తేడాలను బట్టి నరాల సంబంధిత కారణాలను అంచనా వేస్తారు.
ప్రధానంగా పీడియాట్రిక్ గెయిట్ ఎనాలసిస్ పూర్తిగా వైద్య పరీక్షలకు సంబంధించినది. కానీ ఈ టెక్నాలజీని వినియోగించి ఓ కేసులో నిందితుడిని గుర్తించడం అరుదైన అంశమని నిపుణులు చెబుతున్నారు. అయితే మొదట వాగ్మూరేను అనుమానించిన సిట్ అధికారులు తమకు దొరికిన ఆరు సెకన్ల సీసీ ఫుటేజ్ ఆధారంగా పరీక్షించడతో పాటు గుజరాత్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వినూత్న పరీక్షలు నిర్వహించారు. దీంతో గౌరీ లంకేష్‌పై కాల్పులు జరిపింది వాగ్మూరే అని నిర్ధారణ అయ్యింది.
అయితే వాగ్మూరే దగ్గర దొరికిన పలు ఆధారాలు, అతన్ని విచారించిన తీరుతో మరిన్ని కొత్త విషయాలు కూడా బయటపడ్డాయి. కల్బుర్గీ, గౌరీలంకేష్ మాదిరిగానే మరికొందరిని కూడా హత్య చేసేందుకు జరుగుతున్న కుట్ర బయటపడింది. ముఖ్యంగా ఓ వర్గాన్ని కించపరిచేటట్లు మాట్లాడేవారని, ఆ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని టార్గెట్‌గా చేసుకున్నారు. వాగ్మూరే వద్ద దొరికిన డైరీలో కన్నడ నటుడు, సాహితీ వేత్త గిరీష్‌కర్నాడ్‌తో పాటు సాహితీ వేత్త లలితానాయక్, చెన్నమలస్వామి, ద్వారకానాథ్‌రావు పేర్లు హిట్‌లిస్ట్‌లో ఉండడం పోలీసులను షాక్‌కు గురిచేసింది.
గతేడాది సెప్టెంబర్ 5వ తేదీన గౌరీ లంకేష్‌ను ఆమె ఇంటి ముందే తుపాకీతో షూట్ చేశారు. ఏడో తేదీన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ యేడాది ఫిబ్రవరి దాకా ఆధారాల సేకరణలో నిమగ్నమైన సిట్ కార్యాచరణ మొదలుపెట్టింది. ఫిబ్రవరి 18వ తేదీన ఈ కేసులో మొట్టమొదటి అరెస్ట్ జరిగింది. బెంగళూరుకు చెందిన కెటి నవీన్ కుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది. మే 31వ తేదీన మరో నలుగురిని అరెస్ట్ చేశారు. జూన్ 11వ తేదీన పరశురాం వాగ్మూరేను అరెస్ట్ చేసింది. జూలై 18వ తేదీన బెంగళూరు శివారులో మోహన్ నాయక్‌ను అరెస్ట్ చేశారు. అదేనెల 22వ తేదీన హుబ్లిలో గణేష్ మిస్కిన్, అమిత్ బడ్డీ సిట్‌కు చిక్కారు.
గౌరీలంకేష్‌పై కాల్పులు జరిపిన తర్వాత వాగ్మూరే బెంగళూరునుంచి పారిపోయేందుకు బడ్డీ సహకరించినట్లు తేల్చారు. ఆ మరుసటిరోజే అంటే జూలై 23వ తేదీన ఆయుధాల వినియోగంలో నిందితులకు శిక్షణ ఇచ్చిన రాజేష్ బంగారేను అరెస్ట్ చేసింది సిట్. 25వ తేదీన హెచ్‌ఎల్ సురేష్ అరెస్ట్ అయ్యాడు. చివరగా ఈనెల 9వ తేదీన సురేష్ షాప్‌కు ఆయుధాన్ని తరలించిన భరత్ కురానేను గౌరీలంకేష్ హత్యకేసులో సిట్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు గౌరీ లంకేష్‌పై కాల్పులు జరిపింది పరశురాం వాగ్మూరే అని అరుదైన పరీక్షలు, ఆధారాలతో సహా తేల్చింది.
Comments
Post a Comment