అమిత్ షా రహస్య సర్వే.. వాళ్లు గెలవడం కష్టమేనట..!

బీజేపీ అంతర్గత సమీక్షలో వెల్లడి
కొందరికి టికెట్ల నిరాకరణ..?
షా, యడ్డీల ప్రత్యేక సర్వే
పలువురు సీనియర్ల స్థానాలు హుళక్కే
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వ్యూహం

మరికొద్ది నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ తమ మొత్తం 17మంది సిట్టింగ్‌ ఎంపీల నియోజకవర్గాల్లో అంతర్గత సమీక్ష నిర్వహించింది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం 20 ఎంపీ స్థానాలను గెలవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టింది. తొలిదశలో సిట్టింగ్‌ ఎంపీల నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలకు సైతం తెలియకుండా రెండు రహస్య సమీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఇందులో ఒక సమీక్ష స్వయానా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్వహించగా రెండో సమీక్షను బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు యడ్యూరప్ప నిర్వహించారు.
 
అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం సిట్టింగ్‌ ఎంపీలలో సురేశ్‌ అంగడి (బెళగావి), ప్రతాప్‌ సింహా(మైసూరు - కొడగు), శోభాకరంద్లాజే (చిక్కమగళూరు - ఉడిపి), అనంతకుమార్‌ హెగ్డే (ఉత్తర కన్నడ), భగవంత్‌ ఖూబా (బీదర్‌), పీసీ గద్దిగౌడర్‌ (బాగల్‌కోటె), కరడి సంగణ్ణ(కొప్పళ)ల విజయావకాశాలు 40శాతానికి మించి లేవని పార్టీ సమీక్షలో తేటతెల్లమైనట్లు తెలుస్తోంది. ఈ తాజా పరిణామం సహజంగానే బీజేపీని ఆందోళనకు గురి చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్దేశించిన టార్గెట్‌ - 20 నియోజకవర్గాల లక్ష్యాన్ని అందుకోవాలంటే వీరిలో కొందరికి టికెట్లు నిరాకరించి కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిందేనని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు పార్టీ అధిష్ఠానం ఆమోద ముద్ర వేస్తే ఆయా నియోజకవర్గాలలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏడుగురు ఎంపీలకుగాను కనీసం నలుగురికి టికెట్లు హుళుక్కయ్యే అవకాశం అధికమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
 
ప్రత్యేకించి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్పతో అంతంత మాత్రపు సంబంధాలు కలిగియున్న కేంద్రమంత్రి అనంతకుమార్‌ హెగ్డేకు కూడా ఈసారి టికెట్‌ నిరాకరించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని ఈ వర్గాలు అంటున్నాయి. యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలైన ఎంపీ శోభాకరంద్లాజే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది సర్వత్రా కుతూహలం రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా బెంగళూరు నార్త్‌ నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ జేడీఎస్‌ తరపున బరిలోకి దిగే అవకాశం ఉందని కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ ఈసారి చిక్కమగళూరు-ఉడిపి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్న కమలం ఎలాంటి నిర్ణయానికైనా వెనకాడేది లేనట్లుగా కనిపిస్తోంది.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!