ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు అందాయి పోటీ మొదలు ఫలితాల దాకా.. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకునే వీలు



 పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పల్లెల్లో హడావుడి పెరిగింది. సర్పంచి పదవికి నామినేషన్‌ వేసేదెవరు.. ఉపసంహరించుకునే వారెవరు.. తుది పోరులో నిలిచేది ఎవరు.. అర్హతలేంటి.. ఇలాంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ tsec.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్తే.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారం ఇట్టే తెలిసిపోతుంది.
పోటీకి అర్హులేనా.. కాదా..
సర్పంచిగా పోటీ చేసే వారి కోసం ప్రత్యేకంగా క్యాండిడేట్‌ పోర్టల్‌ను రూపొందించారు. అభ్యర్థులు అనుసరించాల్సిన నియమావళిపై ఇందులో కరదీపిక ఉంటుంది. పోలింగ్‌ కేంద్రాలవారీగా ఓటర్ల జాబితా సైతం లభిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా గత ఎన్నికల్లో చేసిన ఖర్చును వెల్లడించకుండా అనర్హతకు గురైన వారి వివరాలూ ఇందులో ఉంటాయి. నామినేషన్‌ను సైతం ఆన్‌లైన్‌లో పూరించి, ప్రింట్‌ తీసి సంతకం చేసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పిస్తే సరిపోతుంది.
ఆన్‌లైన్‌లో ఓటర్‌ స్లిప్‌..
ఓటర్లు ఆన్‌లైన్‌లో ఓటరు స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గ్రామంలో గతంలో పోటీ చేసిన ప్రజాప్రతినిధుల వివరాలు, ప్రస్తుతం బరిలోఉన్న వారి సమాచారాన్నీ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను సైతం ఇందులో అప్‌లోడ్‌ చేయనున్నారు. ప్రజలకు అవసరమైన సమాచారం మొత్తం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని టీఎస్‌ఈసీ కార్యాలయ అధికారులు తెలిపారు. నామినేషన్లు, అఫిడవిట్ల పత్రాలన్నింటినీ స్కాన్‌ చేసి నమోదు చేయాలని మండల అధికారులకు సూచించామన్నారు. ఎన్నికలు ముగిసిన రోజు ఫలితాలు సైతం వెబ్‌సైట్‌లో ఉంచుతామని.. మీ గ్రామంలో ఎవరు గెలిచారో ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చని వివరించారు.
అధికారులకూ ఉపయోగమే..
క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను రూపొందించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు అనుసరించాల్సిన విధివిధానాలను అందులో పొందుపరిచారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ఎలా పర్యవేక్షించాలి... ఎన్నికలపై రూపొందించిన రిపోర్టును ఎలా సమర్పించాలనే అంశాలన్నీంటిని అందుబాటులో ఉంచారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!