కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీల షాక్‌!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది! ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు.. కాంగ్రెస్‌ శాసనమండలి పక్షాన్ని తెరాసలో విలీనం చేయాలని కోరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ప్రభాకర్‌, ఆకుల లలిత, సంతోష్‌ కుమార్‌ కలవనున్నారు. విలీనం చేయాలని కోరుతూ లేఖ అందజేయనున్నట్లు సమాచారం.
నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, టి.సంతోష్‌కుమార్‌ గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేర్వేరుగా కలిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తెరాస విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. దీంతో వీరు తెరాసలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది.  ఇప్పటికే ప్రభాకర్‌రావు, దామోదర్‌రెడ్డి తెరాసలో చేరారు. ఆ పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు.

ప్రతిపక్ష హోదా గల్లంతేనా?
మండలి పక్షాన్ని తెరాసలో విలీనం చేస్తే శాసనమండలిలో కాంగ్రెస్‌ సభ్యుల బలం కేవలం రెండుకు చేరే అవకాశం ఉంది. షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలుగా ఉంటారు. వారి పదవీ కాలం కూడా మార్చితో ముగియనుంది. మండలిలో కాంగ్రెస్‌కు ఏడుగురు సభ్యులు ఉండగా.. ఇటీవలే ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 40 మంది ఉన్న శాసనమండలిలో ప్రతిపక్ష హోదాకు కనీసం నలుగురు సభ్యులు అవసరం. కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు మాత్రమే మిగిలితే ప్రతిపక్ష హోదా పోయే అవకాశం ఉంది.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!