హైదరాబాద్‌లో మరో కొత్త సాంకేతికత వ్యవస్థ

త్వరలో డ్రోన్‌ కెమెరాలు
ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ... నేరాల అదుపు
అక్రమ కట్టడాలకు ఇక చెక్‌

నగరంలో పెరుగుతున్న నేరాలు, ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టడానికి మరో కొత్త సాంకేతికత వ్యవస్థ వస్తోంది. పోలీస్‌ శాఖ మాత్రమే కాకుండా జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు సైతం ఈ టెక్నాలజీ ద్వారా లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకం, పరిశీలన దశలో ఉన్న డ్రోన్‌ కెమెరాలు త్వరలోనే నగరంలో చక్కర్లు కొట్టనున్నాయి. ప్రధానంగా శాంతిభద్రతలను కాపాడటం, పోకిరీలకు బుద్ధి చెప్పడంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు డ్రోన్‌ కెమెరాల సాయంతో ఆకాశం ద్వారా నిఘా పెట్టనున్నారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా ప్రమాదాల స్పాట్‌లను గుర్తించడం, జరిగిన ప్రమాదం లేదా నేరాన్ని పరిశీలించడం, అక్రమ నిర్మాణాలు... కబ్జాలు అన్నింటికీ అడ్డుకట్ట వేయడానికి డ్రోన్‌కెమెరాలు త్వరలోనే పని ప్రారంభించనున్నాయి.
 
ప్రయోగాత్మకంగా
గతంలో గ్రేహౌండ్స్‌ ద్వారా కూంబింగ్‌ ఆపరేషన్‌లో వినియోగించిన డ్రోన్‌ కెమెరాలతో పోలీసులు కొంతవరకు ఫలితాలు సాధించారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ బహిరంగ సభల్లో కూడా వాహనాల కూర్పు, అనుమానితులను గుర్తించడం, ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో డ్రోన్‌కెమెరాల ఆపరేషన్‌ విజయవంతమైంది. కేశవ్‌ మెమోరియల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థులు మహిళల భద్రతకు సంబందించి పరిచయం చేసిన డ్రోన్‌ ఆధారిత మార్గాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మొబైల్‌ యాప్‌లో బటన్‌ నొక్కితే సమీపంలో ఉన్న డ్రోన్‌లు, పోలీస్    స్టేషన్లకు సమాచారం అందేలా రూపొందించారు.
 
ఆస్తుల వివరాలు
అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల గుర్తింపునకు జీహెచ్‌ఎంసీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని భావిస్తోంది. శాటిలైట్‌ చిత్రాల ద్వారా అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉండగా... డ్రోన్‌ కెమెరాలతో అక్రమ నిర్మాణాల గుర్తింపునకు కసరత్తు ప్రారంభించింది. పోలీసు, ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ శాఖలు ఇప్పటికే నమూనా డ్రోన్‌ కెమెరాలను పరిశీలించాయి. ఎంత ఎత్తు నుంచి వీడియో/ఫొటోలు తీసే అవకాశం ఉంటుంది..? అన్న వివరాలపై అధికారులు ఆరా తీశారు. నగరంలో అక్రమ నిర్మాణాలు, ఫుట్‌పాత్‌, నాలాల ఆక్రమణల కూల్చివేత బాధ్యతలు విజిలెన్స్‌కు అప్పగిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా గుర్తించిన నిర్మాణాలకు అనుమతి ఉందా..? లేదా..? అన్నది చెక్‌ చేసి... అక్రమమైతే చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి కూల్చివేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!