ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏం చేశాడో చూడండి
వినూత్న ఒరవడికి ఆచారి శ్రీకారం
కల్వకుర్తిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఆచారి
ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతా భావంగా ఇంటింటి పయనం
ఓటమిని దిగమింగుకుంటూనే నేనున్నంటూ భరోసా
ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా చేతులు జోడించి ప్రతి ఓటరుకూ దండాలు
భరోసా పేరుతో ఆచారి యాత్రకు జన నీరాజనం
రంగారెడ్డి, ఆమనగల్లు : ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు మద్దతుగా విజయోత్సవ ర్యాలీలు, సన్మాన కార్యక్రమాలు చేపడుతుండడం సర్వసాధారణం. కల్వకుర్తి నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నంగా ఓడిపోయిన అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి ప్రజలను, ఓటర్లను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కల్వకుర్తి అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఆమనగల్లు పట్టణానికి చెందిన ఆచారి బరిలో నిలిచారు. ఈ నెల 11న వెలువడ్డ ఫలితాల్లో ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ బీజేపీ అభ్యర్థి ఆచారిపై 3,447 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆచారికి 59,445 ఓట్లు లభించాయి. గత ఎన్నికల్లో 78 స్వల్ప ఓట్లతో ఆచారి ఓటమి పాలయ్యారు. నాలుగు సార్లు ఓటమి చెందిన ఆచారి ఐదోసారి విజయం కోసం సర్వశక్తులొడ్డారు. తీరా విజయపుటంచులకు వచ్చి మళ్లీ అదృష్టం కలిసి రాక అపజయం పాలయ్యరు.
ఆచారి ఓటమితో బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు తీవ్రంగా కలత చెందారు. మనోవేదనకు లోనయ్యారు. దీంతో ఆచారి ఓటమిని దిగమింగుకుంటూనే తనకు ఓట్లేసి ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు, పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని కల్పించేందుకు భరోసా యాత్ర చేపట్టారు. శనివారం మక్తమాదారం, న్యామతాపూర్, రావిచేడ్ , కడ్తాలలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించి ఇంటింటికి తిరిగి తనకు ఓటేసినందుకు కృతజ్ఞతలని ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా రెండు చేతులు జోడించి అందరికీ దండం పెట్టిన తీరు చర్చకు తెరలేపింది. ఐదు సార్లు ఓడిపోయిన ఆయన ఓపికకు హాట్యాప్ అంటూ పలువురు చర్చించుకోవడం కన్పించింది. పాతతరం ఓటర్లు, ఆయనను అతిగా అభిమానించే యువకులు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ఓడిపోయిన వెంటనే కోలుకొని తనకు ఓట్లేసిన ప్రజల వద్దకు వచ్చిన ఆచారి తీరు ఔరా అనిపించింది.
ఓడినా... ప్రజాక్షేత్రం వీడను
కడ్తాల్ : అదృష్టం కలిసి రాక ఐదోసారి బీజేపీ తరపున కల్వకుర్తి అసెంబ్లీ కి పోటి చేసి అపజయంపాలైన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి తనకు ఓట్లేసి ఆదరించిన ఓటర్లకు, అభిమానం చూపిన ప్రజలకు కృతజ్ఞతాభావంగా కడ్తాల మండలం రావిచేడ్‌లో ఆచారి పార్టీ శ్రేణులతో కలిసి భరోసా యాత్రను ప్రారంభించారు. మక్తమాదారం, న్యామతాపూర్, కడ్తాలలో తొలిరోజు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ ఓడినంత మాత్రాన కుంగిపోయేదిలేదని, 60 వేల మంది ఓటర్లు తనను ఆదరించడం మరిచిపోలేనిదని అన్నారు. నూతనంగా ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేయాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలు మరిచిపోలేనివని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతానికి నిధులు, పథకాలు రాబట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు మోహన్‌రెడ్డి, వీరయ్య, రమేశ్, రవీందర్ రెడ్డి, ఆనంద్, యాదగిరి,సాయిలాల్, అశోక్ రెడ్డి, మహేశ్ చారి, శివ,మల్లేశ్, కుమార్, యాదయ్య, శ్రీను తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment