‘డబుల్’ ఇంటికి మార్గమేది..?
స్పష్టమైన మార్గదర్శకాలు కరువు
నిధుల విడుదలపై ప్రభావం
పీఎంఏవై ఫండ్స్ విడుదలలో జాప్యం
లక్ష ఇళ్లకు రూ.1,500 కోట్లు
మొదటి విడతగా రూ.600 కోట్లు విడుదల
రెండో దశ కేటాయింపులో తీవ్ర జాప్యం
దరఖాస్తుదారుల వివరాలు ఇవ్వని జీహెచ్‌ఎంసీ
రెవెన్యూ విభాగాల వద్ద లేని లెక్కలు
నిర్మాణంపైనే దృష్టి... లబ్ధిదారుల ఎంపిక పట్టని వైనం
రెండు పడకల ఇళ్లు.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టు. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా పక్కా గృహాల నిర్మాణానికి సర్కారు శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌లో దాదాపు లక్ష గృహాల నిర్మాణం ప్రారంభించింది. మరో నాలుగైదు నెలల్లో 50 శాతం ఇళ్ల పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక దిశగా అడుగు ముందుకు పడలేదు. కనీసం డిమాండ్ ఎంత ఉంది..? అన్న వివరాలూ అందుబాటులో లేవు. ఇది ఇప్పుడు కేంద్ర నిధుల రాక.. నిర్మాణ పనులపై ప్రభావం చూపుతోంది.
‘డబుల్’ ఇళ్లకు కేంద్రం నిధులొచ్చేనా..?
ఏఎంఏవై ఫండ్స్ విడుదలలో జాప్యం
లబ్ధిదారుల ఎంపిక పట్టని వైనం
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రాజెక్టును ప్రారంభించింది. గ్రేటర్‌లో దాదాపు లక్ష గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. పక్కా గృహాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. వచ్చేందుకు కేంద్ర గృహ నిర్మాణశాఖ సిద్ధంగా ఉన్నా.. దరఖాస్తుదారుల వివరాలను ప్రభుత్వ విభాగాలు సమర్పించక పోవడమే కారణంగా తెలుస్తోంది. ఎన్నికల ముందు ఈ విషయంపై అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన అనంతరమే నిర్ణయం తీసుకుందామని కేటీఆర్ చెప్పడం.. ఆలోపే ఎన్నికలు రావడంతో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు.
మధ్య దళారుల రంగప్రవేశం..
ప్రజల అయోమయాన్ని అదనుగా తీసుకొని మధ్య దళారులు ఇప్పటికే రంగ ప్రవేశం చేశారు. రూ.10 వేల నుంచి 30, 40 వేలు.. కొన్ని ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువ వసూలు చేస్తూ ఇళ్లు ఇప్పిస్తామని నిరుపేదలను మోసం చేస్తున్నారు. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి..? ఏ ప్రతిపాదికన ఇళ్లు ఇస్తారన్న దానిపై స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో సామాన్య ప్రజలు కొందరు కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవల్లో ఇప్పటికే రెండు, మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నారు. ‘దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్‌లో ఉంటుంది. మీ సేవలో అప్లయ్ చేయండి’ అని శనివారం జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ప్రకటన విడుదల చేశారు. తమ కార్యాలయానికి మ్యానువల్‌గా వస్తున్న దరఖాస్తులను నిలువరించే క్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారే.. తప్ప ఎవరు అర్హులు? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సం బంధించి ప్రభు త్వ స్థాయిలో నిర్ణయం జరగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
పీఎంఏవై నిబంధనలివి..
ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా నిరుపేదల కోసం పక్కా గృహాలు నిర్మిస్తుంటే కేంద్రం తనవంతు వాటాగా నిధులు కేటాయిస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద ఒక్కో యూనిట్(ఇల్లు)కు రూ.1.50 లక్షలు ఇస్తారు. ఈ లెక్కన గ్రేటర్‌లో నిర్మించే లక్ష ఇళ్లకు కేంద్రం నుంచి రూ.1500 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పటికే మొదటి విడతగా రూ.600 కోట్లు విడుదలయ్యాయని ఓ అధికారి తెలిపారు. పీఎంఏవై నిబంధనల ప్రకారం మొత్తం ఎన్ని ఇళ్లు నిర్మిస్తున్నారు..? ఏ దశలో ఉన్నాయన్న వివరాలతోపాటు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత డిమాండ్ ఉంది..? అనే వివరాలతో కూడిన నివేదిక పంపాల్సి ఉంది. దరఖాస్తుదారులకు సంబంధించి అధికారుల వద్దే స్పష్టమైన లెక్కలు లేకపోవడంతో సమాచారం పీఏంఏవై అధికారులకు అందజేయలేదు. దీంతో రెండో దశ నిధుల కేటాయింపులో జాప్యం జరుగుతోంది.
ఇది పనులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు పడకల ఇళ్లకు పూర్తిగా కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ నిధులు వెచ్చిస్తున్నారు. రూ.8500 కోట్ల ప్రాజెక్టులో ఇప్పటి వరకు రూ.2000 కోట్లు చెల్లించారు. మరో రూ.250 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇళ్ల నిర్మాణ పనులు వేగం పుంజుకోవడానికి దాదాపు నాలుగైదు నెలలు పట్టింది. బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడంతో వేగం మందగించింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కూడా ఆచితూచి నిధులు కేటాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి వివరాలు సమర్పించి.. రెండో విడత నిధులు పొంది ఉంటే ఇప్పుడీ ఇబ్బందులు ఉండేవి కాదని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ విభాగాలు దరఖాస్తుల లెక్కలు తెలిస్తే నిధుల మంజూరు జరిగి కొంత ఉపశమనం లభిస్తుందంటున్నారు.
మీ సేవలోనే దరఖాస్తు చేసుకోవాలి : కలెక్టర్
జిల్లాలో రెండు పడకల గదుల ఇళ్ల (డబుల్ బెడ్ రూం) కేటాయింపు కోసం దరఖాస్తుదారులు సంబంధిత మీ సేవా కేంద్రాలలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుతోపాటు నిర్ణీత రుసుము రూ.35 మాత్రమే చెల్లించి మీ సేవా కేంద్రాల్లో రసీదు పొందాలన్నారు. దరఖాస్తు నమోదు అనంతరం క్రమసంఖ్య జారీ చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకసారి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు నమోదు చేసినవారు మళ్లీ మండల తహసీల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని దరఖాస్తుదారులు గమనించాలని ఆయన సూచించారు.
Comments
Post a Comment