కేసీఆర్ అమలు చేయబోతోన్న కొత్త ప్లాన్ ఇదేనా?
కాకలుతీరిన రాజకీయ యోధుల వ్యూహాలకు కూడా అందని ఎత్తుగడలు సీఎం కేసీఆర్‌వి అని అందరూ అంటుంటారు. మరి అలాంటి నేత తాజాగా ఎలాంటి వ్యూహాలు అమలుచేస్తున్నారు? జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్ తరవాతి అడుగు ఎటువైపు వేయబోతున్నారు? కరీంనగర్ కేంద్రంగా కేసీఆర్ అమలు చేయబోతోన్న కొత్త ప్లాన్ ఏంటి? పార్లమెంట్ ఎన్నికలు కేంద్రంగా టీఆర్ఎస్ అధినేత ఏం చేయబోతున్నారు? వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానన్న కేసీఆర్ అందుకు గ్రౌండ్‌వర్క్ సిద్ధం చేసుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా విజయం సాధించిన కేసీఆర్ ఇకపై కొత్త ప్రణాళికను అమలుచేయబోతున్నారు. వచ్చే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనుకుంటున్నారట. అందులో భాగంగానే సిరిసిల్ల ఎమ్మెల్యే, తన తనయుడు కేటీఆర్‌కు టీఆర్ఎస్ పగ్గాలు అప్పగించారట. సరే, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం మరొకటుంది. దాని గురించే ఇప్పుడు కరీంనగర్ వాసులు చర్చించుకుంటున్నారు.
కేసీఆర్‌కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఓ పెద్ద సెంటిమెంట్! ఏ పని చేపట్టినా ఇక్కడినుంచే మొదలుపెట్టడం ఆయనకు ముందునుంచీ అలవాటు. ఉద్యమ సమయంలో అయినా.. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అయినా ప్రతి పనికీ ఇక్కడే శ్రీకారం చుట్టారాయన. నాడు ఉద్యమం పతాకస్థాయికి చేరిన క్రమంలో.. మరింత వేడి పెంచేందుకు ఇక్కడే ఆమరణదీక్షకు దిగారు. తెలంగాణవ్యాప్తంగా వేడి రాజేసిన దీక్ష అది. ఆ తర్వాత జరిగిన పరిణామాలే తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాయన్నది నిజం. ఇలా ఏదైనా సరే కరీంనగర్ నుంచి మొదలుపెడితే వర్కవుట్ అవుతుందని కేసీఆర్ ప్రగాఢ నమ్మకం. గతంలో కరీంనగర్ ఎంపీగా పోటీచేసి ఘనవిజయం సాధించి.. అప్పటి వైఎస్ సర్కారుకు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా చాలా కార్యక్రమాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు.
అయితే కరీంనగర్ సెంటిమెంట్‌ను తన ఫ్యూచర్ ప్లాన్‌కు కూడా ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇక్కడినుంచే జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారట. అందులో భాగంగానే తొలి అడుగుగా తన తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించారట. క్రమక్రమంగా కేటీఆర్‌కే పాలనాపగ్గాలు కూడా అప్పగించి.. తదనంతరం జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు జరిగే సమయానికి ప్రభుత్వ బాధ్యతలు కేటీఆర్‌కి పూర్తిగా బదలాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే కేసీఆర్ బరిలోకి దిగుతారని తెరాస పెద్దల నుంచి సంకేతాలందుతున్నాయి. ప్రస్తుత కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌కు ఎమ్మెల్సీ ఇవ్వనున్నారని సమాచారం. వచ్చే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో వినోద్ కీలకం అవుతారట!
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా కేసీఆర్ ద్విముఖ వ్యూహం సిద్ధంచేశారట. తన తనయుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం, అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో తను కీలకపాత్ర పోషించడం ఒకే సమయంలో జరిగిపోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. గతంలో కేసీఆర్ చేసిన ప్రకటనలతో పోలిస్తే ప్రస్తుత పరిణామాలు ఆ దిశగానే ఉన్నాయని విజ్ఞులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ పదేపదే జాతీయ రాజకీయాల గురించి తన అభిప్రాయాలు వ్యక్తంచేశారు. జాతీయస్థాయిలో కాంగ్రెసేతర, బీజేపీయేతర శక్తులను ఏకంచేసి జాతీయస్థాయిలో ఒక ఫ్రంట్‌ను ఏర్పాటుచేస్తామని కేసీఆర్ చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్‌లతో కేసీఆర్ చర్చలు కూడా జరిపారు. థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు కాబోతోందని అప్పట్లో జోరుగా ప్రచారం కూడా జరిగింది.
కేసీఆర్ కొత్త వ్యూహాలతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందని జిల్లాలో చర్చ జరుగుతోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ సంచలన మార్పులు ఉంటామన్న టాక్ వినిపిస్తోంది. క్యాబినెట్‌లోకి ఎవరెవరిని తీసుకోవాలి? ఎవరికి ఏ శాఖ అప్పగించాలి? అనే విషయాలపై కేటీఆరే తుది నిర్ణయం తీసుకుంటారన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ తాజా వ్యూహం ఏ ఫలితం ఇస్తాయన్నది కొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు. ఏది ఏమైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరో సంచలనానికి వేదిక కాబోతోందన్న మాట మాత్రం నిజమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. చూద్దాం ఏం జరగనుందో!
Comments
Post a Comment