హత్య చేసి రండి... విద్యార్థులకు వీసీ ఉద్బోధ..

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో శనివారం రాళ్లు రువ్విన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృత్యువాత పడిన ఘటనపై ఓవైపు దుమారం రేగుతుండగా, మరోవైపు జాన్‌పూర్ యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరో వివాదానికి తెరలేపారు. ఆయన చేసిన ప్రసంగంతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రాజకీయ పార్టీల నేతలతో పాటు నెటిజెన్లు మండిపడుతున్నారు.
 
హింసకు పాల్పడిన వారిని హత్య చేసేందుకు కూడా వెనుదీయ వద్దంటూ వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్ రాజా రాం మాదవ్ విద్యార్థులకు పిలుపునివ్వడం ఈ వీడియోలో కనిపిస్తోంది. 'మీరు పూర్వాంచల్ యూనివర్శిటీ విద్యార్థులైతే ఏడుస్తూ ఎప్పుడూ నా దగ్గరకు రావద్దు. ఎవరైనా మీతో పోట్లాడితే అతన్ని చితక్కొట్టండి. చేయగలిగితే అతన్ని చంపేసి మరీ రండి. ఆ తర్వాత వ్యవహారం మనం చూసుకుందాం' అంటూ యాదవ్ ప్రసంగం సాగింది. ఘజీపూర్‌లోని గాంధీపురంలో ఉన్న సత్యదేవ్ కాలాజీలో జరిగిన కార్యక్రమంలో రాజా రాం మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. యాదవ్‌ను యూనివర్శిటీ వీసీగా గవర్నర్ రామ్ నాయక్ గత ఏడాది నియమించారు. అంతకుముందు అలీగఢ్ యూనివర్శిటీ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్‌గా ఆయన ఉన్నారు.
 
కాగా, యాదవ్ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి అబ్దుల్ అఫిజ్ గాంధీ మండిపడ్డారు. ఇవి కచ్చితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలేనని, వీసీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక వీసీగా కాకుండా క్రిమినల్ గ్యాంగ్ నాయకుడిగా ఆయన వ్యాఖ్యలున్నాయని, వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని అఫీజ్ గాంధీ డిమాండ్ చేశారు. మరోవైపు, యాదవ్ 'విషం జిమ్ముతున్నారని', 110 ఏళ్లు మీదకొచ్చి ఇదేం బుద్ధి అని, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అదే చెత్తబుట్టలోకి విసిరిపారేయండని నెటిజన్లు మండిపడుతున్నారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!