తెలంగాణలో ఏ నోట విన్నా ఇవే మాటలు

ఎవరు మంత్రి కాబోతున్నారు? మళ్లీ ఈయనకే ఛాన్సట! ఆయనకేమో విప్ గ్యారెంటీ అట! ఆ పెద్దాయనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇస్తారట! ప్రస్తుతం ఏ నోట విన్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఈ చర్చంతా ఒక ఎత్తయితే.. తాజాగా ఆ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ పలువురు ఆశావహులతో వ్యక్తిగతంగా ప్రత్యేకంగా మాట్లాడారట! మరి ఆ నేతలకి కేసీఆర్‌ ఎలాంటి భరోసా ఇచ్చారు? సీఎంను కలిసిన తరవాత కొందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోవడానికి కారణమేంటి? ఇంతకీ ఏ జిల్లా రాజకీయం ఇది? వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
   
     ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అంత సులభంగా అంతు చిక్కవు. తలలు పండిన రాజకీయ నేతల అంచనాలే ఆయన విషయంలో తలకిందులవుతాయి. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఇటీవలే తొలి పర్యటనగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఓ రాత్రి కరీంనగర్‌లోని తన సొంత నివాసమైన ఉత్తర తెలంగాణ భవన్‌లో మకాం చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని నేతలంతా కలిశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఇతర ముఖ్య నేతలు ఆయనను కలిసినవారిలో ఉన్నారు. జిల్లాలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై కేసీఆర్ వారితో చర్చించారు. ఆ తర్వాత జిల్లానుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరు నేతలు సీఎంతో భేటీ అయ్యారట. ఆ మరుసటిరోజు ఉదయం కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నవారు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారట. అయితే ఉదయం జరిగిన సమావేశంలోనే ఆశావహులకు కేసీఆర్ ఓ క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
 
   కేసీఆర్‌ను కలిసిన జిల్లా ముఖ్యుల్లో మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నారు. వీరంతా సీఎంను ప్రత్యేకంగా కలిశారు. ఈటలకు ఈసారి స్పీకర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. సీఎంతో మీటయ్యాక దీనిపై మరింత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఈటలకు స్పీకర్ పదవి ఇస్తే.. గంగుల కమలాకర్‌కు, కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందట. లేదంటే కొప్పుల ఈశ్వర్‌కు స్పీకర్ పదవి ఇచ్చి.. ఈటలకు మంత్రి పదవి, గంగుల కమలాకర్‌కు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చే యోచన కూడా చేస్తున్నారట! ఇక ఎస్సీ కోటాలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు కూడా అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ పదవి వేరే జిల్లా ఎమ్మెల్యేకు ఇస్తే మాత్రం.. ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవులు ఖాయమని అంటున్నారు. ఇదే విషయంపై కేసీఆర్ వారికి సంకేతాలిచ్చినట్టు చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిని కలిశాక కొందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయట.
 
    ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. కేసీఆర్‌ పదవులు ఇచ్చే వరకూ ఈ సస్పెన్స్‌ వీడదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ వ్యూహాలపై రాజకీయ విశ్లేషకులు సైతం ఓ అంచనాకు రాలేకపోతున్నారు. సీనియర్లకే తిరిగి అవకాశం ఇచ్చినా ఇవ్వవచ్చు లేదా.. వారిని పక్కనపెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనూ వచ్చు అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ తరుణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచి అమాత్య కుర్చీని అధిరోహించేది ఎవరో తేలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!