ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ



 నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సాయంత్రం దిల్లీలోని ప్రధాని నివాసం 7 లోక కళ్యాణ్‌ మార్గ్‌ వద్దకు చేరుకున్న కేసీఆర్‌ మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర విభజన హామీలను మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత తొలిసారిగా ఆయన దిల్లీ వచ్చారు. సమాఖ్య కూటమి ఏర్పాటులో భాగంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్‌ సోమవారం రాత్రి దిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. మంగళవారం క్రిస్మస్‌ సెలవు రోజు కావడంతో ఆయన ఎవరినీ కలవలేదు. ప్రధానమంత్రితో భేటీలో ప్రస్తావించే అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించి కసరత్తు చేసినట్టు సమాచారం. 
విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ట్రిపుల్‌ ఐటీ.. తదితర అంశాలపై ప్రధానికి మరోసారి కేసీఆర్‌ లేఖలు అందజేయనున్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో జాప్యంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రితో భేటీలో ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని తెరాస డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఆ విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు రూ. 30 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ గతంలో సూచించడంతో దీనిపై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థికమంత్రికి విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఈ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ భేటీలో అన్ని అంశాలను ప్రధానితో కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం కేసీఆర్‌ పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు నేపథ్యంలో పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతోనూ కేసీఆర్‌ సమావేశమవుతారని సమాచారం.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!