మంత్రి పదవి రేసులో గెలిచేది ఎవరు.. చినజీయర్ ఆశీస్సులు ఆయనకే?
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని జిల్లాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా మంత్రివర్గం ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యమకేంద్రమైన ఓరుగల్లుకు తగిన ప్రాధాన్యం కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేల్లో సీనియర్లు ఉన్నారు. ఇంతకూ ఈసారి మంత్రివర్గంలో ఎవరెవరికి బెర్తులు లభిస్తాయి? మంత్రి కాగల అర్హతలు ఉన్న నేతలెందరు? ఆసక్తికర కథనం మీకోసం!
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారంచేశారు. తనతో పాటు మరో మంత్రిగా మహమూద్ అలీని ప్రమాణం చేయించారు. ఇక మిగిలిన బెర్తుల్లో ఎవరిని నింపుతారన్నదే ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా జరుగుతున్న చర్చ! రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతే ప్రాధాన్యం కలిగి జిల్లా వరంగల్! తెలంగాణ రాష్ట్ర సమితికి పదిసీట్లు అందించిన ఈ జిల్లాలో ఎవరికి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందన్న ఆసక్తి అందరిలో నెలకొన్నది. 2014 ఎన్నికల్లో ఎనిమిది సీట్లు వచ్చినప్పుడే ఈ జిల్లాకి స్పీకర్, డిప్యూటీ సీఎం, ఒక మంత్రి పదవి లభించాయి. ఈసారి పదిసీట్లు వచ్చిన నేపథ్యంలో ఈ జిల్లాకి మరింత ప్రాధాన్యం ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం రాష్ట్ర అభివృద్ధి, సామాజికవర్గాల లెక్కలు, భౌగోళిక అంశాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్లు వినికిడి. ఈ క్రమంలో సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. తమ మనుసులో మాటను వివిధ మార్గాల ద్వారా టీఆర్‌ఎస్ అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కొత్త జట్టు కూర్పుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలోనే కసరత్తు చేస్తున్నారు. ఈ కూర్పు పూర్తయిన అనంతరం ఒకట్రెండు రోజుల్లో మిగిలిన మంత్రుల ప్రమాణస్వీకారం జరగొచ్చని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యాంగ నియమావళి ప్రకారం తెలంగాణలో సీఎం, మరో 17 మంది మంత్రులు ఉంటారు. ఇందులో ఉమ్మడి ఓరుగల్లు జిల్లాకు కనీసం మూడు క్యాబినెట్ హోదాలు కల్పించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. రెండు మంత్రి పదవులు, ఒకటి క్యాబినెట్ హోదా కలిగిన విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట.
వరంగల్ జిల్లాకు సంబంధించి పాలకుర్తి ఎమ్మెల్యే, సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, డోర్నకల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి రెడ్యానాయక్‌కు గులాబీ దళపతి మంత్రివర్గంలో బెర్తులు ఖరారుచేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సామాజికవర్గాల లెక్కలతోపాటు త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి ఆశీస్సులు బలంగా ఉండటంతో ఎర్రబెల్లికీ పీఠం వేయబోతున్నారట. టీఆర్‌ఎస్ బలహీనంగా ఉన్న మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గాన్ని లోక్‌సభ ఎన్నికల నాటికి గాడిలో పెట్టేందుకు గాను రెడ్యానాయక్‌కు కూడా కేసీఆర్ మంత్రిగా అవకాశం కల్పిస్తున్నట్టు తెలిసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలమలు బలంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారందరూ గంపగుత్తగా టీఆర్‌ఎస్ గెలుపు కోసం పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాల భోగట్టా. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్, హరీశ్‌రావు కాకుండా అదే సామాజికవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. ఈ సామాజికవర్గం నుంచి స్పష్టమైన ఖాళీలు ఉండటంతో ఆ స్థానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం కల్పించాలని కేసీఆర్ తలపోస్తున్నారట. కేసీఆర్‌కు మొదటినుంచి త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అంటే విపరీతమైన గురి. అదే సమయంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా చినజీయర్ భక్తుడే. ఈ నేపథ్యంలో దయాకర్‌రావును బాగా చూసుకోమని కేసీఆర్‌కు చినజీయర్ స్వామి చెప్పినట్లు పార్టీ వర్గాల కథనం.
ఎస్టీ రిజర్వ్‌డు విభాగం నుంచి డోర్నకల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి రెడ్యానాయక్ పేరు కూడా కేసీఆర్ పరిశీలనలో ఉందట. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డ్‌తోపాటు కేసీఆర్ తరానికి చెందిన నేతగా గుర్తుంపు ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశం. ఇది కాకుండా మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ బలహీనంగా ఉంది. ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే డోర్నకల్, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి మహబూబాబాద్‌ను పార్టీపరంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన నేతకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలనీ.. అదీ రెడ్యానాయక్‌కు ఇవ్వడం మంచిదనీ ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
ఎర్రబెల్లి, రెడ్యానాయక్‌ల సంగతి అలా ఉంచితే.. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా టీఆర్‌ఎస్‌కి వీరవిధేయుడుగా ఉన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ పేరు ఎర్రబెల్లి, రెడ్యాల కంటే ముందునుంచే బలంగా వినిపిస్తోంది. ఎలాంటి పదవులూ ఆశించకుండా పార్టీకి సేవలందిస్తున్న వినయ్ విషయంలో కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారట. వినయ్‌కి గతంలో పార్లమెంటరీ సెక్రటరీగా పదవి ఇచ్చినప్పటికీ కోర్టు ఉత్తర్వులతో ఆ పదవి పోయింది. ఈ తరుణంలో వినయ్‌కి కచ్చితంగా న్యాయంచేయాలని కేసీఆర్ ఫ్యామిలీ ఆలోచిస్తోందట. ఎట్టి పరిస్థితుల్లోనూ వినయ్‌భాస్కర్‌కు మంత్రి పదవి లేదా ఏదైనా క్యాబినెట్ హోదా కల్పించాలని డిసైడయ్యారట. వినయ్‌కి అవకాశమిస్తే ఒక బీసీకి, ఉద్యమకారుడికి, పార్టీకి వీరవిధేయుడుగా ఉన్న వ్యక్తికి న్యాయం చేసినట్లవుతుందన్న ఆలోచన వారికి ఉందట!
గతంలో వరంగల్ జిల్లాకు స్పీకర్ పదవి ఇచ్చిన నేపథ్యంలో ఈ దఫా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. అయితే ఈ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో చర్చ జరుగుతోంది. రెడ్యానాయక్ అయితే సీనియర్‌గా ఉంటారు. ఆయనకు ఇస్తే ఒకవైపు ఆయన రాజకీయ అనుభవాన్ని గౌరవించినట్టుగా ఉంటుంది. మరోవైపు ఎస్టీ సామాజికవర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్లు కూడా మంత్రివర్గ కూర్పు సమయంలో వినిపిస్తున్నప్పటికీ.. వీరిలో ఒక్క కడియంకే కొంత ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అది కూడా నలుగురికి అవకాశం కల్పిస్తేనే ఆ పదవి దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి ఆరూరి రమేశ్, తాటికొండ రాజయ్య పేర్లను పరిశీలిస్తున్నట్లు అక్కడక్కడా టాక్ వినిపిస్తోంది. కానీ అధిష్టానం మాత్రం వీరి విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి స్టెప్పు తీసుకోలేదట.
ఇక, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొందిన నన్నపనేని నరేందర్ కూడా తన అదృష్టాన్ని పరిశీలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నగరానికి సంబంధించి నరేందర్, వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, తాటికొండ రాజయ్యల ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో చల్లా ధర్మారెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం దాదాపుగా లేదంటున్నారు. ఆరూరి రమేశ్ పేరు అడపాదడపా వినిపిస్తోంది. నర్సంపేటకు సంబంధించి పెద్ది సుదర్శన్‌రెడ్డి గత ఎన్నికల్లో ఓడినప్పటికీ.. క్యాబినెట్ హోదా కలిగిన సివిల్ సప్లయీస్ ఛైర్మన్ పదవి ఇచ్చి గౌరవించిన సందర్భం ఉంది కాబట్టి ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం లేదట! మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ విషయంలో కేసీఆర్ నో చెప్పేశారట. అయినప్పటికీ శంకర్ నాయక్ బెర్త్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాకు సంబంధించి ఒక అధికారపార్టీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో పోలింగ్ పూర్తయిన తర్వాత కాంగ్రెస్‌పార్టీతో టచ్‌లోకి వెళ్లారట. ఒకవేళ ప్రజాకూటమి అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తే కండువా మారుస్తానని కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఇది కూడా పెద్ద దుమారం రేపుతోంది. సదరు ఎమ్మెల్యే విషయంలో ఇప్పటికే కేటీఆర్, కేసీఆర్‌లు ఒక నిర్ణయానికి వచ్చి అతని పేరును కూడా పలకడానికి ఇష్టపడటం లేదట.
మొత్తంమీద వరంగల్ జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గ ఎమ్మెల్యేలలో ఓ ముగ్గురిని మాత్రం కేబినెట్ హోదా వరించడం దాదాపుగా ఖాయమైంది. ఇందులో ఎవరు మంత్రులో, ఎవరు డిప్యూటీ స్పీకర్ అవుతారో కేసీఆర్ ఫైనల్ చేయాల్సి ఉంది. ఒకవేళ గతంకంటే సీట్లు ఎక్కువగా వచ్చాయన్న నేపథ్యంలో మరొకరిని కంటిన్యూ చేయాలనుకుంటే కడియంకు అవకాశం దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. నగరం పరిధిలో ఒకటి, రూరల్ పరిధిలో రెండు క్యాబినెట్ పోస్టులు ఇవ్వడానికి టీఆర్ఎస్ అధినేత డిసైడయ్యారట. మంత్రి పదవుల విషయంలో కేసీఆర్ ఏంచెబితే అదే జరుగుతుంది కాబట్టి ప్రతీ ఒక్కరూ ఆ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఓరుగల్లులో అమాత్య కిరీటం దక్కేదెవరికో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడక తప్పుదు!
Comments
Post a Comment