సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుక
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) భారాన్ని కేంద్ర ప్రభుత్వం బాగా తగ్గించింది. ఇకపై విలాస వస్తువులు మాత్రమే 28 శాతం పన్ను పరిథిలో ఉంటాయి. శనివారం జరిగిన 31వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ 28 శాతం జీఎస్‌టీ పరిథిలో 34 వస్తువులు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఇవన్నీ విలాస సంబంధిత వస్తువులన్నారు.
మానిటర్లు, టెలివిజన్ స్క్రీన్స్, టైర్లు, లిథియం-అయాన్ బ్యాటరీలతో కూడిన పవర్ బ్యాంకులపై పన్ను తగ్గుతుంది. వీటిని 28 శాతం నుంచి 18 శాతం పన్ను పరిథిలోకి తీసుకొచ్చినట్లు జైట్లీ తెలిపారు. దివ్యాంగుల ప్రయాణానికి ఉపయోగించే వాహనాలకు ఉపయోగించే విడి భాగాలపై పన్నును 5 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.
సినిమా టిక్కెట్ల ధరను బట్టి పన్ను తగ్గించారు. టికెట్ ధర రూ.100 వరకు ఉంటే 12 శాతం జీఎస్‌టీ విధిస్తారని, టికెట్ ధర రూ.100కుపైగా ఉంటే పన్ను 18 శాతం విధిస్తారని జైట్లీ తెలిపారు. ఈ పన్ను ఇప్పటి వరకు 28 శాతం ఉండేదన్నారు.
రియల్ ఎస్టేట్‌పై జీఎస్‌టీ గురించి వచ్చే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్ చెప్పారు.
మొత్తం మీద శనివారం జరిగిన జీఎస్‌టీ మండలి నిర్ణయాల ప్రకారం 33 వస్తువులపై పన్ను తగ్గింది. సామాన్యులు వినియోగించే వస్తువులపై 18 శాతం నుంచి 12 శాతం, 5 శాతం పన్నును మాత్రమే విధించాలని నిర్ణయించారు.
Comments
Post a Comment