పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఎన్నికల పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. జనవరి 21న తొలి విడత, 25న రెండో విడత, జనవరి 30న మూడో విడత పోలింగ్‌జరుగుతుందన్నారు.  తొలి విడత ఎన్నికల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21తో ముగుస్తుందని, రెండో విడత ఈ నెల 11న ప్రారంభమై 25తో, మూడో విడత 16న ప్రారంభమై 30తో ముగుస్తుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో 12,732 గ్రామ పంచాయతీలు.. 1,13,170 వార్డుల్లో ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,13, 190 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుందని, పోలింగ్‌ రోజే ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.
బ్యాలెట్‌ పేపర్లో నోటా గుర్తు
ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుందని నాగిరెడ్డి వెల్లడించారు.  తొలి విడతలో 4480 గ్రామ పంచాయతీలకు, రెండో విడతలో 4137 పంచాయతీలకు, మూడో విడతలో 4115 గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. సర్పంచ్‌లుగా పోటీ చేసిన అభ్యర్థులు (జనరల్‌) రూ.2000, రిజర్వుడు కేటగిరీ అయితే రూ.1000, వార్డు మెంబర్‌ (జనరల్‌) రూ.500, రిజర్వుడు అభ్యర్థి అయితే రూ.250 చొప్పున ధరావతుగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల ఖర్చుకు పరిమితి విధించినట్టు నాగిరెడ్డి స్పష్టంచేశారు. 5వేల జనాభా దాటిన పంచాయతీలైతే అభ్యర్థులు రూ.2,50,000 మించి ఖర్చు చేయరాదని, 5వేలు కంటే తక్కువ జనాభా కల్గిన గ్రామ పంచాయతీలైతే అభ్యర్థుల ఖర్చును 1,50,000గా నిర్ణయించినట్టు తెలిపారు. పరిమితికి మించి ఖర్చుచేస్తే పదవి కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!