అది సంపన్నుల కూటమి

ఉనికి కోసమే జట్టుకట్టారు
వ్యక్తి ఆకాంక్షలు, అధికారం కోసమే
ప్రజల ఆశయాల కోసం కాదు
నాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా
ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టారు
ఇప్పుడా పార్టీ ‘హస్తం’ చేతుల్లో!
వీటికి సైద్ధాంతిక సారూప్యం లేదు
ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

విపక్షాల ప్రతిపాదిత మహాకూటమి అపవిత్ర కూటమి అని ప్రధాని మోదీ విమర్శించారు. రాజకీయ ఉనికి కోసం కొన్ని సంపన్న రాజకీయ కుటుంబాలు జట్టుకట్టాయని ధ్వజమెత్తారు. ఈ పార్టీలకు సైద్ధాంతిక సారూప్యత లేదని.. వ్యక్తిగతంగా ఉనికి నిలబెట్టుకోవడానికి చేతులు కలుపుతున్నాయని దుయ్యబట్టారు. ఆదివారం తమిళనాడులోని చెన్నై సెంట్రల్‌, చెన్నై నార్త్‌, మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘ఆనాడు సొంత పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (టి.అంజయ్య)ని కాంగ్రెస్‌ అవమానించింది. ఫలితంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ ఎన్టీఆర్‌.. టీడీపీని స్థాపించారు. అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలపాలనుకుంటోంది. ఆ రాష్ట్ర ప్రజలు దీన్నెలా అంగీకరిస్తారు’ అని ప్రశ్నించారు.
 
మహాకూటమిలోని కొన్ని పార్టీలు సామాజికవేత్త రాంమనోహర్‌ లోహియా వారసులమని చెప్పుకొంటున్నాయి. కానీ ఆయన కాంగ్రెస్ను, దాని సిద్ధాంతాలను వ్యతిరేకించేవారన్నారు. మహాకూటమి సైద్ధాంతిక నిబద్ధత కలిగింది కాదని మోదీ విమర్శించారు. అధికారం కోసమే తప్ప ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఫ్రంట్‌ కాదన్నారు. వ్యక్తిగత ఆకాంక్షల కోసమే తప్ప.. ప్రజల ఆశయాల కోసం కాదని తూర్పారబట్టారు. కాంగ్రెస్‌ ఏ పార్టీనీ వదల్లేదని.. 1980లో తమిళనాట ఎంజీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసిందన్నారు. కాంగ్రెస్‌, డీఎంకేలకు పరస్పరం పొసగదంటూ.. జైన్‌ కమిషన్‌ నివేదికపై వివాదాన్ని గుర్తుచేశారు. ఇప్పుడీ రెండు పార్టీలూ ఒకే కూటమిలో ఉన్నాయని, ఇది అవకాశవాదం కాక ఇంకేమిటని మోదీ నిలదీశారు.
 
వామపక్షాలు కాంగ్రెస్ ను సామ్రాజ్యవాద పార్టీ అని, వ్యవసాయ సంక్షోభానికి అదే కారణమంటూ ఎన్నో తీర్మానాలు చేశాయని గుర్తుచేశారు. ఇప్పుడవి పొగడ్తలు కురిపించుకుంటున్నాయని ఎద్దేవాచేశారు. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ కూడా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏర్పడిందేనని గుర్తుచేశారు. ‘వాస్తవమేమిటంటే ఈ కూటమి పార్టీలు సంపన్న కుటుంబాల క్లబ్‌కు చెందినవి. పొందికలేని కూటమిని ప్రజలు ఎన్నటికీ అంగీకరించరు. దేశం ప్రజాస్వామ్యాన్ని కోరుతోంది. ఈ కూటమి వంశపారంపర్య పాలన కావాలంటోంది. అందరూ అభివృద్ధి చెందాలని దేశం ఆకాంక్షిస్తోంది. ఈ పార్టీలు తమ కుటుంబాలు మాత్రమే వృద్ధిచెందాలనుకుంటున్నాయి’ అని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
 
2018 గొప్ప సంవత్సరం
దేశానికి 2018 గొప్ప సంవత్సరమని.. ఈ ఏడాదిలో సాధించిన భారత విజయాలను ప్రధాని ప్రస్తావించారు. సులభతర వాణిజ్యం ర్యాంకుల్లో ఇండియా మెరుగుపడిందని.. సమగ్ర ‘మోదీకేర్‌’ ఆరోగ్య పథకాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఆదాయ పన్ను శ్లాబులను తీసేశామని.. స్టెంట్లు, మోకాలి చిప్పల ధరలు తగ్గించామని, జన ఓషధి కేంద్రాల కింద సబ్సిడీపై ఔషధాలు అందజేస్తున్నామని గుర్తుచేశారు. పెన్షనర్ల లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పణ ప్రక్రియను సులభతరం చేశామని.. ఆధార్‌ ఆధారిత ఆన్‌లైన్‌ వ్యవస్థ తీసుకొచ్చామని తెలిపారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!