ఓడినా నేనే ఎమ్మెల్యేను.. అందరికీ నట్లు బిగిస్తాం: పిడమర్తి
ఓడినా నేనే ఎమ్మెల్యేను.. అందరికీ నట్లు బిగిస్తాం: పిడమర్తి
టీఆర్‌ఎస్ నేత పిడమర్తి రవి ఏం మాట్లాడిన వివాదమే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఓయూ విద్యార్థి జేఏసీ నేతగా అనేక సంచలన ప్రకటనలు చేశారు. అప్పట్లో సంక్రాంతి సెలవుకు వెళ్లిన ఆంధ్రా పెట్టుబడిదారులు ఇక తెలంగాణకు రావద్దని తేల్చిచెప్పారు. అప్పుడు రవి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అప్పటి నుంచి పిడమర్తి ఏం మాట్లాడినా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ అవుతోంది. అయితే ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లిలో ఓడినా తానే ఎమ్మెల్యేనంటూ హుకుం జారీ చేశారు. ఇక నుంచి ఏ పనులు కావని, అందరికీ నట్లు బిగిస్తానని హెచ్చరించారు. సత్తుపల్లిలో ఏ పని జరగాలన్న తన ద్వారానే అవుతాయని పిడమర్తి రవి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రవి టీఆర్‌ఎస్‌లో చేరారు. మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
అయితే ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఎదురవుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని భావించింది. మొత్తం 10 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి నిరాశ ఎదురైంది. కేవలం ఖమ్మం స్థానంలో మాత్రమే గెలిచి సరిపెట్టుకుంది. విద్యార్ధి నాయకుడిగా పేరు తెచ్చుకున్న పిడమర్తి రవిని సత్తుపల్లి నుంచి టీఆర్‌ఎస్ బరిలోకి దింపింది. అయితే మహాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య చేతిలో రవి ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత సత్తుపల్లి ఎస్సీ రిజర్వుడుగా మారింది. దీంతో పాలేరు నుంచి సత్తుపల్లి వచ్చి టీడీపీ అభ్యర్థిగా 2009లో పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్య అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు.
Comments
Post a Comment